* మొత్తం 112 మందికి అవార్డులు ప్రకటించిన కేంద్రం
* జాబితాలో 14 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు
* రజనీ, రామోజీలకు పద్మవిభూషణ్.. సానియా, సైనాలకు పద్మభూషణ్
సాక్షి, న్యూఢిల్లీ:
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు, సూపర్ స్టార్ రజనీకాంత్‌లకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మవిభూషణ్ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి మంగళవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం సోమవారం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 112 మందికి ఈ అవార్డులను ప్రతిపాదించగా రాష్ట్రపతి ఆమోదించారు. రామోజీరావు, రజనీకాంత్ సహా 10 మందికి పద్మవిభూషణ్; యార్గగడ్డ లక్ష్మీప్రసాద్, డి.నాగేశ్వర్‌రెడ్డి సహా 19 మందికి పద్మభూషణ్; లక్ష్మాగౌడ్, ఎస్.ఎస్.రాజమౌళి సహా 83 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. కేంద్ర హోంశాఖ ప్రకటించిన ఈ జాబితాలో మొత్తం 19 మంది మహిళలు ఉండగా.. పది మంది విదేశీయులు, ప్రవాస భారతీయులు, భారత సంతతికి చెందిన వారు ఉన్నారు. కళలు, సామాజిక సేవ, ప్రజాసంబంధాలు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌర సేవలు వంటి రంగాల్లోవిశిష్ట సేవలు అందించిన వారికి ఈ పురస్కారాలను ప్రకటిస్తారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే ఈ అవార్డులను ఏటా మార్చి, ఏప్రిల్‌లో జరిగే ప్రత్యేక వేడుకలో రాష్ట్రపతి ప్రదానం చేస్తారు.
ఈ ఏడాది పద్మ అవార్డులకు ఎంపికైన వారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మొత్తం 14 మంది తెలుగువారు ఉండటం విశేషం. పద్మవిభూషణ్ పురస్కారాల జాబితాలో యామినీ కృష్ణమూర్తి, రామోజీరావులకు చోటు దక్కింది. పద్మభూషణ్ పురస్కారాల జాబితాలో సాహితీవేత్త డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుడు ప్రొఫెసర్ డి.నాగేశ్వరరెడ్డి, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో డాక్టర్ ఆళ్ల వెంకట రామారావు, క్రీడల్లో సైనా నెహ్వాల్, సానియా మీర్జాలకు చోటు దక్కింది. ఇక పద్మశ్రీ అందుకోనున్న వారిలో దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, పెయింటింగ్‌లో కె.లక్ష్మాగౌడ్, వైద్యంలో డాక్టర్ మన్నం గోపీచంద్, డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణగోఖలే, డాక్టర్ నాయుడమ్మ యార్లగడ్డ, సామాజిక సేవ రంగంలో సునీతాకృష్ణన్, డాక్టర్ టి.వి.నారాయణ ఉన్నారు. ఈ ఏడాది పద్మ అవార్డులకు ఎంపిక చేసిన 112 మందిలో 12 మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన వారు ఉన్నారు. నలుగురు ఎస్సీ, నలుగురు ఎస్సీ, నలుగురు ఓబీసీలు ఉన్నట్లు కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అవార్డులకు ఎంపికైన వారిలో అత్యధికంగా 18 మంది ఢిల్లీ నుంచి ఉంటే.. మహారాష్ట్ర నుంచి 16 మంది, ఉత్తరప్రదేశ్ నుంచి 12 మంది, కర్ణాటక నుంచి 11 మంది ఉన్నారు.
.
.
పద్మవిభూషణ్ పురస్కారాలు
పేరు రంగం రాష్ట్రం
1. యామినీ కృష్ణమూర్తి శాస్త్రీయ నృత్యం ఢిల్లీ
2. రజినీకాంత్ సినిమా తమిళనాడు
3. గిరిజాదేవి శాస్త్రీయ గాత్రసంగీతం పశ్చిమబెంగాల్
4. రామోజీరావు జర్నలిజం ఆంధ్రప్రదేశ్
5. డాక్టర్ విశ్వనాథన్ శాంత వైద్యం తమిళనాడు
6. శ్రీశ్రీ రవిశంకర్ ఆధ్యాత్మికం కర్ణాటక
7. జగ్‌మోహన్ ప్రజాసంబంధాలు ఢిల్లీ
8. డాక్టర్ వాసుదేవ్ ఆత్రే సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కర్ణాటక
9. అవినాష్ దీక్షిత్ సాహిత్యం, విద్య యూఎస్‌ఏ
10. ధీరూభాయ్ అంబానీ (మరణానంతరం) వాణిజ్యం, పరిశ్రమలు మహారాష్ట్ర
.
