పార్లమెంట్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మాహుతికి యత్నం!
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహుతికి ప్రయత్నించిన సంఘటన సంచలనం రేపింది. సరిహద్దు రక్షణ దళాల( బీఎస్ఎఫ్) అధికారుల తీరును నిరసిస్తూ ఓ మాజీ బీఎస్ఎఫ్ జవాన్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహుతి చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఆత్మహుతికి పాల్పడిన వ్యక్తిని అశోక్ కుమార్ గా గుర్తించారు. మతి స్థిమితం లేని కారణంగా 2000 సంవత్సరంలో విధుల నుంచి అశోక్ కుమార్ ను తొలగించినట్టు పోలీసులు తెలిపారు.
పోలీసు కథనం ప్రకారం శుక్రవారం ఉదయం ముగ్గురు పిల్లు, భార్యతో కలసి విజయ్ చౌక్ చేరుకుని, కిరోసిన్ ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా రక్షణ దళ అధికారులు అడ్డుకున్నారని పోలీసులు తెలిపారు. అశోక్ కుమార్ ను అదుపులోకి తీసుకుని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తనకు సహాయం అందించాలని హోంమంత్రి కార్యాలయ అధికారులను, ఇతర సీనియర్ అధికారులను కలసినా ప్రయోజనం లేకపోండంతో మనస్తాపం చెందిన ఆయన ఆత్మాహుతికి పాల్పడ్డారని పోలీస్ అధికారి తెలిపారు.