లోయలో పడిన బస్సు
17 మంది మృత్యువాత ఉత్తరాఖండ్‌లో దుర్ఘటన
గోపేశ్వర్: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేటు బస్సు లోయ లో పడిన దుర్ఘటనలో 17 మంది మృతి చెందగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఏడుగురు మహిళలే. ఛమోలీ జిల్లాలో శనివారం మధ్యాహ్నం 12.45 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛమోలీ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నంద్ కిశోర్ జోషీ తెలిపిన వివరాల ప్రకారం.. ఘాట్ ప్రాంతానికి చెందిన 22 మంది గ్రామస్తులు రిషికేశ్ నుంచి స్వగ్రామానికి ఓ ప్రైవేటు బస్సులో బయలుదేరారు.
మరో అర కిలోమీటరు ప్రయాణిస్తే గమ్యస్థానం చేరుకుంటారనగా.. నందప్రయాగ ఘాట్ ప్రాంతంలో బస్సు అదుపుతప్పి 300 మీటర్ల లోతున్న లోయలో పడిపోయింది. దీంతో బస్సు తునాతునకలైపోయి.. అందులోని ప్రయాణికులు చెల్లాచెదురుగా పడిపోయారు. 15 మంది అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. గాయపడిన ఐదుగురిని ఛమోలీ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు ప్రమాద ఘటనపై ఉత్తరాఖండ్ గవర్నర్ అజీజ్ ఖురేషీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్ రావత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని వారు అధికారులను ఆదేశించారు.