పద్మభూషణ్
11. అనుపమ్‌ఖేర్ సినిమా మహారాష్ట్ర
12. ఉదిత్ నారాయణ్ ఝా నేపథ్య గానం మహారాష్ట్ర
13. రామ్ వి.సుతర్ శిల్పి ఉత్తరప్రదేశ్
14. హీస్నమ్ కన్హయ్యలాల్ థియేటర్ మణిపూర్
15. వినోద్ రాయ్ సివిల్ సర్వీస్ కేరళ
16. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సాహిత్యం, విద్య ఆంధ్రప్రదేశ్
17. ఎన్.ఎస్.రామనుజ తాతాచార్య సాహిత్యం మహారాష్ట్ర
18. బర్జీందర్‌సింగ్ హమ్‌దర్ద్ సాహిత్యం పంజాబ్
19. ప్రొఫెసర్ డి.నాగేశ్వరరెడ్డి వైద్యం తెలంగాణ
20. స్వామి తేజోమయానంద ఆధ్యాత్మికం మహారాష్ట్ర
21. హఫీజ్ కాంట్రాక్టర్ ఆర్కిటెక్చర్ మహారాష్ట్ర
22. రవీంద్ర చంద్ర భార్గవ ప్రజాసంబంధాలు ఉత్తరప్రదేశ్
23. ఆళ్ల వెంకట రామారావు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆంధ్రప్రదేశ్
24. సైనా నెహ్వాల్ స్పోర్ట్స్ - బ్యాడ్మింటన్ తెలంగాణ
25. సానియా మీర్జా స్టోర్ట్స్ - టెన్నిస్ తెలంగాణ
26. ఇందూజైన్ వర్తకం ఢిల్లీ
27. స్వామి దయానంద్ సరస్వతి (మరణానంతరం) ఆధ్యాత్మికం ఉత్తరాఖండ్
28. రాబర్ట్ బ్లాక్‌విల్ ప్రజాసంబంధాలు అమెరికా
29. పల్లోంజీ షాపూర్‌జీ మిస్త్రీ వర్తకం ఐర్లాండ్
.
పద్మశ్రీ పురస్కారాలు
30. ప్రతిభాప్రహ్లాద్ శాస్త్రీయ నృత్యం ఢిల్లీ
31. భీకూదన్ గద్వీ జానపద సంగీతం గుజరాత్
32. శ్రీభాస్ చంద్ర సుపాకర్ టెక్స్‌టైల్ డిజైనింగ్ ఉత్తరప్రదేశ్
33. అజయ్ దేవ్‌గణ్ సినిమా మహారాష్ట్ర
34. ప్రియాంక చోప్రా సినిమా మహారాష్ట్ర
35. తులసీదాస్ బోర్కర్ శాస్త్రీయ సంగీతం గోవా
36. సోమ ఘోష్ గాత్ర సంగీతం ఉత్తరప్రదేశ్
37. నీలా మదప్ పండా కళలు ఢిల్లీ
38. ఎస్.ఎస్.రాజమౌళి సినిమా కర్ణాటక
39. మధుర్ భండార్కర్ సినిమా మహారాష్ట్ర
40. ఎం.వెంకటేశ్‌కుమార్ జానపదం కర్ణాటక
41. గులాబీ సపేరా జానపదం రాజస్తాన్
42. మమత్రా చంద్రార్కర్ జానపదం ఛత్తీస్‌గఢ్
43. మాలినీ అవస్తీ జానపదం యూపీ
44. జయ్‌ప్రకాష్ లేఖీవాల్ పెయింటింగ్ ఢిల్లీ
45. కె.లక్ష్మాగౌడ్ పెయింటింగ్ తెలంగాణ
46. బాల్‌చంద్ర దత్తాత్రేయ్ మోండే ఫొటోగ్రఫీ మధ్యప్రదేశ్
47. నరే శ్ చందర్ లాల సినిమా అండమాన్
48. ధీరేంద్ర నాథ్ బెజ్‌బారువా సాహిత్యం అస్సాం
49. ప్రహ్లాద్ చంద్ర టాసా సాహిత్యం అస్సాం
50. డాక్టర్ రవీంద్ర నాగర్ సాహిత్యం ఢిల్లీ
51. దాహ్యాభాయ్ శాస్త్రి సాహిత్యం గుజరాత్
52. డాక్టర్ సంతేషివర బైరప్ప సాహిత్యం కర్ణాటక
53. హల్దర్ నాగ్ సాహిత్యం ఒడిశా
54. కామేశ్వరం బ్రహ్మ జర్నలిజం అస్సాం
55. పుష్పేష్ పంత్ జర్నలిజం ఢిల్లీ
56. జవహర్‌లాల్ కౌల్ జర్నలిజం జమ్మూకశ్మీర్
57. అశోక్ మాలిక్ సాహిత్యం ఢిల్లీ
58. మన్నం గోపీచంద్ వైద్యం తెలంగాణ
59. రవికాంత్ ైవె ద్యం ఉత్తరప్రదేశ్
60. రాం హర్ష్‌సింగ్ వైద్యం ఉత్తరప్రదేశ్
61. శివ్‌నారాయణ కురీల్ వైద్యం ఉత్తరప్రదేశ్
