
లక్నో : లాక్‌డౌన్ కారణంగా దేశంలో వింత వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజలు బయటకు వెళ్లేందుకు రక రకాల ప్లాన్లు వేస్తూ చివరికి పోలీసులకు చిక్కిపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి పెళ్లి చేసుకునేందుకు అంబులెన్స్ ను అడ్డుగా వాడుకుని ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ నుంచి ఢిల్లీకి వెళ్లాడు. చివరికి విషయం పోలీసులకు తెలియడంతో పెళ్లి కూతురుతో సహా కుటుంబ సభ్యులందరూ క్వారంటైన్‌కు వెళ్లారు. (చదవండి : ‘కొట్టు’కెళ్లి కోడలిని పట్టుకొచ్చాడు)
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన అహ్మద్‌కు ఇటీవల ఢిల్లీకి చెందిన ఓ యువతికితో యువతితో వివాహం నిశ్చయమైంది. అయితే లాక్‌డౌన్ కారణంగా యువకుడు, అతని తండ్రి ముజఫర్‌నగర్‌లోనే చిక్కుకుపోయారు. పెళ్లి రోజు దగ్గరపడడంతో ఇద్దరు ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. నాలుగు రోజుల క్రితం ముజఫర్‌నగర్ నుంచి బయలుదేరి మార్లమధ్యలో పోలీసులకు చిక్కారు. దీంతో వారిని తిరిగి ఇంటికి పంపించారు.
పక్కా ప్లాన్‌తో
ఈ సారి ఎలాగైనా ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్న తండ్రి, కొడుకులు పథకం రచించారు. అంబులెన్స్‌లో వెళ్లితే ఎవరూ అడ్డుకోరని భావించి.. తన తండ్రికి ఆరోగ్యం విషమించిందని అంబులెన్స్‌కు కాల్ చేశాడు అహ్మద్. అంబులెన్స్ రావడంతో తండ్రికి తోడుగా వస్తానంటూ అహ్మద్ కూడా ఎక్కాడు. లాక్‌డౌన్ నిబంధన నుంచి అంబులెన్స్‌కు సడలింపు ఉండడంతో పోలీసులు ఎక్కడా వారిని అడ్డుగించలేదు. ఢిల్లీకి వెళ్లిన అనంతరం వారు ఆస్పత్రికి కాకుండా పెళ్లి కూతురు ఇంటికి వెళ్లారు. అనుకున్న సమయానికి పెళ్లి చేసుకొని పోలీసుల కళ్లు కప్పి ముజఫర్‌నగర్, ఖతౌలిలోని ఇంటికి చేరుకున్నారు.
ఇలా బయటపడింది
ఖతౌలిలో ఇటీవల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగు చూడడంతో ఆ ప్రాంతాన్ని కోవిడ్-19 హాట్‌స్పాట్‌గా ప్రకటించారు. అహ్మద్ ఇంట్లో జనాలు ఎక్కువగా కన్పించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అహ్మద్ ఇంటికి చేరుకొని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడితో పాటు బంధువులందరికి కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment