
మోదీ ఏం చదివారు? ఎన్ని డిగ్రీలు ఉన్నాయి?
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉన్న విద్యార్హతలేమిటో వెల్లడించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ)కి లేఖ రాశారు. ప్రధాని మోదీకి ఉన్న డిగ్రీలేమిటో ప్రజలకు తెలియజేయాల్సిన అసవరముందని, ఈ విషయంలో ప్రజల్లో ఉన్న సందేహాలను తొలగించాలని ఆయన కోరారు.
'ప్రధాని మోదీ తన విద్యార్హతల గురించి వివరాలు ప్రజలకు తెలియజేయకుండా సంబంధిత విభాగాలను అడ్డుకుంటున్నారని కథనాలు వస్తున్నాయి. ప్రధానికి ఎలాంటి విద్యార్హతలుగానీ, డిగ్రీలుకానీ లేవనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరముంది' అని కేజ్రీవాల్ హిందీలో రాసిన ఈ లేఖలో పేర్కొన్నారు.
కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ పేరిట రాసిన ఈ లేఖలో సీఐసీ పనితీరుపైనా కేజ్రీవాల్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. 'నా విద్యార్హతల గురించి పూర్తి వివరాలు మీరు తెలుసుకున్నారు. కానీ ప్రధాని డిగ్రీల గురించి వివరాలు రహస్యంగా ఉంచుతున్నారు. ఇది సీఐసీ స్వతంత్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నది' అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.