కోల్‌కత్తా : పెద్ద నోట్ల రద్దు తొలి వార్షికోత్సవ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ట్విట్టర్ అకౌంట్ డీపీని మార్చేశారు. తన ట్విట్టర్ డీపీ పూర్తిగా నల్లటి రంగును పెట్టుకున్నారు. నోట్ బ్యాన్‌కు వ్యతిరేకంగా ఆమె ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. '' నోట్ల రద్దు ఓ విపత్తులాంటిది. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన ఈ స్కామ్(డీమానిటైజేషన్)కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ.. నవంబర్ 8ని మేము బ్లాక్ డేగా పరిగణిస్తాం'' అని మమతా చెప్పారు. ప్రజలను తీవ్ర స్థాయిలో బాధపెట్టిన నోట్ల రద్దు, జీఎస్టీకి వ్యతిరేంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వర్కర్లు ర్యాలీలు జరుపుతారని తెలిపారు. ప్రజలను వేధించిన జీఎస్టీ, అతిపెద్ద స్వార్థపరమైన పన్ను అని అభివర్ణించారు.
ఉద్యోగాలను కొల్లగొట్టిందని, వ్యాపారాలను దెబ్బతీసిందని, ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లేలా చేసిందని మండిపడ్డారు. జీఎస్టీ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. గతేడాది ప్రభుత్వం ప్రకటించిన నోట్ల రద్దును తీవ్ర స్థాయిలో వ్యతిరేకించిన వారిలో మమతా బెనర్జీ ఒకరు. బ్లాక్‌మనీకి వ్యతిరేకంగా ప్రధాని నరేంద్రమోదీ పాత రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసిన కొన్ని రోజుల్లోనే, దీనిపై అధ్యక్షుడికి ఓ మెమోరాండం సమర్పించారు. తర్వాత మోదీ ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద ఆర్థిక సంస్కరణ జీఎస్టీ అమలును కూడా ఆమె వ్యతిరేకించారు. దీని ఆవిష్కరణ సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఆ అర్థరాత్రి జరిగిన ఫంక్షన్‌కు మమతా బెనర్జీ పార్టీ బాయ్‌కాట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment