'స్వామి'కి వైట్ షర్ట్.. ఖాకీ నిక్కర్!
దేవుడి విగ్రహానికి ఆరెస్సెస్ డ్రెస్ తొడగడంపై వివాదం తలెత్తింది. సూరత్ లోని ఓ దేవాలయంలో స్మామి నారాయణ్ విగ్రహానికి ఆలయ అధికారులు ఖాకీ కలర్ నిక్కర్, వైట్ షర్ట్ తొడిగించారు. ఆరెస్సెస్ డ్రెస్ ఆ విగ్రహానికి అలంకరించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో ఈ విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. స్వామి నారాయణ్ విగ్రహాన్ని గమనించినట్లయితే.. ఆరెస్సెస్ డ్రెస్ కోడ్ తో పాటు తలపై నలుపు రంగు టోపీ, కాళ్లకు షూస్, చేతిలో జాతీయ పతాకంతో అలంకరించారు. నేడు ఆరెస్సెస్ డ్రెస్స్ తొడిగారు.. రేపు బీజేపీ యూనిఫాం తొడుగుతారంటూ కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.
సూరత్ లోని లస్కానాలో స్వామి విశ్వప్రకాశ్జి ఆలయానికి వచ్చిన ఓ భక్తుడు ఈ దుస్తులు కానుకగా సమర్పించాడు. సాధారణంగా దేవుడి విగ్రహాన్ని పలు రకాల డ్రెస్సులతో అలంకిరిస్తుంటాం.. అందులో భాగంగానే కానుకగా వచ్చిన ఆరెస్సెస్ యూనిఫాంను ఉపయోగించామని చెప్పారు. ఈ విషయం ఇంత వివాదానికి దారి తీస్తుందని తాము భావించలేదని ఆలయ అధికారులు వివరణ ఇచ్చారు.
దేవుడు కూడా రైటిస్ట్ అనే భావనలు వ్యక్తం చేయడానికి ఇలా చేశారని, డ్రెస్సును వెంటనే తీసేసి రెగ్యూలర్ పద్ధతిలో ఉంచాలని కాంగ్రెస్ పార్టీ నేత శంకర్ సిన్హ్ వాగేలా డిమాండ్ చేశారు. దేవుడికి ఖాకీ కలర్ షార్ట్ తొడిగి ఏం నిరూపించాలనుకుంటున్నారని ప్రశ్నించారు. గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు విజయ్ రుపానీని సంప్రదించగా.. తనకు ఈ విషయం తెలియదని, నిజంగానే ఆరెస్సెస్ డ్రెస్ వాడినట్లయితే ఆశ్చర్యానికి లోనవుతానని, ఇలాంటివి తాను నమ్మనని పేర్కొన్నారు