62. సవ్యసాచి సర్కార్ వైద్యం ఉత్తరప్రదేశ్
63. ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే వైద్యం ఆంధ్రప్రదేశ్
64. టి.కె.లాహిరి వైద్యం ఉత్తరప్రదేశ్
65. ప్రవీణ్ చంద్ర వైద్యం ఢిల్లీ
66. దల్జీత్‌సింగ్ గంభీర్ వైద్యం ఉత్తరప్రదేశ్
67. చంద్రశేఖర్ శేషాద్రి వైద్యం తమిళనాడు
68. అనిల్‌కుమారి మల్హోత్రా వైద్యం ఢిల్లీ
69. ఎం.వి.పద్మ శ్రీవాస్తవ వైద్యం ఢిల్లీ
70. సుధీర్ వి.షా వైద్యం గుజరాత్
71. ఎం.ఎం.జోషి వైద్యం కర్ణాటక
72. జాన్ ఎబ్‌నెజర్ వైద్యం కర్ణాటక
73. నాయుడమ్మ యార్లగడ్డ వైద్యం ఆంధ్రప్రదేశ్
74. సైమన్ ఓరాన్ పర్యావరణం జార్ఖండ్
75. ఇంతియాజ్ ఖురేషి పాకశాస్త్రం ఢిల్లీ
76. పీయూష్ పాండే వాణిజ్య ప్రకటనలు మహారాష్ట్ర
77. సుభాష్ పాలేకర్ సేద్యం మహారాష్ట్ర
78. రవిందర్ కుమార్ సిన్హా వన్యమృగ సంరక్షణ బిహార్
79. హెచ్.ఆర్.నాగేంద్ర యోగా కర్ణాటక
80. ఎం.సి.మెహతా ప్రజాసంబంధాలు ఢిల్లీ
81. ఎం.ఎన్.కృష్ణ మణి ప్రజాసంబంధాలు ఢిల్లీ
82. ఉజ్వల్ నికమ్ ప్రజాసంబంధాలు మహారాష్ట్ర
83. టొఖేహో సేమ ప్రజాసంబంధాలు నాగాలాండ్
84. సతీష్‌కుమార్ సైన్స్, ఇంజనీరింగ్ ఢిల్లీ
85. ఎం.అన్నాదురై సైన్స్, ఇంజనీరింగ్ కర్ణాటక
86. దీపాంకర్ ఛటర్జీ సైన్స్, ఇంజనీరింగ్ కర్ణాటక
87. గణపతి దాదాసాహెబ్ యాదవ్ సైన్స్, ఇంజనీరింగ్ మహారాష్ట్ర
88. వీణా టాండన్ సైన్స్, ఇంజనీరింగ్ మేఘాలయ
89. ఓంకార్‌నాథ్ శ్రీవాస్తవ సైన్స్, ఇంజనీరింగ్ ఉత్తరప్రదేశ్
90. సునీతాకృష్ణన్ సామాజిక సేవ ఆంధ్రప్రదేశ్
91. అజోయ్‌కుమార్ దత్తా సామాజిక సేవ అస్సాం
92. ఎం.పండిట్ దాసా సామాజిక సేవ కర్ణాటక
93. పి.పి.గోపినాథన్ నాయర్ సామాజిక సేవ కేరళ
94. మడేలైన్ హెర్మన్ డె బ్లిక్ సామాజిక సేవ పుదుచ్చేరి
95. శ్రీనివాసన్ డమల్ కందలాయి సామాజిక సేవ తమిళనాడు
96. సుధాకర్ ఓల్వే సామాజిక సేవ మహారాష్ట్ర
97. టి.వి.నారాయణ సామాజిక సేవ తెలంగాణ
98. అరుణాచలం మురుగంతం సామాజిక సేవ తమిళనాడు
99. దీపికా కుమారి క్రీడలు - విలువిద్య జార్ఖండ్
100. సుశీల్ దోశి క్రీడలు - వ్యాఖ్యానం మధ్యప్రదేశ్
101. మహేష్ శర్మ వాణిజ్యం ఢిల్లీ
102. సౌరభ్ శ్రీవాస్తవ వాణిజ్యం ఢిల్లీ
103. దిలీప్ సంఘ్వీ వాణిజ్యం మహారాష్ట్ర
104. డాక్టర్ కేకి హార్మస్‌జీ ఘర్దా వాణిజ్యం మహారాష్ట్ర
105. ప్రకాశ్ చంద్ సురానా (మరణానంతరం) శాస్త్రీయ సంగీతం రాజస్తాన్
106. సయీద్ జాఫ్రీ (మరణానంతరం) సినిమా బ్రిటన్
107. మైఖేల్ పోస్టల్ పురావస్తు ఫ్రాన్స్
108. సల్మాన్ అమీన్ సల్ ఖాన్ సాహిత్యం అమెరికా
109. హుయ్ లాన్ జంగ్ యోగా చైనా
110. ప్రెడ్రగ్ కె. నైకిక్ యోగా సెర్బియా
111. సుందర్ ఆదిత్య మీనన్ సామాజిక సేవ అరబ్ ఎమిరేట్స్
112. అజయ్‌పాల్‌సింగ్ బంగా వాణిజ్యం అమెరికా
సూపర్‌స్టార్ రజనీ...
