మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌లో చిక్కుకున్న ప్రయాణికులను తరలిస్తున్న సహాయక సిబ్బంది
సాక్షి ముంబై: చిమ్మ చీకటి..చుట్టూ వరదనీరు.. విషకీటకాలు, పాముల భయం.. చిన్నారుల ఏడ్పులు.. మంచి నీరు కూడా అందని పరిస్థితి... ఇది ముంబై– కొల్హాపూర్ మధ్య నడిచే మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్ రైలులోని ప్రయాణికుల దుస్థితి.
శుక్రవారం రాత్రి ముంబై నుంచి బయలు దేరిన ఈ రైలు ముంబై శివారు ప్రాంతమైన వాంగణీ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలపైకి వరద నీరు చేరడంతో నిలిచిపోయింది. సుమారు 17 గంటల అనంతరం రైలులో చిక్కుపోయిన 1,050 మంది ప్రయాణికులను జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్), ఎయిర్‌ఫోర్స్, నేవీ, ఆర్మీ, పోలీసులు, స్థానికుల సాయంతో సురక్షిత ప్రాంతాలకు చేర్చగలిగారు. ప్రయాణికులెవరికీ ఎటువంటి హాని కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ముంబైతోపాటు శివారు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉల్లాస్ నది ఉప్పొంగింది. సెంట్రల్ రైల్వే మార్గంపై బద్లాపూర్, వాంగణీ ప్రాంతాల్లోని రైల్వేట్రాక్‌లపై పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. దీంతో ముంబై ఛత్రపతి శివాజీ మహారాజు టర్మినస్ నుంచి శుక్రవారం రాత్రి 8.15 గంటలకు బయలుదేరిన సీఎస్‌ఎంటీ–కొల్హాపూర్ మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్ రైలు వాంగణీ ప్రాంతంలో వరదలో చిక్కుకుంది.
రాత్రంతా రైలులోనే...
వరద నీటిలో చిక్కుకున్న మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులు ఒకేచోట రాత్రంతా రైల్లోనే గడపాల్సి వచ్చింది. ఓ వైపు చుట్టూ వరద నీరు, చిమ్మచీకటి.. నీరు బోగీలోకి వస్తే ఏమవుతుందోననే భయాం దోళన. మరోవైపు విష కీటకాలు, పాములు ఏమైనా లోనికి వస్తే ఎలా అనే భయం... ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ప్రయాణికులు తమ సెల్ ఫోన్‌ల ద్వారా మిత్రులతోపాటు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ఇలా ఎవరికి తెలిసిన వారికి వారు ఫోన్లు చేసి, వీడియోలు పంపి సాయం కోరారు. ముఖ్యంగా గర్భిణులు, పసిపిల్లలతోపాటు వయోవృద్ధులు, వికలాంగులు కూడా ఈ రైలులో ఉన్నారు. వీరందరూ రాత్రంతా రైలు బోగీలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. మరోవైపు వెంట తీసుకుచ్చిన నీరు, ఆహారం, పాలు అయిపోవడంతో పిల్లల ఏడ్పులతో అందరిదీ నిస్సహాయ స్థితి.
ఊరట తెచ్చిన రైల్వే సిబ్బంది ప్రకటన..
రాత్రంతా తీవ్ర ఉత్కంఠ, భయాందోళనల మధ్య గడిపిన ప్రయాణికులకు రైల్వే సిబ్బంది ప్రకటనతో కొంత ఊరట లభించింది. రైలు సిబ్బంది, పోలీసులు ఓ బ్లూ టూత్ మైక్ ద్వారా ప్రతి బోగీలోకి వెళ్లి ‘అందరం సురక్షితంగానే ఉన్నాం. ఎవరూ భయపడవద్దు. ఎవరూ కూడా తొందరపడి రైలు దిగవద్దు’అంటూ సూచనలు చేశారు. రెస్క్యూ టీమ్ వచ్చి అందరినీ రక్షిస్తుందని ప్రకటించారు.
రెస్క్యూ టీమ్ రాక..
