ఢిల్లీపై యుద్ధం చేస్తాం: మమత
⇒ శారద కుంభకోణంలో తృణమూల్ పేరును లాగడంపై మమత ఫైర్
⇒ కుంభకోణంలో అతిపెద్ద లబ్ధిదారు మమతా బెనర్జీయే: కునాల్ ఘోష్
⇒ నిందతులకు సాయపడేలా మమత వ్యాఖ్యలున్నాయన్న బీజేపీ
కోల్‌కతా/న్యూఢిల్లీ: శారద కుంభకోణంలో తమ పార్టీ పేరును లాగడాన్ని రాజకీయంగా, ప్రజాస్వామ్యంగా ప్రతిఘటిస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్పష్టం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా తమ పోరును ఢిల్లీ వరకు తీసుకెళ్తామని తీవ్రంగా హెచ్చరించారు. ‘మా సహనం నశిస్తోంది. మా గురించి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. కానీ బెంగాల్ మట్టి చాలా బలమైనది. ఇక్కడ విత్తు నాటితే.. ఢిల్లీలో వృక్షమవుతుంది. వీధుల్లోకెక్కేలా మాపై ఒత్తిడి తెస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
శారద కుంభకోణంలోకి తమ పార్టీని లాగడాన్ని నిరసిస్తూ అవసరమైతే ఢిల్లీలోనూ ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. శారద కుంభకోణంతో సంబంధాలున్నాయంటూ వేధింపులకు గురిచేస్తున్న సీబీఐకి వ్యతిరేకంగా సోమవారం కోల్‌కతాలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆమె ప్రసంగించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు సీబీఐని దుర్వినియోగం చేస్తున్నారని, రాజకీయ క్షక్ష సాధింపునకు సాధనంగా సీబీఐని వాడుకుంటున్నారని మమత ఆరోపించారు. బ్లాక్‌మనీ అంశంలో కేంద్ర ప్రభుత్వ ముసుగును త్వరలోనే తొలగిస్తామన్నారు. మరో వైపు, సస్పెన్షన్‌లో ఉన్న సొంతపార్టీ ఎంపీ కునాల్ ఘోష్ మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు.
శారద కుంభకోణంలో అతిబెద్ద లభ్దిదారు మమతా బెనర్జీయేనని ఆరోపించారు. తన్ను తాను రక్షించుకునేందుకు పార్టీ సమావేశాలు పెట్టి ఆరోపణలు గుప్పిస్తున్నారని విమర్శించారు. కాగా, మమత ఆరోపణలపై బీజేపీ స్పందించింది. ఆమె ఆరోపణలు శారద కుంభకోణం నిందితులకు సాయపడేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ‘ఆమె గట్టి పోరాట యోధురాలే, సీపీఎం పాలనను అంతమొందించి పశ్చమ బెంగాల్‌లో పెద్దమార్పే తెచ్చారు. ఆమెతో మేంకూడా కలసిపనిచేశాం. అయితే, ఇపుడు కేంద్రంపై ఇలాంటి ఆరోపణలు చేయడం నిందితులకే ఉపయోపడుతుంది. అందుకు బదులుగా నిందుతులను దూరంగా పెడితే బాగుంటుంది’ అని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు సూచించారు.