
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : గ్రెటర్ నోయిడాలో జంట హత్యలు కేసు స్థానికులను ఆందోళన కలిగిస్తోంది. చెర్రి కౌంటీ సొసైటీ తొమ్మిదో అంతస్తులో నివాసం ఉంటున్న కిరాణా షాప్ యజమాని అతని భార్య రక్తపు మడుగులో కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటన బుధవారం బిస్రఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అనుమానాస్పద కేసుగా నమోదు చేశామని పోలీసులు తెలిపారు. మృతులు వినయ్ గుప్త(50), నేహా గుప్తలుగా గుర్తించారు. కొన్ని నెలలుగా కిరాణా షాప్ నడుపుతూ ఈ ప్లాట్‌లో ఉంటున్నారని అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ లవ్ కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, హత్య వెనుకాల దంపతులకు తెలిసిన వారి హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
స్థానిక పోలీస్ స్టేషన్, స్పేషల్ ఆపరేషన్స్ గ్రూప్, ఫోరెన్సిక్, సర్‌వేలైన్స్ విభాగం అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారని, డాగ్ స్వ్కాడ్ సేవలు కూడా తీసుకుంటున్నామని ఏసీపీ అన్నారు. అడిషనల్ కమిషనర్ కుమార్ విలేకరులతో మట్లాడుతూ.. ‘దోపిడి చేసే ఉద్ధేషంతో ఈ హత్యకు పాల్పడినట్లు కనిపించడంలేదు. ఇంట్లోని వస్తువులు ఎక్కడాకూడా చెల్లాచెదురుగా పడిలేవు. బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించినట్టు ఏ విధమైన ఆనవాలు కనిపించలేదు. వీరికి తెలిసిన వారే ఇంటిలోని బలమైన వస్తువులను ఉపయోగించి హతమార్చి ఉంటారని భావిస్తున్నామ’న్నారు.