
ఢాకాలోని హజ్రత్ షాజాలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి స్వాగతం పలుకుతున్న బంగ్లా విదేశాంగ మంత్రి, ఇతర సిబ్బంది.
ఢాకా: ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పర్యటన అధికారికంగా ప్రారంభం కావడానికి కొద్ది గంటల ముందే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఢాకాలో అడుగుపెట్టారు. కొద్ది కాలంగా ఎడమొహం పెడమొహంగా వ్యవహరిస్తోన్న మోదీ, మమతలు కలిసే బాంగ్లాకు బయలుదేరుతారని అంతా భావించినప్పటికీ మోదీ కంటే ముందే దీదీ ఢాకా చేరుకోవడంతో ఈ పర్యటన మరింత ఆసక్తికరంగా మారింది. శుక్రవారం రాత్రి ఢాకాలోని హజ్రత్ షాజాలాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మమతకు బంగ్లా విదేశాంగ మంత్రి షహరియార్ ఆలం ఘనస్వాగతం పలికారు.
తొలిసారి తమ దేశంలో పర్యటించున్న భారత ప్రధాని నరేంద్రమోదీకి భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేసింది బంగ్లా ప్రభుత్వం. అందులో భాగంగానే ఢాకాను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పలుచోట్ల మోదీ, మమతా, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, బంగ్లా ప్రధాని షేక్ హసీనాల నిలువెత్తు కటౌట్లు పెట్టారు. విమానాశ్రయం నుంచి ఢాకా వరకు 14 కి.మీ పొడవున హోర్డింగ్‌లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.
రెండు రోజుల పర్యటనలో బంగ్లాతో సరిహద్దు ఒప్పందంతోపాటు ఇరుదేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని హసీనా, మోదీ చర్చిస్తారు. అనంతరం కోల్‌కతా-ఢాకా-అగర్తల, ఢాకా-షిల్లాంగ్-గువాహటి బస్సు సర్వీసులను వారిరువురు జెండా ఊపి ప్రారంభిస్తారు.