చండీగఢ్ : అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై ధీమాగా ఉన్నానని బీజేపీ అభ్యర్థి, స్టార్ రెజ్లర్ బబితా ఫొగట్ విశ్వాసం వ్యక్తం చేశారు. దాద్రీ నియోజకవర్గ ప్రజలు తమ కూతురిని తప్పక గెలిపించితీరతారని వ్యాఖ్యానించారు. హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ స్థానాలతో పాటు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలకు అక్టోబరు 21న ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో బబితా ఫోగట్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... ‘ ఒలంపిక్స్ పతకాల కోసం నాలుగేళ్ల ముందు నుంచే సన్నద్ధమవుతాం. ప్రస్తుతం ఈరోజు కూడా అదే విధంగా నేను ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాను. ఇక్కడి ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలే నాకు అతిపెద్ద బలం. వారి ప్రోత్సాహంతోనే ముందుకు సాగుతున్నాను. ప్రజలపై, నాపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. వాళ్ల ఆశీసులు తమ కూతురిపై ఎల్లప్పుడూ ఉంటాయని భావిస్తున్నాను అని బబిత పేర్కొన్నారు.
కాగా దేశ వ్యాప్తంగా జరిగిన తాజా ఎన్నికలకు కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హరియాణా, మహారాష్ట్రలోని పలు స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే బబిత బరిలోకి దిగిన దాద్రీ నియోజకవర్గంలో జాట్ల ప్రాబల్యం అధికం. ఇక్కడ ఇంతవరకు బీజేపీ స్వతహాగా ఖాతా తెరవలేదు. గత ఎన్నికల్లో ఈస్థానం నుంచి ఐఎన్‌ఎల్డీ తరఫున గెలుపొందిన రాజ్‌దీప్ ఫొగట్.. ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఇక ప్రస్తుత ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉండటంతో బీజేపీ బబితాను బరిలో దించింది. ఈ నేపథ్యంలో బబిత గెలుపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జాట్ల ఆడపడుచు కాబట్టి బబిత విజయం ఖాయమని కొంతమంది వాదిస్తుండగా.. బీజేపీకి ఇక్కడ ఇంతవరకు ఒక్కసారి కూడా గెలవలేదు కాబట్టి బబితా గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం బబిత వెనుకంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆమెతో పాటు టిక్‌టాక్ స్టార్, బీజేపీ అభ్యర్థి సొనాలీ కూడా వెనుకపడినట్లు సమాచారం. కాగా ఫొగట్ సిస్టర్స్ రెజ్లింగ్‌లో సాధించిన విజయాల నేపథ్యంలో బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘దంగల్’ సినిమా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment