
సదానందది ‘సంపన్నుల రైలు’
రైల్వే బడ్జెట్‌పై విపక్షాల ధ్వజం
కేంద్రం అవమానించింది.. రగిలిపోతున్నా: మమత
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అసంబద్ధమైన రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని విపక్షాలు ధ్వజమెత్తాయి. ఇది నిరుపయోగమైన రైల్వే బడ్జెట్ అని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించగా సరుకు రవాణా ద్వారా భారీ ఆదాయం సమకూర్చే ఒడిశాకు ఒరిగింది ఏదీ లేదని బిజూ జనతాదళ్ ఆక్రోశించింది. గతంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాల పట్ల ఆదరణ చూపుతామన్న మోడీ సర్కారు హామీని నిలబెట్టుకోలేదని దుయ్యబట్టింది. దేశంలోని చాలా ప్రాంతాలను విస్మరించి నాలుగైదు నగరాల మధ్యనే ప్రాజెక్టులను పరిమితం చేశారని జేడీయూ తప్పుబట్టింది. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ధరలు తగ్గిస్తారని భావించినా ఆ ఊసే లేదని బీఎస్పీ అధ్యక్షురాలు మాయవతి అసంతృప్తి వ్యక్తం చేశారు. ముంబైకు కొంత ఊరట తప్పితే మరాఠ్వాడా, విదర్భ, కొంకణ్ ప్రాంతాలను పట్టించుకోలేదని మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ చెప్పారు. రైల్వే శాఖ మాజీ మంత్రులు లాలూ ప్రసాద్, మమతా బెనర్జీ, పి.కె.బన్సల్, మల్లికార్జున ఖర్గే తాజా బడ్జెట్‌పై పెదవి విరిచారు. రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో పార్లమెంట్‌లో ఉండుంటే ఏం చేసేదాన్నో తనకే తెలియదని మమత రౌద్ర రూపం దాల్చారు. మోడీ సర్కారు బెంగాల్‌ను నిర్లక్ష్యం చేసిందని తిట్టిపోశారు. మరోవైపు దేశ రాజధానిలో కాంగ్రెస్ కార్యకర్తలు రైల్వే మంత్రి సదానంద గౌడ నివాసం వద్ద ఆందోళనకు దిగి ఆయన ఇంటికి ఉన్న నామ ఫలకాన్ని తొలగించారు. మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారీ పోకడలో నడుస్తూ రైల్వేల ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఎంపీ, రైల్వే శాఖ మాజీ సహాయ మంత్రి అధిర్ రంజన్ చౌధురి ఏఐసీసీ కార్యాలయంలో మీడియాతో పేర్కొన్నారు. రైల్వే మంత్రి సదానంద గౌడ యూపీఏ విధానాలను విమర్శించటమే పనిగా పెట్టుకున్నారని తప్పుబట్టారు.
సదానంద గౌడ ఇంటి వద్ద కాంగ్రెస్ నిరసన
రైల్వేలో ప్రైవేటీకరణకు దారులు తెరవొద్దని డిమాండ్ చేస్తూ ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంగళవారం రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ నివాసం ఎదుట ధర్నాకు దిగారు. ఢిల్లీ త్యాగరాజ్ మార్‌గ-1లోని ఆయన ఇంటి ఎదుట సాయంత్రం ఆందోళన నిర్వహించారు. సదానంద గౌడ ఇంటి గేటు వద్ద ఆయన పేరుతో ఉన్న నామ ఫలకాన్ని తొలగించి కాళ్లతో తొక్కారు. రైల్వే మంత్రి కారు ఇంట్లోకి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సదానందగౌడ, ప్రధాని నరేంద్రమోడీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటీవల పెంచిన రైల్వే చార్జీలను తక్షణం ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని వెనక్కి నెట్టారు. అయితే తమ కార్యకర్తలను వెంటనే మందలించినట్లు అర్విందర్ సింగ్ లవ్లీ తెలిపారు. బడ్జెట్‌లో ప్రకటించిన బుల్లెట్ రైళ్ల ప్రతిపాదనను కంటితుడుపు చర్యగా అభివర్ణించారు.