ప్రశ్నోత్తరాల సమయం మార్చే యోచన లేదు
లోక్‌సభ స్పీకర్ వెల్లడి
సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామని పార్టీల హామీ
న్యూఢిల్లీ: సోమవారం నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయాన్ని మార్చే యోచన లేదని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పష్టం చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సంబంధించి శనివారం రాత్రి స్పీకర్ మహాజన్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. సమావేశంలో ఏ పార్టీలు ప్రశ్నోత్తరాల సమయం మార్పుపై తన అభిప్రాయాన్ని వ్యతిరేకించలేదని, లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయం యథావిథిగా ఉదయం 11 గంటలకే కొనసాగుతుందని మహాజన్ పేర్కొన్నారు. సభను జీరో అవర్‌తో ప్రారంభిస్తే గొడవ జరిగే అవకాశం ఉందని, సభా కార్యక్రమాలకు ఇది సరైన ప్రారంభం కాదని ఆమె అభిప్రాయపడ్డారు.
రాజ్యసభలో మాత్రం ప్రశ్నోత్తరాల సమయాన్ని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు మార్పు చేస్తూ చైర్మన్ హమీద్ అన్సారీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా, అన్ని పార్టీలు పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చాయని మహాజన్ చెప్పారు. ఈ విందు సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ప్రతిపక్ష నేత మల్లికార్జునఖర్గేతో పాటు 18 రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. వామపక్షాలు, సమాజ్‌వాదీ పార్టీ, శివసేన, తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకాలేదు.