
ఒళ్లు గగుర్పొడిచేలా యాక్సిడెంట్
గ్రేటర్ నోయిడాలో ఒళ్లు గగుర్పొడిచే స్థాయిలో రోడ్డు ప్రమాదం సంభవించింది.
న్యూఢిల్లీ: గ్రేటర్ నోయిడాలో ఒళ్లు గగుర్పొడిచే స్థాయిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకెళ్లే ఎక్స్‌ప్రెస్ వేలో ఓ స్విప్ట్ డిజైర్ కారు, లాంబోర్గిని కారు చేసిన పొరపాటు కారణంగా ఎలాంటి తప్పు లేకపోయినా వెనుకాలే వస్తున్న మరో కారు ప్రమాదానికి గురికావడమే కాకుండా అమాంతం గాల్లోకి లేచి వెళ్లి పక్కనే ఉన్న అడవిలోకి పల్టీలు కొట్టుకుంటూ పడిపోయింది. దీంతో ఆ కారులోని వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలో చనిపోయాడు. ప్రమాదానికి కారణమైన స్విప్ట్ డిజైర్ కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. లాంబోర్గిని కారు డ్రైవర్ ఇంకా దొరకలేదు.
వివరాల్లోకి వెళితే.. గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్ వేలో సరిగ్గా ఢిల్లీకి సమీపంలోని నోయిడా సెక్టార్ 135 వద్ద వాహనాలు వేగంగా దూసుకెళుతున్న సమయంలో తన మార్గంలో వెళుతున్న ఓ స్విప్ట్ డిజైర్ కారు లాంబోర్గిని కారును అనూహ్యంగా అతి సమీపంలో నుంచి ఓవర్ టేక్ చేసింది. దీంతో లాంబోర్గిని కారు డ్రైవర్ తాను వెళ్లే లైన్‌లో నుంచి పూర్తిగా ఎడమపక్కన లైన్‌లోకి తన కారును పోనిచ్చాడు. దీంతో ఆ మార్గంలో వీరి వాహనాలకు సమాన వేగంలో వస్తున్న మారుతీ ఎకో వాహనం అమాంతం లాంబోర్గికి తాకి పల్టీ కొట్టి గాల్లోకి లేచి రోడ్డుపక్కనే ఉన్న ఫారెస్ట్‌లో పడిపోయింది. ఫలితంగా అందులో ఉన్న 20ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈ భయానక వీడియో ఎక్స్‌ప్రెస్ వేపై ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.