వరదల్లో చిక్కుకున్న మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులను రక్షించేందుకు స్థానికులు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇంతలోనే ఎన్‌డీఆర్‌ఎఫ్, నావిక దళం బృందాలు అక్కడికి చేరుకోవడంతో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. సహాయక బృందాలు ఎనిమిది రబ్బరు బోట్లు, ఇతర సామగ్రి తమ వెంట తెచ్చాయి. ముఖ్యంగా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు హెలికాప్టర్ల సాయంతో ముందుగా పరిసరాలను పర్యవేక్షించారు. రబ్బరు బోట్లతో రైలు వద్దకు చేరుకునేందుకు అనువైన స్థలాన్ని గుర్తించి, అక్కడి నుంచి రైలు వద్దకు చేరుకున్నారు. ఇందుకోసం స్థానికుల సాయం తీసుకున్నారు. రైలు వద్దకి చేరుకున్న అనంతరం బోట్ల ద్వారా ప్రయాణికులను బృందాలుగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇలా 17 గంటల అనంతరం రైలులోని వారందరినీ సురక్షితంగా బయటికి తీసుకురాగలిగారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమైన సహాయక చర్యలు 2.20 గంటలకు ముగిశాయి. అనంతరం 14 బస్సులు, మూడు టెంపోల ద్వారా వారందరినీ సురక్షిత స్థలాలకు తరలించారు. తర్వాత వారి కోసం కళ్యాణ్ నుంచి ప్రత్యేక 19 బోగీల ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. మన్మాడ్, దౌండ్ మార్గం మీదుగా ఈ రైలు కొల్హాపూర్‌కు చేరుకోనుంది.
మరో 120 మందిని కాపాడిన బృందాలు
ఆకస్మికంగా వరద చుట్టుముట్టడంతో బద్లాపూర్‌లోని ఓ పెట్రోల్ పంప్ భవనంపైకి చేరుకున్న 70 మందిని, షాహద్‌లోని ఓ రిసార్టులో ఉన్న మరో 46 మందిని ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది కాపాడారని అధికారులు తెలిపారు. అలాగే, కల్యాణ్ జిల్లాలో 9 మందిని రక్షించినట్లు చెప్పారు. సహాయక చర్యల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్, పోలీసులు, ఫైర్ సిబ్బంది కూడా పాల్గొన్నారని పేర్కొన్నారు. థానేలో రికార్డు స్థాయిలో శనివారం ఉదయానికి 160 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఉల్హాస్ నగర్‌లో 200 మి.మీ. వాన కురిసింది.
తక్షణం స్పందించిన కేంద్రం
రైలు వరదలో చిక్కుకుందనే విషయం తెలిసిన వెంటనే కేంద్రం అప్రమత్తమయింది. ప్రయాణికులను రక్షించేందుకు వెంటనే ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను పంపించింది. హోం మంత్రి అమిత్ షా ఢిల్లీ నుంచి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఉదయం 8.30 గంటలకు ఈ ఘటన తెలుసుకున్న హోంమంత్రి అమిత్ షా వెంటనే ముంబై లోని రెండు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను అవసరమైన సామగ్రితో సంఘటన స్థలానికి తరలివెళ్లాలని ఆదేశించారు. దీంతో సహాయక బృందాలు అక్కడికి ఉదయం 9.40 గంటలకు చేరుకున్నాయి. అమిత్ షా విజ్ఞప్తి మేరకు రక్షణ శాఖ కూడా స్పందించి రెండు ఎంఐ–17 హెలికాప్టర్లు, సుశిక్షితులైన 130 మంది సిబ్బంది కలిసి ఆహారం, మంచినీరు, సహాయక సామగ్రిని వెంట తీసుకుని వెళ్లారని ప్రభుత్వం తెలిపింది. రైల్వే శాఖ అధికారులు వైద్య బృందాలను అక్కడికి పంపారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా తీసుకువచ్చిన బృందాలను అమిత్‌షా అభినందించారు.
పరిమళించిన మానవత్వం..
మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్ రైలులోని ప్రయాణికులందరు సురక్షితంగా బయటికి వచ్చిన అనంతరం స్థానిక గ్రామస్తులు వారికి అవసరమైనవి సమకూర్చారు. ముఖ్యంగా పిల్లలకు పాలు, బిస్కెట్లు అందించారు. బద్లాపూర్‌లోని సహ్యాద్రి మంగళ కార్యాలయంలో వారందరికీ భోజనం, మంచి నీరు అందించి మానవత్వం చాటుకున్నారు.
గర్భవతులు సురక్షిత స్థలాలకు: మహాలక్ష్మి రైలులోని సుమారు వెయ్యి మందిలో తొమ్మిది మంది గర్భవతులు. వీరిలో రేష్మా కాంబ్లే తొమ్మిది నెలల నిండు గర్భిణీ కావడంతో ఆమెను ముందుగా తీసుకు వచ్చారు. రైలులో ఉన్న 9 నెలల చిన్నారితోపాటు ఆమె తల్లిని కూడా ఒడ్డుకు తీసుకువచ్చారు. ముఖ్యంగా 37 మందితో కూడిన డాక్టర్ల బృందం సాయంతో గర్భవతులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment