'ఆ ముందు రోజు జైట్లీని మాల్యా కలిశారు'
న్యూఢిల్లీ: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోవడానికి ముందు రోజు మార్చి 1న పార్లమెంట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశారని ఏఐసీసీ ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా ఆరోపించారు. జైట్లీ, మాల్యా ఎందుకు సమావేశమయ్యారన్ని విషయంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశం గురించి ప్రధాని నరేంద్ర మోదీకి తెలుసుంటే ఆయన కూడా పార్లమెంట్కు వివరణ ఇవ్వాలని అన్నారు.
బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయలు ఎగవేసి మాల్యా విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. కాగా తాను ఎక్కడికీ పారిపోలేదన్న మాల్యా.. ఇప్పట్లో దేశానికి తిరిగిరానని చెప్పారు. దీనిపై సూర్జేవాలా స్పందిస్తూ.. కేంద్రం మాల్యాను దేశానికి రప్పించకపోతే ఈ కేసు ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ కేసు మాదిరిగా మారుతుందని హెచ్చరించారు. మాల్యాకు బీజేపీ పెద్దలు సహకరించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాగా మనీల్యాండరింగ్ కేసు విచారణకు హాజరుకాకుండా లలిత్ మోదీ లండన్లో తలదాచుకుంటున్నారు.
ఇదిలావుండగా చెక్ బౌన్స్ కేసులో హైదరాబాద్ ఎర్రమంజిల్ కోర్టు మల్యా సహా ఐదుగురికి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. మార్చి 29న కోర్టులో వారిని హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది.