ప్రిఫ్యాబ్రికేటెడ్ మరుగుదొడ్డి
ముంబై: 'ఆలోచన ఉంటే.. మరుగుదొడ్డి వస్తుంది..' కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఓ ప్రకటనలో ఇటీవల టీవీల్లో ఎక్కువగా వినిపిస్తున్న డైలాగ్ ఇది! అయితే మహారాష్ట్రకు చెందిన ఈ అమ్మాయికి ఆలోచనే కాదు అడిగే సత్తా కూడా ఉంది. అత్తింటి వారింట్లో మరుగుదొడ్డి లేదన్న సంగతి తెలుసుకొని పెళ్లి సమయంలోనే అడిగేసింది. ఇంట్లో మరుగుదొడ్డి ఉండాల్సిందేనని స్పష్టంగా చెప్పడంతో అత్తింటివారు, పుట్టింటివారు చకచకా ఆ ఏర్పాటు చేశారు. పెళ్లి సమయంలో ఇచ్చే నగలు, ఆభరణాలు, కట్నకానుకలతోపాటు ఓ తాత్కాలిక 'టాయిలెట్'ను కూడా పెట్టారు.
మహారాష్ట్రలోని అలోకా జిల్లా అందురా గ్రామానికి చెందిన చైతలీ గలాఖే అనే అమ్మాయికి యవత్మాలా జిల్లాకు చెందిన దేవేంద్ర మకోడే అనే అబ్బాయితో ఇటీవల పెళ్లి జరిగింది. పెళ్లి కుదిరిన తర్వాత అత్తారింట్లో మరుగుదొడ్డి లేదన్న సంగతి చైతలీకి తెలిసింది. దీంతో ఆమె మరుగుదొడ్డి కావాల్సిందేనని ధైర్యంగా అడిగింది. ''అత్తవారింటికి పెళ్లి కానుకలుగా తీసుకువెళ్లేవాటిలో టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, బంగారు ఆభరణాలు వంటివి ఉండాలని నేను అనుకోవడంలేదు. రెడీమేడ్ టాయిలెట్ మాత్రం ఉండాలని నేను అనుకుంటున్నాను'' అని ఆ పెళ్లి కూతురు చైతలీ చెప్పింది.
దీంతో పుట్టింటివారు, మెట్టింటివారు కలిసి అన్ని వసతులు ఉన్న ఓ టాయిలెట్ (ప్రిఫ్యాబ్రికేటెడ్)ను కట్నకానుకలతో కలిపి ఇచ్చారు. పెళ్లి కానుకలలో ఉన్న ఈ టాయిలెట్‌ను చూసి ఆశ్చర్యపోవడం పెళ్లికి వచ్చిన వారి వంతైంది! ఆలోచనతోపాటు అడిగే సత్తా ఉంటే మరుగుదొడ్డి వచ్చేస్తుందని చైతలీ రుజువు చేసింది.