
ముంబై : ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేను శాసన మండలి సభ్యునిగా నామినెట్ చేయాలంటూ గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారిని మంత్రివర్గం మరోసారి అభ్యర్థించింది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అధ్యక్షతన సోమవారం ఏర్పాటైన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు తీర్మానించింది. గడిచిన రెండు వారాల్లోనే రాష్ర్ట కేబినెట్ రెండు సార్లు ఈ ప్రతిపాదనను గవర్నర్ ముందుంచింది. అయితే కోష్యారి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
2019 నవంబర్ 28 న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఠాక్రే ఇప్పటివరకు ఏ చట్టసభల్లోనూ సభ్యుడు కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల లోపు ఉభయ సభల్లో (అసెంబ్లీ, మండలి )ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంది. రానున్న మే 28 నాటికి ఠాక్రే సీఎంగా ఎన్నికై ఆరు నెలల పదవీకాలం ముగియనుంది. ఈ లోపు ఏదైనా సభకు ఎన్నిక కాకపోతే ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఒక నెల సమయం మాత్రమే ఉంది. కరోనా సంక్షోభంలో ఇప్పుడు ఎన్నికలు జరిగే ప్రసక్తి లేదు. ఈ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయంపైనే రాష్ర్ట రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి. ( సీఎం పదవికి గండం..ఎమ్మెల్సీ పదవి ఇవ్వండి)