నాలుగు దశాబ్దాల సినీ నటనతో అభిమానుల మనసులు చూరగొనటమే కాదు.. తమిళనాట ఒక దేవతామూర్తి హోదా సంపాదించుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్. ఆయన 1975లో కె.బాలచందర్ దర్శకత్వంలోని అపూర్వ రాగంగళ్ చిత్రంలో సినీ రంగంలోకి ప్రవేశించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ సినిమాల్లోనూ ఆయన నటించారు. దళపతి, శివాజీ, ఏంతిరన్ వంటి ఆయన సినిమాలు చాలా ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం 65 ఏళ్ల వయసున్న రజనీ ఇంతకుముందు పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. రజనీకి పద్మభూషణ్ అవార్డు ప్రకటించటం పట్ల సినీ రంగ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆయన కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య, అల్లుడు ధనుష్ సహా అభిమానుల నుంచి ఫేస్‌బుక్, ట్విటర్ సామాజిక వెబ్‌సైట్లలో రజనీకి అభినందనలు వెల్లువెత్తాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా రజనీకాంత్‌కు అభినందనలు తెలిపారు. తనకు పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించటం.. తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని రజనీ ట్విటర్‌లో స్పందించారు. అభిమానులు, శ్రేయోభిలాషులు, స్నేహితులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
నటమయూరి యామినీ...
నాట్యంపై అమితమైన ఇష్టంతో చిన్న వయసు నుంచే శిక్షణ పొందుతూ భరతనాట్యం, కూచిపూడి నాట్యాల్లో శిఖరాగ్రాలకు చేరిన కళాకారిణి యామినీ కృష్ణమూర్తి. ఆమె 1940లో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో జన్మించారు. రుక్మిణీదేవి అరుండేళ్, కాంచీపురం ఎల్లప్పపిళ్లై, తంజావూర్ కిట్టప్ప పిళ్లైల వద్ద భరతనాట్యం శిక్షణ పొందిన ఆమె.. వేదాంతం లక్ష్మీనారాయణశాస్త్రి, చింతా కృష్ణమూర్తి, పశుమర్తి వేణుగోపాల్ కృష్ణశర్మల మార్గదర్శకత్వంలో కూచిపూడి నృత్యం అభ్యసించారు. ఒడిస్సీ నృత్యాన్ని కూడా ఆమె అభ్యసించారు. 1957లోనే తొలి ప్రదర్శన ఇచ్చిన యామినీ అనతికాలంలోనే అగ్రగామి సంప్రదాయ నృత్యకళాకారిణి స్థానాన్ని చేరుకున్నారు. 1990లో ఢిల్లీలో యామినీ స్కూల్ ఆఫ్ డ్యాన్స్‌ను నెలకొల్పి నృత్యశిక్షణను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం 75 ఏళ్ల వయసున్న యామినీ గతంలోనే సంగీత నాటక అకాడమీ అవార్డుతో పాటు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు.
పద్మశ్రీ రావడం సంతోషం: సుభాష్ పాలేకర్
అమలాపురం: పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక కావడం పట్ల ప్రకృతి వ్యవసాయ పితామహుడు, ఉద్యమకారుడు సుభాష్ పాలేకర్ సంతోషం వ్యక్తం చేశారు. ఆయన ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సర్పవరంలో పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. పద్మ పురస్కారానికి ఎంపికైన విషయం తెలిసిన వెంటనే శిష్యులు, అభిమానులు పాలేకర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అవార్డు రావడంపై ఆయన స్పందిస్తూ... తాను అవార్డుల కోసం ఈ ఉద్యమాన్ని నిర్వహించలేదని, తన శ్రమను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేయడం సంతోషాన్నిచ్చిందన్నారు.
విలక్షణ నటుడు అనుపమ్‌ఖేర్
బాలీవుడ్ సినిమాల్లో క్యారెక్టర్ పాత్రల్లో జీవించే అనుపమ్‌ఖేర్ విలక్షణ నటుడిగా ఖ్యాతిగడించారు. మూడు దశాబ్దాలుగా సినీ నటన కొనసాగిస్తున్న ఖేర్.. తనకు పద్మభూషణ్ అవార్డు ద్వారా లభించిన గుర్తింపు ఒక గౌరవంగా భావిస్తున్నట్లు హర్షం వ్యక్తంచేశారు. ‘‘ఒక ప్రవాస కశ్మీరీ పండిట్ కుమారుడికి.. ఒక చిన్న పట్టణంలో అటవీ విభాగంలో క్లర్కుగా పనిచేసిన వ్యక్తి కృషిని గుర్తిస్తూ ఈ రోజు ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డు లభించింది. నా దేశానికి కృతజ్ఞతలు’’ అని ఆయన ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.
రాజకీయాధికారి జగ్‌మోహన్
1927లో ప్రస్తుత పాకిస్తాన్‌లోని హఫీజాబాద్ అనే పట్టణంలో జన్మించారు. స్వాతంత్య్రం, విభజన సమయంలో మత కల్లోల నుంచి తృటిలో తప్పించుకుని ఢిల్లీ చేరుకున్న జగ్‌మోహన్ డిగ్రీ పూర్తిచేసి.. సివిల్ సర్వెంట్‌గా ఢిల్లీ ప్రభుత్వంలో పని చేశారు. ఆ తర్వాత 1980 నుంచి ఢిల్లీకి రెండు పర్యాయాలు, గోవా, డామన్ అండ్ డయ్యూలకు ఒక పర్యాయం లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేశారు. 1984 నుంచి 1989 వరకూ.. ఆ తర్వాత 1990లో నాలుగు నెలల పాటు జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా రెండు సార్లు బాధ్యతలు నిర్వర్తించారు.
నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు
‘‘పద్మశ్రీ లభించడం ఎంతో సంతోషంగా ఉంది. పరమాత్మునికి, నా తల్లిదండ్రులు తక్కెళ్ల వెంకయ్య, నర్సమ్మలకు, నా గురువు సోమదేవశర్మకు, నాలో దేశభక్తిని కలిగించిన పెద్దలకు కృతజ్ఞతలు. -టి.వి.నారాయణ, సామాజిక కార్యకర్త
నేపథ్యం: 1925 జూలై 26న హైదరాబాద్ శివార్లలోని బొల్లారంలో తక్కెళ్ల వెంకన్న, నర్సమ్మ దంపతులకు జన్మించారు. ఉపాధ్యాయునిగా కెరీర్ ప్రారంభించారు. విద్యారంగంతో పాటు, సామాజిక రంగంలోనూ సేవలందించారు. సిటీ కాలేజీ ప్రిన్సిపల్‌గా, ఏపీపీఎస్సీ సభ్యునిగా, సెన్సార్ బోర్డు సభ్యునిగా చేశారు. జస్టిస్ పున్నయ్య నేతృత్వంలో ఏర్పడిన ఎస్సీ, ఎస్టీ సెల్ సభ్యునిగా పని చేశారు. సంస్కృతంలో రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు.
హిందీ-తెలుగు భాషల వారధి
గుడివాడ: పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకోనున్న సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గత నాలుగు దశాబ్దాలుగా హిందీ తెలుగు భాషల మధ్య వారధిగా నిలిచారు. పదమూడేళ్ల క్రితమే పద్మశ్రీ అందుకున్న ఈయన అటు అనువాదంలో, ఇటు స్వంత రచనలోనూ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను అందుకున్నారు. రష్యా ప్రభుత్వం నుంచి పుష్కిన్ అవార్డు, అమెరికాలో తానా, వంగూరి ఫౌండేషన్‌ల నుంచి సత్కారాలు, హిందీ సాహిత్యంలో కృషికి సాహిత్య రత్నాకర్, గంగాశరణ్ పురస్కార్‌వంటి ప్రతిష్టాత్మక అవార్డులు పొందారు. జాతీయ స్థాయిలో హిందీ భాషాభివృద్ధికి కృషిచేస్తున్న లక్ష్మీప్రసాద్ తెలుగు, హిందీలో సొంతంగా, అనువాద రూపంలో దాదాపు 62 పుస్తకాలు రచించారు. ఆయన రచించిన ‘ద్రౌపది’ పుస్తకం సంచలనం రేకెత్తించింది. ఆంధ్రావర్సిటీలో హిందీ విభాగంలో ప్రొఫెసర్, శాఖాధిపతిగా చేశారు. 1996-2002కాలంలో రాజ్యసభసభ్యుడిగా ఉన్నారు. పార్లమెంటరీ అధికార భాషా కమిటీకి డెప్యూటీ చైర్మన్‌గా, ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ ఛైర్మన్‌గా, అధికార భాషపై యూజీసీ కమిటీ చైర్మన్‌గా, కెనడాలో భారత సాంస్కృతిక రాయబారిగా పనిచేశారు. ప్రస్తుతం కేంద్ర హిందీ సలహా మండలి సభ్యునిగా కొనసాగుతున్నారు. సాహిత్యం, కళల పరిరక్షణ కోసం లోక్‌నాయక్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి లోక్‌నాయక్ అవార్డులను ప్రతిఏటా ఇస్తున్నారు. పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కృష్ణాజిల్లా ఈడుపుగల్లు గ్రామంలో 1953 నవంబర్ 24న జన్మించారు. గుడివాడలోని బేతవోలు గ్రామంలో పెరిగారు. డిగ్రీ వరకు గుడివాడ ఏఎన్నార్ కళాశాలలో చదివారు. జైఆంద్ర ఉద్యమం సమయంలో ఆయన్ను మీసా యాక్టు కింద జైలులో పెట్టారు.
ఎలా స్పందించాలో తెలియడం లేదు
‘‘నాకెలా స్పందించాలో నాకు తెలియడం లేదు. మిశ్రమ భావాలు కలుగుతున్నాయి. నిజం చెప్పాలంటే నేను దీనికి అర్హున్ని కాదేమో అన్పిస్తోంది. ఎందుకంటే నేను సాధించినవేమిటో నాకు తెలుసు. ఇప్పటిదాకా అంతటి కళాత్మక అద్భుతాలనేమీ సృష్టించలేదు నేను. రజనీకాంత్, రామోజీరావు, పద్మవిభూషణ్‌కు పూర్తిగా అర్హులు. వారి పనితనాన్ని కొన్ని తరాల పాటు చెప్పుకుంటారు. అంత గొప్పవారితో కలిసి అవార్డు అందుకోబోతున్నందుకు ఆనందంగా ఉంది’’
-ఎస్.ఎస్.రాజమౌళి, సినీ దర్శకుడు
నేపథ్యం: ఎస్ ఎస్ రాజమౌళి. వైఫల్యమంటే ఎలా ఉంటుందో ఎరగని సినీ దర్శకుడు. స్టూడెంట్ నంబర్ 1తో మొదలైన ఆయన సినీ విజయాల పరంపర తాజాగా బాహుబలి దాకా అప్రతిహతంగా కొనసాగింది. ముఖ్యంగా బాహుబలి భారత సినీ చరిత్రలోనే కనీవినీ ఎరగని రికార్డులు సృష్టించింది. ఈ సినిమాతో రాజమౌళి పేరు జాతీయ స్థాయిలో మారుమోగిపోయింది. ప్రస్తుతం దానికి సీక్వెల్ తీసే పనిలో ఉన్నారు.
డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గుండెమార్పిడి ఆపరేషన్లు నిర్వహించి తొలి కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే. ఆయన 1959 అక్టోబర్ 2న కృష్ణా జిల్లాలో జన్మించారు. ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ నిర్వహించిన మొట్టమొదటి సర్జన్ కూడా గోఖలేనే. ఆయన భార్య డాక్టర్ సూరపనేని వెంకటలక్ష్మీ పిల్లల వైద్య నిపుణురాలు. గోఖలే ప్రాథమిక విద్యాభ్యాసం కృష్ణా జిల్లా తమిరిస గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్‌లో జరిగింది. గుంటూరు వైద్య కళాశాలలో 1976లో ఎంబీబీఎస్‌లో చేరి 1982లో పూర్తి చేశారు. జనరల్ సర్జరీ 1985లో గుంటూరు వైద్య కళాశాలలో పూర్తి చేశారు. తదుపరి వెల్లూరులో కార్డియోథొరాసిక్ సర్జరీ సూపర్ స్పెషాలిటీ కోర్సు 1990లో పూర్తి చేశారు. హైదరాబాద్ నిమ్స్‌లో 1992లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ప్రస్తుతం సహృదయ ట్రస్టు ద్వారా జీజీహెచ్‌లో పేద రోగులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.
డాక్టర్ యార్లగడ్డ నాయుడమ్మ
ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అవిభక్త చిన్నారులను విడదీసి పిల్లల శస్త్రచికిత్స నిపుణులుగా పేరు ప్రఖ్యాతలు గడించిన డాక్టర్ యార్లగడ్డ నాయుడమ్మ గుంటూరు వైద్య కళాశాలలో 1970లో వైద్య విద్యనభ్యసించారు. ఆయన 1947 జూన్ 1న ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించారు. రోటక్ మెడికల్ కళాశాల నుంచి 1974లో జనరల్ సర్జరీ, 1977లో ఢిల్లీ ఎయిమ్స్‌లో పీడియాట్రిక్ పూర్తి చేశారు. గుంటూరు వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్‌గా, పిల్లల వైద్య విభాగాధిపతిగా పనిచేశారు.
కళా సమాజానికి గొప్ప గుర్తింపు
‘‘పద్మశ్రీ లభించడం ఎంతో సంతోషంగా ఉంది. కళా సమాజానికి, మొత్తం కళాకారులకు లభించిన గొప్ప గుర్తింపు ఇది. స్త్రీ, పురుషుడు, పశువు, చెట్టు, వాతావరణం... ఇవే నాకు స్ఫూర్తి. వీటి ఆధారంగానే బొమ్మలు గీస్తాను.’’
- ప్రముఖ చిత్రకారుడు లక్ష్మా గౌడ్
నేపథ్యం: పూర్తి పేరు కలాల్ లక్ష్మా గౌడ్. తెలంగాణ జీవన చిత్రాన్ని కాన్వాస్‌పై ఆవిష్కరించిన మొట్టమొదటి చిత్రకారుడు. 1940 ఆగస్టు 21న మెదక్ జిల్లా సంగారెడ్డి దగ్గర్లోని నిజాంపూర్‌లో వెంకన్న గౌడ్, అనంతమ్మ దంపతులకు జన్మించారు. తెలంగాణ జీవన చిత్రాన్ని సమున్నతంగా ఆవిష్కరించిన గొప్ప చిత్రకారుడు.ఎంతోమంది చిత్రకారులకు స్ఫూర్తి ప్రదాత. పెన్సిల్‌తోనే అద్భుతమైన చిత్రాలు గీయడం ఆయన ప్రత్యేకత. టెర్రాకోట్ శిల్పాలనూ అబ్బురపరిచేలా రూపొందిస్తారు. సామాన్య కుటుంబంలో పుట్టిన లక్ష్మాగౌడ్ చిన్నప్పటి నుంచే చిత్రకారుడిగా ప్రతిభ ను చాటుకున్నారు. కింగ్ కోఠీలోని కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో ఉపకారం వేతనంపై చదువుకున్నారు. బరోడాలోని లలిత కళా అకాడమీలో ఫైన్ ఆర్ట్స్‌లో చేరారు.
బాధ్యత పెంచింది
‘‘అరుదైన గౌరవం లభించడం ఆనందంగా ఉంది. ఇది నా ఒక్కడి కృషి వల్ల సాధ్యం కాలేదు. 25 మంది వైద్యుల సమిష్టి కృషి ఈ విజయం. ఈ గౌరవం నా బాధ్యతను మరింత పెంచింది. చిన్నారులకు హృదయ సేవలను మరింత చేరువ చేయాలన్నది మా ఆకాంక్ష’’
- మన్నం గోపిచంద్, చీఫ్ కార్డియో థొరాసిక్ సర్జన్, స్టార్ ఆస్పత్రి
నేపథ్యం: ప్రకాశం జిలా ్ల ఒంగోలుకు చెందిన డాక్టర్ మన్నం గోపిచంద్ గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. తర్వాత వెస్టిడీస్‌కు వెళ్లి సర్జరీ నైపుణ్యాలు పెంచుకున్నారు. రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఈడెన్స్‌బర్గ్‌లో ఎఫ్‌ఆర్‌సీఎస్ ఇన్ జనరల్ సర్జరీ చేశారు. తర్వాత విదేశాల్లోని పలు ఆస్పత్రుల్లో కార్డియో థొరాసిక్ సర్జన్‌గా సేవలందించారు. 1994లో స్వదేశానికి తిరిగి వచ్చి అపోలో ఆస్పత్రిలో చేరారు. 1997లో మెడ్విన్ ఆస్పత్రిలో, 2002లో కేర్‌లో పని చేశారు. ప్రస్తుతం స్టార్ ఆస్పత్రిలో చీఫ్ కార్డియో థొరాసిక్ సర్జన్‌గా ఉన్నారు. ఇప్పటిదాకా 12 వేలకు పైగా గుండె ఆపరేషన్లు చేశారు. హృదయ ఫౌండేషన్ స్థాపించి దాని ద్వారా ఇప్పటి 3,000 మంది చిన్నారులకు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేశారు.
ఎంతో సంతోషంగా ఉంది: డి.నాగేశ్వర్‌రెడ్డి
‘‘నాకు ప్రకటించిన పద్మభూషణ్ అవార్డును ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రి అందిస్తున్న సేవలకు లభించిన సముచితమైన గౌరవంగా భావిస్తున్నా. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి గుర్తింపు లభించడం ఎంతో సంతోషంగా ఉంది. ఎందరో వైద్య నిపుణులు, సిబ్బంది రోజుకు 24 గంటల పాటు రోగులకు సేవలందిస్తున్నారు. వారందరి సేవలకు గుర్తింపే ఇది. త్వరలో ఆస్పత్రి సేవలను మరింత విస్తరించబోతున్నాం. గచ్చిబౌలిలో 2016 మార్చి నాటికి వెయ్యి పడకలతో అధునాతన హంగులతో మరో ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించి మరింతమందికి సేవలందిస్తాం’’ - ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డి.నాగేశ్వర్‌రెడ్డి
నేపథ్యం: పూర్తి పేరు డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్‌రెడ్డి. 1956 మార్చి 18న భాస్కర్‌రెడ్డి, శారద దంపతులకు జన్మించారు. 1963లో బేగంపేట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో టెన్త్‌లో టాపర్‌గా నిలిచారు. విజయవాడ లయోలా కాలేజీలో ఇంటర్, కర్నూల్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎండీ, చండీగఢ్‌లోని ప్రతిష్టాత్మక పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్‌లో గ్యాస్ట్రో ఎంటరాలజీలో డాక్టర్ ఆఫ్ మెడిసిన్ పూర్తి చేశారు. తర్వాత కొద్దిరోజులకు హార్వర్డ్ మెడికల్ స్కూల్/కాలేజీలో అప్పట్లోనే నెలకు రూ.కోటి వేతనమున్న ఉద్యోగాన్ని వదులుకుని భారత్ తిరిగి వచ్చారు. 1984-89 వరకు నిమ్స్‌లో ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, 1989-90లో గుంటూరు మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ పని చేశారు. ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ చైర్మన్‌గా, వరల్డ్ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. జీఐ ఎండోస్కొపీపై విస్తృత పరిశో ధనలు చేశారు. 335 పరిశోధనా పత్రాలు సమర్పించారు. 112 అంతర్జాతీయ ఎండోస్కోపిక్ వర్క్‌షాపుల్లో విజిటింగ్ ఫ్యాక ల్టీగా సేవలందించారు.
