కోల్‌కతా : కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా తనపై చేసిన వ్యాఖ్యలను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తోసిపుచ్చారు. వలస కూలీలను స్వస్ధలాలకు తరలించేందుకు ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్లను కరోనా ఎక్స్‌ప్రెస్‌గా దీదీ వ్యాఖ్యానించడం వలస కూలీలను అవమానించడమేనని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దీదీ మౌనం వీడారు. కరోనా ఎక్స్‌ప్రెస్ వ్యాఖ్యలే మమతా బెనర్జీ రాజకీయ పతనానికి నాందిగా అమిత్ షా పేర్కొన్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై దీదీ స్పందిస్తూ తాను కరోనా ఎక్స్‌ప్రెస్ అని ఎన్నడూ అనలేదని..ప్రజలు ఇలా అంటున్నారని మాత్రమే తాను చెప్పానని ఆమె గుర్తు చేశారు. లాక్‌డౌన్‌తో వలస కూలీల కష్టాలపై రాష్ట్రాలు స్పందించిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిందని చెప్పుకొచ్చారు.
ఫేస్‌బుక్ లైవ్‌లో ఆమె మాట్లాడుతూ తొలుత వలస కూలీల రైళ్లపై తమ అభ్యంతరాలను అపార్థం చేసుకున్నారని చెప్పారు. ప్రత్యేక రైళ్లలో కిక్కిరిసిన జనంతో కరోనా వైరస్ మరింత విస్తరిస్తుందనే ఉద్దేశంతోనే రైలు సర్వీసులను వ్యతిరేకించామని, వలస కూలీల తరలింపులో రైల్వేలు భౌతిక దూరం పాటించే నిబంధనలను పక్కనపెట్టాయని అన్నారు. స్వస్ధలాలకు వలస కూలీల చేరికతో పలు రాష్ట్రాల్లో కరోనావైరస్ కసులు పెరిగాయని గుర్తుచేశారు. వలస కూలీల దుస్ధితిపై కేంద్రం తీరును దీదీ తప్పుపట్టారు. లాక్‌డౌన్ ప్రకటించకముందే వలస కూలీలను ప్రత్యేక శ్రామిక్ రైళ్లలో తరలిస్తే అప్పుడు ఈ కార్మికులు మూడు నెలల పాటు ఇబ్బందులు ఎదుర్కొనేవారు కాదని అన్నారు. తమ రాష్ట్రంలో వలస కూలీలు ఎక్కడికీ వెళ్లాలని అనుకోవడం లేదని మమతా బెనర్జీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment