
గుల్బర్గ్ దోషులకు యావజ్జీవం
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన గుల్బర్గ్ నరమేధం కేసులో దోషులకు ప్రత్యేక సిట్ న్యాయస్థానం శిక్షలు ఖరారు చేసింది.
11 మందికి జీవితఖైదు విధించిన ప్రత్యేక కోర్టు
- దోషులకు నేరచరిత్ర లేనందున మరణశిక్ష విధించేందుకు నిరాకరణ
- తీర్పుపై జాకియా జాఫ్రీ అసంతృప్తి, హైకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడి
అహ్మదాబాద్: దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన గుల్బర్గ్ నరమేధం కేసులో దోషులకు ప్రత్యేక సిట్ న్యాయస్థానం శిక్షలు ఖరారు చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో దోషులుగా తేలిన 24 మందిలో 11 మందికి కోర్టు జీవితఖైదు, ఒకరికి పదేళ్ల జైలు, మరో 12 మందికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. మొత్తం 24 మంది దోషులకు మరణశిక్ష లేదా మరణించే వరకూ జీవితఖైదు విధించాలని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాదులు వాదించినా.. న్యాయస్థానం వారి వాదనలను తోసిపుచ్చింది. దోషులకు నేర చరిత్ర లేనందున వారికి మరణశిక్ష విధించలేకపోతున్నట్టు పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం స్పెషల్ సిట్ కోర్టు న్యాయమూర్తి పీబీ దేశాయ్ తీర్పు వెలువరించారు. తీర్పు వెలువరించే సందర్భంగా న్యాయమూర్తి నాగరిక సమాజంలో గుల్బర్గ్ సొసైటీ మారణహోమం ఘటన ఒక చీకటి రోజని పేర్కొన్నారు. హత్య అభియోగాల్లో దోషులుగా తేలిన 11 మందికి జీవితఖైదు విధిస్తున్నామని, 14 ఏళ్ల తర్వాత వీరికి క్షమాభిక్ష ఇచ్చేందుకు ప్రయత్నించవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
జీవితఖైదు విధించిన దోషులు: కైలాశ్ దోబీ, యోగేంద్ర షెకావత్, జయేశ్ జింగర్, క్రిష్ణ కలాల్, జయేశ్ పర్మర్, రాజు తివారీ, భరత్ రాజ్‌పుత్, దినేశ్ శర్మ, నారాయణ్ తంక్, లఖన్‌సిన్హ్ చుడాసమా, భరత్ తాయిలీ.
న్యాయం జరగలేదు: జాకియా జాఫ్రీ
కోర్టు తీర్పుపై ఎహ్సాన్ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ, సామాజిక కార్యకర్త, న్యాయవాది తీస్తా సెతల్వాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిందితులందరికీ జీవితఖైదు విధించాల్సిందని జాకి యా అభిప్రాయపడ్డారు. దోషులకు వేసిన శిక్ష లు చాలా స్వల్పమని, తమకు న్యాయం జరగలేదని, దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు.
ఎంపీ జాఫ్రీయే కాల్చారు!: 2002 గుల్బర్గ్ సొసైటీ హత్యాకాండలో ఎలాంటి కుట్రకోణం లేదని ప్రత్యేక కోర్టు అభిప్రాయపడింది. నాటి ఘటనలో కాంగ్రెస్ ఎంపీ హసన్ జాఫ్రీ ప్రైవే టు తుపాకీతో కాల్పులు (ఎనిమిది రౌండ్లు) జరపటం.. ఇందులో ఒక వ్యక్తి మరణించటం, 15 మందికి గాయాలు కావటంతో అల్లరిమూకలు రెచ్చిపోయారని కోర్టు వ్యాఖ్యానించింది. గుల్బర్గ్ సొసైటీలోని వివిధ ప్రాంతాలనుంచి ఎంపీ జాఫ్రీ కాల్పులు జరిపారని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పీబీ దేశాయ్ తెలిపారు.
అసలేం జరిగింది..
2002 ఫిబ్రవరి 27న గోద్రా స్టేషన్‌లో సబర్మతీ ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్6 బోగీని దుండగులు తగులబెట్టారు. ఆ బోగీలో అయోధ్యకు వెళ్తున్న 58 మంది కరసేవకులు సజీవదహనమయ్యారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 28న గుజరాత్‌లోని అహ్మదాబాద్ నడిబొడ్డున ఉన్న గుల్బర్గ్ సొసైటీపై 400 మంది దుండగులు ఒక్కసారిగా దాడి చేశారు. అందులో నివసిస్తున్న వారిని విచక్షణారహితంగా కొట్టారు. పలువురిని సజీవంగా తగులబెట్టారు. ఊచకోత ఘటనలో నాటి కాంగ్రెస్ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ సహా 69 మంది బలయ్యారు. జాఫ్రీని దుండగులు బయటకు ఈడ్చుకొచ్చి అత్యంత కిరాతకంగా చంపి తగులబెట్టారు.
ఈ సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్న సంగతి తెలిసిందే. 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి నమోదైన తొమ్మిది కేసుల్లో ఇది కూడా ఒకటి. ఈ కేసును సుప్రీంకోర్టు నియమించిన సిట్ దర్యాప్తు చేసింది. జూన్ 2న ఈ కేసులో 11 మందిని హత్యానేరం కింద దోషులుగా ప్రత్యేక సిట్ కోర్టు ప్రకటించింది. మరో 13 మందిని హత్యానేరం కంటే తక్కువ నేరాల కింద దోషులుగా ఖరారు చేసింది. సరైన ఆధారాలు లేనందున మరో 36 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ కేసులో మొత్తం 338 మంది సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేశారు. నలుగురు వేర్వేరు న్యాయమూర్తులు కేసును విచారించారు. జాఫ్రీ భార్య జకియా 77 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ఉన్నప్పటికీ తనకు జరిగిన అన్యాయంపై అలుపెరగకుండా పోరాడారు.