సమాజహితం కోరినందుకే: ఏవీ రామారావు
‘సమాజానికి ఉపయోగపడే కొద్దోగొప్పో మంచి పనులు చేశాననే నమ్మకం నాకుంది. ఇందుకు ప్రభుత్వం పద్మ భూషణ్‌తో సత్కరించడం ఆనందంగా ఉంది’ అన్నారు ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త ఆళ్ల వెంకట రామారావు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ డెరైక్టర్‌గా చేసి రిటైరైన ఆయన్ను అవార్డు ప్రకటన సందర్భంగా ‘సాక్షి’ పలుకరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘రసాయన శాస్త్రవేత్తగా నా శక్తి సామర్థ్యాల మేరకు సమాజ హితం కోసం పనిచేశానన్న తృప్తి నాకుంది. పద్మశ్రీ అందుకున్న (1991) 14ఏళ్ల తర్వాత మరో పద్మ అవార్డు దక్కడం సంతోషంగానే ఉంది. యువతరంపై కొంత అసంతృప్తి ఉన్నమాటైతే వాస్తవం. వీలైనంత తొందరగా ఎక్కువ డబ్బు సంపాదించాలన్న దృక్పథం సరైందికాదు. అంకితభావంతో పనిచేస్తే డబ్బు ఖ్యాతి వాటంతట అవే వస్తాయని నమ్మేవాడిని నేను. అందుకు నేనే ప్రత్యక్ష ఉదాహరణ. రిటైరయ్యాక సొంతంగా ఆవ్రా ల్యాబ్స్ స్థాపించి పరిశోధనలు కొనసాగిస్తున్న అతికొద్దిమందిలో నేను ఒకడిని. యువ శాస్త్రవేత్తలూ ఈ తీరులో పనిచేస్తే భారత్ అద్భుతాలు సృష్టించగలదు’ అన్నారు. ఫార్మా రంగంలో ఈయన పేరు తెలియని వారుండరు. హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వ్యాధి చికిత్సలో ఉపయోగించే ఏజెడ్‌టీ మందును అత్యంత చౌకగా తయారు చేసే విధానాన్ని ఆవిష్కరించి రికార్డు సృష్టించారు.
వార్తా, వ్యాపార సారథి రామోజీ
రామోజీ గ్రూపు సంస్థల అధిపతి చెరుకూరి రామోజీరావు 1939లో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా పెదపారుపూడిలో సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయన గత ఐదు దశాబ్దాలుగా మార్గదర్శి చిట్ ఫండ్స్, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ చానళ్లు, ఉషాకిరణ్ మూవీస్, మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్, డాల్ఫిన్ హోటల్స్, ప్రియా ఫుడ్స్, కళాంజలి సంస్థలతో పాటు.. ప్రపంచంలో అతి పెద్ద సినీ నిర్మాణ కేంద్రం ‘రామోజీ ఫిల్మ్ సిటీ’లను స్థాపించి నిర్వహిస్తున్నారు.
ఆధ్యాత్మిక రవిశంకర్...
తమిళనాడులోని పాపనాశంలో 1956లో జన్మించిన రవిశంకర్ బెంగళూరు యూనివర్సిటీలో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆధ్యాత్మిక రంగంలో కృషి చేస్తూ శ్రీశ్రీ రవిశంకర్‌గా ఖ్యాతి గడించారు. 1981లో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. అది ఇప్పుడు 152 దేశాల్లో మనుషుల వ్యక్తిగత ఒత్తిడిని, సామాజిక సమస్యలను, హింసను తగ్గించే లక్ష్యంతో పనిచేస్తోంది. 1997లో జెనీవా కేంద్రంగా ‘ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యూమన్ వాల్యూస్’ అనే సంస్థను రవిశంకర్ నెలకొల్పారు. ఇది సహాయ కార్యక్రమాలతో పాటు, గ్రామీణాభివృద్ధి కోసం కృషి చేస్తోంది.
విద్యాపీఠం తొలివీసీ తాతాచార్య
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): తిరుపతిలోని సంస్కృత విద్యాపీఠం తొలి వైస్‌చాన్సలర్‌గా పనిచేసిన ఎన్‌ఎస్ రామానుజ తాతాచార్యకు భారతదేశ అత్యున్నత మూడవ పౌర పురస్కారం పద్మభూషణ్ అవార్డు లభించింది. ఈయన 1989 నుంచి 93 వరకు విద్యాపీఠానికి తొలి వీసీగా పనిచేశారు. విద్యాపీఠం అభ్యున్నతికి సేవలందించారు. సంస్కృత భాష అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారు. పలు పుస్తకాలను రచించారు. ఈయనకు సంస్కృతం, తమిళం, హిందీ, తెలుగు భాషల్లో పరిజ్ఞానం ఉంది. వివిధ శాస్త్రాలకు సంబంధించిన ఈయన రాసిన 60 పరిశోధనా పత్రాలు పలు జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. 25 మంది పరిశోధక విద్యార్థులకు ఈయన మార్గదర్శకం చేశారు. ఈయన సంస్కృత భాషకు చేసిన సేవకు గుర్తింపుగా కేంద్రప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. ఈయన విద్యాపీఠంలో 30 సంవత్సరాల పాటు అధ్యాపకుడిగా పనిచేశారు.
తెలుగు ప్రముఖులకు ‘పద్మ’పురస్కారాలు
Published Tue, Jan 26 2016 2:20 AM | Last Updated on Sun, Sep 3 2017 4:18 PM
Advertisement
Advertisement