'జాగ్రత్త.. అలాంటి చెత్త పనులు సహించను'
కోల్కతా: గో సంరక్షకులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గో సంరక్షణ పేరుతో ఎవరైనా హింసాత్మక చర్యలకు పాల్పడితే, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హింసకు దిగే గోసంరక్షకులపై ఏమైనా చర్యలు తీసుకుంటారా అన్న ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చారు.
'వెజిటేరియన్స్ వెజ్ను.. నాన్ వెజిటేరియన్స్ నాన్ వెజ్ ను తింటారు. ఎవరు ఏం తినాలో ఏం తినకూడదో చెప్పడానికి అసలు వీళ్లంతా ఎవరు?. ఇలాంటి చెత్తపనులు మానుకోవాలని నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి తమ మతాన్ని సంరక్షించుకునే హక్కు ఉంది. యూరప్ లో గోవులను తింటారు. గిరిజనులు కూడా వాటిని తింటారు. మతం పేరిట ఏ ఒక్కరు ఈ అంశంపై అతి చేసినా వారిని వదిలిపెట్టే సమస్యే లేదు. నేను ఇలాంటి వాటిని అస్సలు సహించలేను. ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే డ్రైవర్ ది ఏ మతం అని అడుగుతున్నారు. ఈలోగా బాధితుడు ప్రాణాలుకోల్పోతున్నాడు. బాధితులకు నేరస్థుల నుంచి నష్టపరిహారం చెల్లించేలా ఓ బిల్లును వచ్చే సమావేశాల్లో తీసుకొస్తాం. దీనిని గత ఐదేళ్లకు వర్తింపజేసి అమలు చేస్తాం. రాజకీయాలు అనేవి సిద్దాంతాల పరంగా ఉండాలి తప్ప మతం, ప్రజల ఆధారంగా కాదు' అని మమత అన్నారు.