Crime News: With TV Show Inspiration Noida Woman Fakes Death - Sakshi
Sakshi News home page

తీస్తే మరో దృశ్యం సినిమా అవుతుందేమో!.. గొంతుకోసి.. వేడినూనె, యాసిడ్‌తో ముఖం కాల్చేసి..

Published Fri, Dec 2 2022 7:57 PM | Last Updated on Fri, Dec 2 2022 8:54 PM

Crime News: With TV Show Inspiration Noida Woman Fakes Death - Sakshi

క్రైమ్‌: దృశ్యం సినిమాలో రాంబాబు పాత్ర పెద్దగా చదువుకోదు. కేవలం.. తాను సంపాదించుకున్న సినిమా నాలెడ్జ్‌తోనే వరుణ్‌ మిస్సింగ్‌(మర్డర్‌) కేసు నుంచి కుటుంబాన్ని రక్షించుకుంటూ వస్తాడు. అయితే నిజజీవితంలోనూ సినిమాలు, టీవీ సీరియళ్లు.. నేరాలకు స్ఫూర్తిగా నిలవడం తరచూ చూస్తుంటాం. తాజాగా..  గ్రేటర్‌ నోయిడాలో బయటపడ్డ ఉదంతం విస్మయాన్ని కలిగిస్తోంది. 

పాయల్‌.. గ్రేటర్‌ నోయిడాకు పదిహేను కిలోమీటర్ల దూరంలోని బధ్పురా గ్రామవాసి. తల్లిదండ్రుల గారాల బిడ్డగా పెరిగింది. పెళ్లీడూ వచ్చాక.. సంబంధాలు వెతకడం ప్రారంభించారు ఆమె తల్లిదండ్రులు. అయితే తాను అజయ్‌ను ప్రేమించిన విషయాన్ని చెప్పడానికి ఆమె తటపటాయిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఊహించని విషాదం ఆ కుటుంబాన్ని కమ్మేసింది. 

వ్యాపారంలో నష్టాలు పూడ్చుకునేందుకు పాయల్‌ తండ్రి బోలెడంత అప్పులు చేశాడు. ఆ భారం కొండంత కావడంతో.. భరించలేకపోయాడు. భార్యతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథ అయిన పాయల్‌కు.. అజయ్‌ ఆదరణ లభించింది. కానీ, కన్నవాళ్లు లేకపోవడంతో కుమిలిపోయింది పాయల్‌. ఆ బాధతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఓరోజు.. ఇంట్లోనే పాయల్‌ నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకుందనే వార్త స్థానికంగా విషాదం నింపింది. పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న ఆమె మృతదేహానికి బంధువుల అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు కూడా సూసైడ్‌ కేసుగా క్లోజ్‌ చేశారు. పాయల్‌ దూరమైందన్న బాధతో దేశాలు పట్టుకుపోయాడు అజయ్‌. కట్‌ చేస్తే.. 

అదే ఏరియాలో ఓ యువతి మిస్సింగ్‌ కంప్లయింట్‌ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఎంత వెతికినా  ఆమె జాడను కనిపెట్టలేకపోయారు పోలీసులు. దీంతో గౌర్‌ సిటీ ఏరియాలో ఆమె పని చేసే మాల్‌ దగ్గర నుంచి విచారణ మొదలుపెట్టారు. ఈ క్రమంలో..   బధ్పురాకు చెందిన అజయ్‌, మిస్సింగ్‌ యువతికి మంచి స్నేహితుడని తేలింది. దీంతో.. పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది. పాయల్‌ కోసమే తాను అదంతా చేశానని, పాయల్‌ బతికే ఉందన్న షాకింగ్‌ విషయాన్ని బయటపెడ్డాడు. 

తండ్రి చేసిన అప్పుల నుంచి తప్పించుకునేందుకు మరో వ్యక్తిని చంపి.. తన ప్లేస్‌లో ఆ శవాన్ని ఉంచి.. చనిపోయినట్లు నాటకం ఆడినట్లు ఒప్పుకుందామె. తాను చూసిన ఓ టీవీ షో స్ఫూర్తితోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపింది పాయల్‌. ఇందుకోసం ముందుగా అజయ్‌.. పాయల్‌ ఫిజిక్‌తో సరిపోలిన మాల్‌లో పని చేసే యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆపై ఆమెను నమ్మించి..ఓరోజు పాయల్‌ ఇంటికి తీసుకొచ్చాడు. గొంతు కోసి, ముఖం ఎవరూ గుర్తుపట్టకుండా వేడి నూనె, యాసిడ్‌ పోసి.. ఆపై బాడీకి నిప్పటించారు ఆ లవ్‌బర్డ్స్‌. ప్లాన్‌ ప్రకారం ముందుగా పాయల్‌, కొన్నిరోజుల గ్యాప్‌లో అజయ్‌.. ఇద్దరూ ఆ ఊరిని విడిచిపెట్టారు. బాధితురాలు కనిపించడం లేదన్న ఫిర్యాదుతో ఈ మొత్తం నేరం బయటపడింది. ఇద్దరినీ అరెస్ట్‌ చేసిన పోలీసులు.. వాళ్ల నుంచి ఓ రివాల్వర్‌ను సైతం స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: బలవంతంగా కామాంధుల చెంతకు.. ఆపై..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement