
వేలిముద్రలను గుర్తించేందుకు మ్యాజిక్ పెన్ను!
నేరం జరిగిన స్థలంలో వేలిముద్రలను సేకరిస్తే నేరస్తులను పట్టుకునేందుకు, నేర నిరూపణకు కీలక ఆధారం దొరికినట్లే. అందుకే.. పెట్రో లు పంపులు, సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు, ఏటీఎంలు, తదితర చోట్ల బిల్లులు ముద్రించేందుకు ఉపయోగించే థర్మల్ కాగితాలపై సైతం నేరస్తుల వేలిముద్రలను గుర్తించేందుకు ఉపయోగపడే ఓ సరికొత్త మ్యాజిక్ పెన్నును ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్‌కు చెందిన డాక్టర్ జాన్ బాండ్ రూపొందించారు. సాధారణంగా థర్మల్ కాగితాలు వేడి తగలగానే రంగు మారతాయి.
అలాగే ఈ కాగితంపై ప్రత్యేక రసాయనం ఉండే ఈ పెన్నుతో మార్కర్‌లా గీస్తే.. ఆ కాగితంపై రసాయన చర్యల్లో మార్పులు వస్తాయట. ఆ మార్పులను ప్రత్యేక కాంతిని ప్రసరించడం ద్వారా పరిశీలించి వేలిముద్రలను గుర్తించవచ్చట. వాడేందుకు సులభంగా ఉండే ఈ మ్యాజిక్ పెన్ను నేర దర్యాప్తులో ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసులకు బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.