
సాక్షి,న్యూఢిల్లీ: పద్మావతి మూవీపై ముసురుకున్న వివాదంపై సినీ, రాజకీయ ప్రముఖులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పద్మావతి వివాదంపై స్పందించారు. పద్మావతి మూవీపై వ్యక్తమవుతున్న నిరసనలను దీదీ తోసిపుచ్చారు. మొత్తం వ్యవహారాన్ని సరిగ్గా ఎదుర్కోలేకపోవడంతో దేశంలో సూపర్ ఎమర్జెన్సీ నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.
‘పద్మావతి వివాదం దురదృష్టకరం...ఓ రాజకీయ పార్టీ భావప్రకటన స్వేచ్ఛను హరించే క్రమంలో వ్యూహాత్మక ప్రణాళికతో వ్యవహరిస్తుండటంతోనే దేశంలో అత్యయిక పరిస్థితి నెలకొంది‘ అన్నారు. చిత్ర పరిశ్రమలోని వారంతా ఏకమై దీనిపై గళమెత్తాలని మమతా బెనర్జీ పిలుపు ఇచ్చారు.
మరోవైపు పద్మావతి మూవీని తమ రాష్ట్రంలో నిషేధిస్తున్నట్టు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. చౌహాన్ నిర్ణయాన్ని కాంగ్రెస్ పాలిత పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ సమర్ధించడం గమనార్హం.చరిత్రను వక్రీకరిస్తే సహించేదిలేదని స్పష్టం చేశారు.