పెద్దాయనను పక్కన పెట్టేశారా?
న్యూఢిల్లీ: బీజేపీ కురువృద్ధుడు, పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎల్కే అద్వానీకి గురువారం చేదు అనుభవం ఎదురైంది. మరోసారి ఆయనకు పార్టీ వ్యక్తులు మర్యాద మరిచారు. ఇందిరాగాంధీ 1975లో అత్యవసర పరిస్ధితి విధించి 40 ఏండ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీలోని అగ్రశ్రేణి నాయకులందరితో కలిసి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేయగా దానికి అద్వానీని ఆహ్వానించకుండా పక్కన పెట్టేశారు. అత్యవసర పరిస్థితి విధించినప్పుడు అద్వానీ జైలుకు కూడా వెళ్లారు. అలాంటి ఆయనను అదే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమానికి ఆహ్వానించకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
బీజేపీ మార్గదర్శక్ మండల్ లో సభ్యుడైన అద్వానీ.. ఆ సమావేశంలో లేని లోటు కొట్టొచ్చిన్నట్లు కనిపించింది. అదే సమయంలో బీజేపీ చీఫ్ అమిత్ షా దుర్భుద్ధి ఈ చర్య ద్వారా స్పష్టమవుతోందని పలువురు అద్వానీ మద్దతు దారులు పెదవి విరిచారు. ఈ కార్యక్రమాన్ని అమిత్ షానే ఏర్పాటుచేసి ఆయన సమన్వయ కర్తగా వ్యవహరించారు. అయితే, గతంలో ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో దేశంలో మరోసారి అత్యవసర పరిస్థితి వచ్చే అవకాశం ఉందని అనడంతోపాటు, ప్రస్తుతం కేంద్రంలో ఒక్కరి చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయని కూడా అద్వానీ అన్నారు. ఈ మాటలు బీజేపీని, ఆరెస్సెస్ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి. అప్పటి నుంచి అద్వానీ వ్యాఖ్యలపై గుర్రుగా ఉన్న పార్టీ పెద్దలు.. ఆయనను ఎమర్జెన్సీ కార్యక్రమానికి పిలవకుండా పక్కన పెట్టేశారు.