
3 నెలల్లో 18 కేజీల బరువు తగ్గిన సీఎం
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కాస్త సన్నబడ్డారు. మూడు నెలల్లో 18 కేజీలు తగ్గి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. క్రమబద్ధమైన ఆహార నియమాలు పాటించి బరువు తగ్గించుకున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసే నాటికి ఆయన బరువు 122 కేజీలు. గత డిసెంబర్ లో ఆయన మొదటిసారిగా వైద్యులను సంప్రదించారు.
అప్పటి నుంచి డాక్టర్ల సూచనల మేరకు డైటింగ్ చేస్తున్నారు. అనవసర తిండి మానేశారు. జీవక్రియను మెరుగుపరిచే ఆహారం తీసుకుంటూ, వారానికి రెండు గంటలు పథ్యం పాటిస్తున్నారు. ఫలితంగా మూడు నెలల్లో 18 కేజీలు తగ్గారు. ఇప్పుడు ఆయన బరువు 104 కిలోలకు చేరింది. తన బరువును 88-90 కిలోలకు తగ్గించుకోవాలని ఫడ్నవీస్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే విధంగా ఆహార నియమాలు పాటిస్తే ఆయన కచ్చితంగా బరువు తగ్గుతారని డాక్టర్లు చెబుతున్నారు.
బరువు తగ్గడంపై మాట్లాడేందుకు ఫడ్నవీస్ నిరాకరించారు. ఇది తన వ్యక్తిగత విషయమని, దీనిపై మాట్లాడాలనుకోవడం లేదని విలేకరులతో అన్నారు. తన భర్త బరువు తగ్గడంపై ఫడ్నవీస్ సతీమణి అమృత సంతోషం వ్యక్తం చేశారు. పని ఒత్తిడి, వేళాపాళాలేని తిండి కారణంగానే ఆయన బరువు పెరిగారని వెల్లడించారు. తాను ఐదారుకేజీలు బరువు తగ్గడంతో ఆయన కూడా తనను స్ఫూర్తిగా తీసుకున్నారని ఒకింత గర్వంగా చెప్పారు.