కౌంటింగ్‌ అప్‌డేట్స్‌ : ఎన్నికల ఫలితాలపై స్పందించిన మోదీ | Maharashtra And Haryana Assembly Elections Results Update | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల ఫలితాల అప్‌డేట్స్‌

Published Thu, Oct 24 2019 8:09 AM | Last Updated on Thu, Oct 24 2019 7:47 PM

Maharashtra And Haryana Assembly Elections Results Update - Sakshi

ముంబై/చండీగఢ్‌ : మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి స్పష్టమైన మెజార్టీ సాధించగా.. హరియాణాలో హంగ్‌ ఏర్పడింది. దీంతో ఆ రాష్ట్రంలో కాసేపు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అనూహ్యంగా పది స్థానాలు గెలిచిన జననాయక్‌ జనతా పార్టీ(జేజేపీ) కింగ్‌ మేకర్‌గా మారింది. దీంతో జేజేపీ మద్దతు కోసం ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు పావులు కదిపాయి. అయితే జేజేపీ అధినేత దుష్యంత్‌ చౌతాలా బీజేపీకి మద్దతిచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మహారాష్ట్రతో పాటు హరియాణాలో కూడా కాషాయ జెండా రెపరెపలాడనుంది. 

మహారాష్ట్ర మొత్తం స్థానాలు 288

పార్టీ ఆధిక్యం గెలుపు
బీజేపీ 0 102
శివసేన 0 56
కాంగ్రెస్‌ 0 46
ఎన్‌సీపీ 0 54
ఎంఐఎం 0 2
ఇతరులు 0 28

హరియాణా మొత్తం స్థానాలు 90

పార్టీ  ఆధిక్యం గెలుపు
బీజేపీ 0 40
కాంగ్రెస్‌  0 31
ఐఎన్‌ఎల్‌డీ 0 1
జేజేపీ 0 10
ఇతరలు 0 8

హరియాణా, మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు: మోదీ
‘మమల్ని ఆశీర్వదించిన హరియాణా ప్రజలకు కృతజ్ఞతలు. రాష్ట్ర అభివృద్దికి అదే ఉత్సాహం, అంకిత భావంతో పనిచేస్తాం. ప్రభుత్వ పథకాలు, అభివృధ్దిని ఇంటింటికి తీసుకెళ్లడానికి కష్టపడిని ప్రతీ ఒక్క కార్యకర్తను అభినందిస్తున్నాను’ హరియాణా ఎన్నికల ఫలితాల అనంతరం మోదీ చేసిన ట్వీట్‌  

‘మహారాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమిని ఎంతో నమ్మకం, ప్రేమతో మరోసారి ఆశీర్వదించారు. ప్రజల మద్దతు మాకు మరోసారి లభించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాము. మహారాష్ట్ర అభివృద్దికి నిత్యం కృషి చేస్తూనే ఉంటాం. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం నిరంతరం అహర్నిశలు కష్టపడిన బీజేపీ, శివసేనతో పాటు ఎన్డీఏ కూటమికి చెందినీ ప్రతీ ఒక్క కార్యకర్తకు  సెల్యూట్‌ చేస్తున్నా’ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల అనంతరం మోదీ చేసిన ట్వీట్‌.

రిజల్ట్స్‌ అప్‌డేట్స్‌ :     

  • మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి ఘన విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన పూర్తి సంఖ్యా బలాన్ని ఈ కూటమి సాధించింది. అయితే సీఎం పీఠం కోసం శివసేన పట్టుబట్టినట్లు సమాచారం. ఇక బీజేపీని అఖండ మెజార్టీతో గెలిపించిన మహారాష్ట్ర ప్రజలకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ధన్యవాదాలు తెలిపారు. అయితే ఆరుగురు మంత్రులు ఓటమి చెందడం షాక్‌కు గురిచేసిందన్నారు. అదేవిధంగా లోక్‌సభ ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ ఓటమి చవిచూడటం బాధ కలిగించిందన్నారు. అయితే ఈ ఓటములపై రేపు(శుక్రవారం) సమీక్ష నిర్వహించనున్నట్లు ఫడ్నవిస్‌ తెలిపారు. 
     
  • హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడ్డాయి. అయితే ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాంటు చేసేందుకు కావాల్సిన సంఖ్యా బలాన్ని బీజేపీ, కాంగ్రెస్‌లు సాధించలేకపోయాయి. దీంతో హరియాణాలో హంగ్‌ ఏర్పడింది. అయితే 10 స్థానాలు గెలుచుకున్న జననాయక్‌ జనతా పార్టీ(జేజేపీ) ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారింది. అయితే జేజేపీ మద్దతు బీజేపీకే ఉందని హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జేజేపీ మద్దతు ఇస్తుందన్న విశ్వాసంతో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యా బలం ఉందని దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ను కోరనున్నట్లు సమాచారం. 
     
  • ఎగ్జిట్‌ పోల్స్‌ను తలకిందులు చేస్తూ హరియాణా ప్రజలు ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో 10 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) కింగ్‌మేకర్‌గా నిలిచింది. జేజేపీ మద్దతు ఎవరికి ఇస్తే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది. దీంతో జేజేపీ అధినేత దుష్యంత్‌ చౌతాలాతో బీజేపీ, కాంగ్రెస్‌ అధిష్టానాలు చర్చలు సాగిస్తున్నాయి. దీనిలో భాగంగా ఢిల్లీకి రావాలని హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా పిలుపునిచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం భుపిందర్‌ సింగ్‌తో కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ ఫోన్‌లో మాట్లాడారు. హరియాణాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భుపిందర్‌తో సోనియా పేర్కొన్నట్లు సమాచారం.
     
  • వర్లి(మహారాష్ట్ర) శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ-శివసేన కూటమి అభ్యర్థి ఆదిత్య ఠాక్రే 67,427 ఓట్ల భారీ మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి సురేష్‌ మానేపై గెలుపొందారు.  
     

  • మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ ఘనవిజయం సాధించారు. నాగ్‌పూర్‌ సౌత్‌ వెస్ట్‌ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఫడ్నవీస్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆశీశ్‌ దేశ్‌ముఖ్‌పై గెలుపొందారు. 
     
  • హరియాణా సీఎం మనహర్‌లాల్‌ ఖట్టర్‌ కర్నాల్‌ శాసనసభ నియోజకవర్గంలో విజయం సాధించారు. అయితే హరియాణాలో ఎన్నికల ఫలితాల్లో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఇప్పటివరకు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు.    
     
  • ప్రస్తుతం హరియాణా కింగ్‌ మేకర్‌, జననాయక్ జనతా పార్టీ అధినేత దుష్యంత్‌ చౌతాలా ఘనవిజయం సాధించారు. ఉచానా కలాన్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆయన బీజేపీ అభ్యర్థి ప్రేమ్‌ లతపై గెలుపొందారు.
     
  • బిహార్‌లో నితీష్‌ కుమార్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. బిహార్‌లో 5 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో జేడీయూ ఏమాత్రం ప్రభావం చూపడంలో లేదు. మూడు చోట్ల ఆర్జేడీ ముందంజలో ఉంది. ఎంఐఎం, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు చెరో స్థానంలో ముందంజలో ఉన్నారు.  
     
  • అదంపూర్‌(హరియాణా) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి, టిక్‌టాక్‌ స్టార్‌ సొనాలీ ఫోగట్‌ ఓటమిపాలయ్యారు. 
     
  • పరిల్‌లో బీజేపీ అభ్యర్థి, దివంగత నేత గోపీనాథ్‌ ముండే కుమార్తే, మంత్రి పంకజ్‌ ముండే ఓటమి పాలయ్యారు.
     
  • బారామతిలో లక్షా 62 వేల ఓట్ల భారీ మెజారీటీతో ఎన్సీపీ సినియర్‌ నేత  అజిత్‌ పవార్‌ ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో అజిత్‌ పవార్‌ 83.6 శాతం ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు.

  • బిహార్‌లో ఎంఐఎం బోణి కొట్టింది. కిషన్‌గంజ్‌​ ఉప ఎన్నికలో మజ్లిస్‌ విజయం సాధించింది. 
  • కేరళలో ఐదు స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా.. రెండు చోట్ల సీపీఎం, రెండు చోట్ల కాంగ్రెస్‌, మరో చోట ఐయూఎంఎల్‌ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. 

  • హరియాణా బీజేపీ చీఫ్‌ సుభాష్‌ బరాలా తన పదవికి రాజీనామా చేశారు. తొహానాలో ఆయన ఓటమి దిశగా సాగుతున్నారు. 

  • గుజరాత్‌లో 6 స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా.. మూడు స్థానాల్లో బీజేపీ, మూడు స్థానాల్లో కాంగ్రెస్‌ ముందంజలో ఉన్నాయి.

  • మహారాష్ట్రల్లో బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటు దిశగా సాగుతున్నాయి. మ్యాజిక్‌ ఫిగర్‌ దాటి భారీ మెజారిటీని సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి బీజేపీ సీట్ల సంఖ్య తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శివసేన సీనియర్‌ నాయకుడు సంజయ్‌ రౌత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 50-50 ప్రకారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. బీజేపీ-శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, ఎన్సీపీలతో శివసేన కలవనుందనే వార్తలను ఆయన ఖండించారు. అయితే ఐదేళ్ల పాలనలో సగం కాలం పాటు తమ పార్టీకి చెందిన వ్యక్తి సీఎం ఉండేలా చూడాలని శివసేన వర్గాలు భావిస్తున్నట్టుగా సమాచారం

  • హరియాణాలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎం మనోహార్‌లాల్‌ ఖట్టర్‌ను ఢిల్లీ రావాల్సిందిగా బీజేపీ అధిష్టానం ఆదేశించింది. మరోవైపు కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడాతో ఫోన్‌లో మాట్లాడారు. హంగ్‌ ఏర్పడితే ఏం చేయాలనే దానిపై సోనియా ఆయనతో చర్చించారు.

  • మహారాష్ట్రలో కాంగ్రెస్‌ పూర్తిగా చతికలపడింది. మైనార్టీ ఓట్లను ఒకతాటిపైకి తీసుకురావడంలో ఆ పార్టీ విఫలమైంది. ఎంఐఎం రూపంలో కాంగ్రెస్‌ కూటమి ఓట్లకు భారీగా గండి పండింది. మైనార్టీ ఓట్లను మజ్లిస్‌ పార్టీ భారీగా చీల్చింది. దీంతో కూటమిలో కాంగ్రెస్‌ కంటే ఎన్సీపీ మెరుగ్గా రాణించింది. గతంతో పోలిస్తే.. ఈసారి కాంగ్రెస్‌ గెలుపొందే స్థానాల సంఖ్య తగ్గేలా కనిపిస్తోంది. 

  • ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచిన ఆదిత్య ఠాక్రే విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఆయన ప్రస్తుతం 12వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

  • ఇప్పటికి వరకు వచ్చిన ట్రెండ్స్‌ను బట్టి హరియాణాలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ కనిపించడం లేదు. ఒకవేళ హంగ్‌ ఏర్పడితే జేజేపీ కీలక భూమిక పోషించే అవకాశం ఉంది. తాత ఓం ప్రకాశ్‌తో విభేదించి సొంత పార్టీ పెట్టిన దుష్యంత్‌.. ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లో సత్తా చాటారు. పదికి పైగా స్థానాల్లో జేజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో జేజేపీని బుజ్జగించేందుకు కాంగ్రెస్‌, బీజేపీలు మంతనాలు జరుపుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటే జేజేపీకి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్‌ ఆఫర్‌ చేస్తోంది.

  • మహారాష్ట్రలో బీజేపీ కూటమి దూసుకెళ్తుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
  • కర్నాల్‌లో హరియాణా ముఖ్యమంత్రి మనోహార్‌ లాల్‌ ఖట్టర్‌ ముందంజలో ఉన్నారు.
  • రాంపూర్‌ నియోజకవర్గం(ఉప ఎన్నిక)లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఫాతిమా ఆధిక్యంలో ఉన్నారు.
  • కొంకణ్‌ ప్రాంతంలో శివసేన ఆధిక్యం కొనసాగిస్తుండగా.. విదర్భలో బీజేపీ అభ్యర్థులు ముందజలో ఉన్నారు.
  • మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటింది.
  • మహారాష్ట్రలో మూడు స్థానాల్లో ఎంఐఎం ఆధిక్యంలో ఉంది.
  • దాద్రి నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచిన రెజ్లర్‌ బబితా ఫొగాట్ వెనుకంజలో ఉన్నారు.
  • మహారాష్ట్రలో బీజేపీ కూటమి ముందంజలో ఉంది.
  • శివసేన యువనేత ఆదిత్య ఠాక్రే  వర్లి నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 
  • మహారాష్ట్రలో బీజేపీ దూసుకెళ్తుంది. నాగ్‌పూర్‌ సౌత్‌ నుంచి బరిలో ఉన్న సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ముందంజలో ఉన్నారు.
  • హరియాణాలో బీజేపీ ముందజలో కొనసాగుతోంది.
  • మహారాష్ట్రలో 25 స్థానాల ఆధిక్యంలో బీజేపీ కూటమి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement