నిజమెంత? నిజాయతీ ఎంత? | Sakshi Editorial On The Kerala Story Movie Issue | Sakshi
Sakshi News home page

నిజమెంత? నిజాయతీ ఎంత?

Published Fri, May 5 2023 12:10 AM | Last Updated on Fri, May 5 2023 12:10 AM

Sakshi Editorial On The Kerala Story Movie Issue

‘నిజజీవిత ఘటనల నుంచి ప్రేరణ పొంది తీశామ’ని అంటున్న సినిమాలో నిజాలు ఉంటాయనే ఆశిస్తాం. నిజాయతీగా ఉంటుందనే భావిస్తాం. కానీ అవే లోపిస్తే? శుక్రవారం విడుదలవుతున్న హిందీ చిత్రం ‘ది కేరళ స్టోరీ’ సరిగ్గా అవే ఆరోపణల్ని ఎదుర్కొంటోంది. విషయం మద్రాస్, కేరళ హైకోర్ట్‌ల మొదలు సర్వోన్నత న్యాయస్థానం దాకా వెళ్ళాల్సి వచ్చింది.

దాదాపు 10 కట్స్‌తో సెన్సార్‌ బోర్డ్‌ పచ్చజెండా ఊపిన ఈ వివాదాస్పద చిత్ర ప్రదర్శనను ఆపడానికి కానీ, కనీసం ‘కల్పిత పాత్రలతో అల్లుకున్న కథ’ అని టైటిల్స్‌లో వేయడానికి కానీ గడచిన మూడు రోజుల్లో 3 సార్లు సుప్రీమ్‌ ససేమిరా అనడంతో, బంతి ఇప్పుడు థియేటర్లలోని ప్రజాకోర్టులో పడింది.

‘సంఘ్‌ పరి వార్‌ వారి అసత్యాల కర్మాగారంలో తాజా ఉత్పత్తి’ అంటూ కేరళ సీఎం ఈ చిత్రాన్ని గర్హించారు. కేరళలో జెండా పాతాలని ప్రయత్నిస్తున్న బీజేపీ మినహా ప్రతిపక్షాలూ ఆ మాటే అంటున్నాయి. బహిష్కరణ పిలుపుతో సహా కేరళ సర్కార్‌ వివిధ మార్గాలు అన్వేషిస్తున్న నేపథ్యంలో కల్పనను నిజమని నమ్మించే ప్రమాదభరిత సృజనాత్మక స్వేచ్ఛ విపరిణామాలపై కచ్చితంగా చర్చ అవసరం. 

ఏప్రిల్‌ ద్వితీయార్ధంలో ట్రైలర్‌ వచ్చినప్పటి నుంచి ‘కేరళ స్టోరీ’ వివాదాలకు కేంద్రబిందువైంది. తీవ్రవాద ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ప్రభావం పతాకస్థాయిలో ఉన్నవేళ కేరళ నుంచి ‘దాదాపు 32 వేల మంది స్త్రీలు’ కనిపించకుండాపోయారనీ, వారి తెర వెనుక కథల్ని ‘బహిర్గతం’ చేసే యత్నమే మత  మార్పిడి అంశం ఇతివృత్తమైన ఈ చిత్రమనీ దర్శక, నిర్మాతల మాట. ‘లవ్‌ జిహాద్‌’లో భాగంగా 32 వేల మందినీ ముస్లిమ్‌లుగా మార్చి, అత్యధికులను ఐఎస్‌ పాలనలోని సిరియాకు తీసుకువెళ్ళారనేది ఈ చిత్ర వాదన.

సాక్ష్యాధారాలు లేని ఈ కాకుల లెక్కతో కేరళను తీవ్రవాదానికి పట్టుగొమ్మ అన్నట్టు చిత్రించడంపై సహజంగానే అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఇది ముస్లిమ్‌లపట్ల ద్వేషం పెంచే దుర్మార్గ ప్రయత్నమనే వాదన బలపడింది. ‘లవ్‌ జిహాద్‌’ లేదని నాటి కేంద్ర హోమ్‌ శాఖ సహాయ మంత్రే పార్లమెంట్‌లో చెప్పినప్పుడు కేరళపై బురద చల్లేలా ఇలాంటి సినిమా ఎలా తీస్తారన్నది ప్రశ్న.

కేరళలో హిందువుల జనాభా దాదాపు 55 శాతమైతే, ఆ తర్వాత అత్యధికంగా ముస్లిమ్‌లు 26 శాతం పైగా, క్రైస్తవులు 18 శాతం ఉన్నట్టు లెక్క. దశాబ్దాల క్రితమే సంపూర్ణ అక్షరాస్యత సాధించి, నిత్యం చైతన్యం నిండిన ఆలోచనాపరుల సమాజంగా దేశంలో మలయాళ సీమది ప్రత్యేక స్థానం. సాహిత్యం, సంస్కృతి, కళలు, సినిమాలు సహా అనేక రంగాల్లో దిక్సూచిగా నిలిచిన ఘనత దానిది. మానవాభివృద్ధి సూచిలో ముందుంది.

అలాంటి రాష్ట్రాన్ని పచ్చి తీవ్రవాదానికి పట్టుగొమ్మ అన్నట్టు చిత్రించడం కించపరచడమే. విమర్శలు పెరిగి, వివాదం ముదిరేసరికి సినీరూపకర్తలు సైతం సర్దు కోవాల్సి వచ్చింది. కేరళలోని ‘32 వేల మంది మహిళల కథల ఆధారంగా తీశా’మంటూ మొదట ట్రైలర్‌లో తొడకొట్టినవాళ్ళు చివరకు మే మొదట్లో దాన్ని ముగ్గురంటే ‘ముగ్గురు యువతులు’గా మార్చేశారు.

కడుపులో ఏదో పెట్టుకొని కథ రాసుకున్నప్పటికీ కోట్లు పెట్టి సినిమా తీసినవారికి మూడుకూ, 32 వేలకూ తేడా తెలీదా? ఒకటీ అరా ఘటనలు జరిగాయేమో తెలీదు కానీ దాన్ని పట్టుకొని కేరళలోని ప్రబలమైన ధోరణి అన్నట్టు చిత్రించాలనుకోవడం ఏ రకంగా సమర్థనీయం? మొత్తం కేరళ కథ అన్నట్టు సినిమాకు పేరు పెట్టి, బురద జల్లడం ఎవరిచ్చిన సృజనాత్మక స్వేచ్ఛ?

భావప్రకటన స్వేచ్ఛను కాపాడాల్సిందే. సృజనాత్మక స్వాతంత్య్రం కావాల్సిందే! కానీ ట్రైలర్‌ను బట్టి చూస్తే... వాస్తవాలను చూపుతున్నామనే పేరుతో, నిజాలను వక్రీకరించి సంచలనాత్మకం చేయడం ‘కేరళ స్టోరీ’లోని అతి పెద్ద ఇబ్బంది. ఇలా లెక్కలతో సహా అన్నిటినీ అతి చేస్తున్నప్పడు ఈ చిత్ర రూపకల్పన వెనుక ఉన్న ఉద్దేశాలపై, సాధించదలచిన లక్ష్యాలపై తప్పక అనుమానాలు తలెత్తుతాయి. పైగా, కేరళలో ముస్లిమ్, ముస్లిమేతరులుగా ప్రజలను రెండు ప్రత్యర్థి వర్గాలుగా ఏకీకృతం చేసే ప్రయత్నాలు పెరుగుతున్న సమయంలో సినిమా రావడం సందేహాల్ని పెంచుతోంది.

ఆ మధ్య ‘పద్మావత్‌’ నుంచి ఇటీవలి ‘పఠాన్‌’ దాకా సినిమాలపై నిషేధపు డిమాండ్లు, కోర్టు కేసులు చూశాం. అప్పుడైనా ఇప్పుడైనా నిషేధాలు పరిష్కారం కావు. కానీ సెంటిమెంట్లను దెబ్బతీసి, ఉద్రి క్తత సృష్టించి, విద్వేషాన్ని పెంచే ప్రయత్నాలను తప్పక అడ్డుకోవాల్సిందే. శాంతిభద్రతలకు భంగం వాటిల్లినప్పుడు భావప్రకటన స్వేచ్ఛపై నిర్బంధాలు తప్పవని ఆర్టికల్‌ 19 (2) అనుమతిస్తోంది.

శాంతిభద్రతలేమో కానీ, మనోఫలకంపై నిలిచి ఆలోచనల్లోకి ఇంకిపోయే భావోద్వేగాల ప్రభావమే అర్ధసత్య చిత్రాలతో అతి ప్రమాదం. బ్రిటిష్‌ వారి వద్దే మన్యం వీరుడు అల్లూరి పోలీసుగా పని చేశాడని భావితరాలు నమ్మేలా సినిమా తీసి, ఆస్కార్ల దాకా వెళ్ళిన మన కథలే అందుకు సాక్ష్యం. ‘కేరళ స్టోరీ’కీ కనీసం కల్పితపాత్రల కథనమని పేర్కొనమంటూ పిటిషనర్లు కోరిందీ అందుకే. 

సెకనుకు 24 ఫ్రేమ్‌ల చొప్పున తెరపై చూపే సత్యం సినిమా అనే సూక్తికి ‘కేరళ స్టోరీ’ లాంటివి నిలబడతాయా అన్నది సందేహమే! సామాన్య ప్రజలు తాము తెరపై చూసేదంతా సత్యమని భ్రమ పడితే, సమాజంలో పెచ్చరిల్లే విద్వేషాగ్నికి బాధ్యులెవరు? ‘కశ్మీర్‌ ఫైల్స్‌’తో దేశం ఆ చివరన మొద లైన అర్ధసత్య, అసత్య ప్రచార చిత్రాలు ఇప్పుడు ‘కేరళ స్టోరీ’తో ఈ చివరన కన్యాకుమారికి విస్తరించడం దేనికి సంకేతం? భావప్రకటన స్వేచ్ఛ ఓకే కానీ, నిజాన్ని వక్రీకరించి చూపడంపై గళమెత్తా ల్సిందే! ఈ రొచ్చుకు అడ్డుకట్ట ఏమిటో కనిపెట్టాల్సిందే! రాజకీయ ప్రయోజనాల కోసం సినిమాను వాడుకొనేందుకు పెరుగుతున్న ప్రాపగాండా ప్రయత్నాలను గమనించాలి. గత తొమ్మిదేళ్ళలో ఎన్నికల ముందే ఇలాంటి చిత్రాలు ఎందుకు, ఎవరి ప్రాపుతో వస్తున్నాయో ఆలోచించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement