
విజూ కృష్ణన్ (ఫొటో కర్టెసీ: న్యూస్18)
కేరళలోని మలబార్ రైతులు.. అప్పటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు, ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా 1946లో చరిత్రాత్మక పోరాటాన్ని నిర్వహించారు. ఆ ప్రాంతం ఆకలికి అల్లాడుతున్న సమయంలో వరి పంటను స్మగ్లింగ్ చేసేందుకు బ్రిటిష్ పాలకులు ప్రయత్నించడంతో వారిపై తిరగబడ్డారు. ఈ అద్భుతమైన రైతుపోరాటాన్ని గురించి వింటూ పెరిగిన విజూ కృష్ణన్ (44) అన్నదాతల సమస్యల గురించి తీవ్రంగా మథనపడేవారు... ఇంతకీ ఈ విజూ కృష్ణన్ ఎవరంటే.. తాజాగా మహారాష్ట్రలో 50వేలమంది రైతులు ఏకమై.. నిర్వహించిన ‘లాంగ్‌మార్చ్’ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి.. ఏడు దశాబ్దాల తర్వాత నాటి మలబార్ రైతు తిరుగుబాటును తలపించేరీతిలో నాసిక్ నుంచి ముంబై వరకు అశేషమైన రైతులు నిర్వహించిన పాదయాత్ర యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. పేద, ఆదివాసీ రైతులు తమ హక్కుల కోసం గర్జిస్తూ.. అరికాళ్లు బొబ్బలు ఎక్కినా లెక్కచేయకుండా ఏకంగా 180 కిలోమీటర్లు పాదయాత్ర చేసి.. సోమవారం ముంబైకి చేరుకున్న సంగతి తెలిసిందే. అకుంఠిత పట్టుదలతో రైతులు చేసిన ఈ లాంగ్‌మార్చ్‌తో దిగొచ్చిన ఫడ్నవిస్ ప్రభుత్వం వారి డిమాండ్లను నెరవేర్చేందుకు అంగీకరించింది.
ఈ నేపథ్యంలో అన్నదాతల ఈ మహా పోరాటం వెనుక ఉన్నది ఎవరు.. ఏకంగా 50వేలమంది రైతులను ఏకతాటికిపైకి తెచ్చి.. అత్యంత క్రమశిక్షణతో ముందుకు నడిపించిన శక్తి ఎవరంటే.. అందుకు వచ్చే సమాధానం విజూ కృష్ణన్.. అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాయింట్ సెక్రటరీగా ఉన్న ఆయన.. హక్కుల సాధన కోసం పోరాడేందుకు రైతులన్నను ఏకతాటిపైకి తెచ్చారు. 50వేలమంది రైతులను ఒక క్రమశిక్షణ కలిగిన సైన్యంగా, రైతు కార్యకర్తలుగా మలిచి.. ఏకంగా 180 కిలోమీటర్ల పాదయాత్రను విజయవంతంగా నిర్వహించారు. సుదీర్ఘంగా సాగిన ఈ పాదయాత్ర సందర్భంగా ఎక్కడ చిన్న అవాంఛనీయ ఘటన చోటుచేసుకోకపోవడం గమనార్హం. వ్యవసాయ సంక్షోభంతో అష్టకష్టాలు పడుతూ.. దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న రైతులను కలిసి.. ఏఐకేఎస్ ఆధ్వర్యంలో వారిని కూడగట్టి, సమాయత్తం చేసి.. విజూ కృష్ణన్ ఈ లాంగ్‌మార్చ్‌ను విజయవంతం చేశారు. ఈ లాంగ్‌మార్చ్ సక్సెస్ వెనుక ఏఐఏకేఎస్ పాత్రతో పాటు విజూ కృష్ణన్ నాయకత్వం ఉంది.
ఎవరీ విజూ..!
కేరళలోని కన్నూర్ జిల్లా కరివెల్లూరు విజూ స్వగ్రామం. ఇక్కడి రైతులే 1946లో బ్రిటిష్ పాలకులకు ఎదురుతిరిగి.. తమ హక్కులకై పోరాటం చేశారు. ఇక్కడి రైతుపోరాటాలను, అన్నదాతల కష్టనష్టాలను వింటూ పెరిగిన విజూ కృష్ణన్ వారి సమస్యలు తనవిగా భావించారు. గతంలో జవహార్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్‌కు అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన.. పలు విద్యార్థి ఉద్యమాలు నడిపించారు. ఎస్‌ఎఫ్‌ఐ ఫైర్‌బ్రాండ్ నేతగా పేరొందిన విజూ.. ప్రస్తుతం ఏఐకేఎస్ జాయింట్ సెక్రటరీగా కొనసాగుతూ... రైతుల ‘లాంగ్‌మార్చ్’లో అత్యంత కీలకంగా వ్యవహరించారు. సీపీఎం సెంట్రల్ కమిటీలో అత్యంత పిన్నవయస్సు సభ్యుడు కూడా ఆయనే. ప్రత్యేక ఆహ్వానితుడిగా సెంట్రల్ కమిటీలో సేవలు అందిస్తున్నారు. భారత వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ మార్పులపై డాక్టరేట్ చేసిన ఆయన.. బెంగుళూరు సెయింట్ జోసెఫ్ కాలేజీ పీజీ పొలిటికల్ సైన్స్ విభాగం అధిపతిగా కొన్నాళ్లు పనిచేసి.. అనంతరం రైతు కార్యకర్తగా సేవలు అందించేందుకు ఉద్యోగాన్ని వదిలేశారు.
తాజాగా మహా రైతులు చేపట్టిన లాంగ్‌మార్చ్.. వ్యవసాయ రంగంలో తిరుగుబాటుకు ప్రతీక అని ఆయన పేర్కొంటారు. గత రెండేళ్లుగా దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనబాట పడుతున్నారని, మహారాష్ట్రతోపాటు రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోనూ రైతు ఆందోళన జరిగాయని గుర్తుచేశారు. రాజస్థాన్‌లోనూ రైతుల పాదయాత్ర.. దాదాపు మహారాష్ట్ర లాంగ్‌మార్చ్ స్థాయిలో జరిగిందని, ఇది అఖిల భారత కిసాన్ సభ శక్తిని చాటుతోందని ఆయన అన్నారు. మీడియా రైతు సమస్యలను, ఆందోళనలపై దృష్టి సారించాలని అవసరముందని సూచించారు.
ఈ రైతుల లాంగ్‌మార్చ్ సీపీఎం పునరుత్థానానికి సంకేతమా? అని ప్రశ్నించగా.. ఇది తమ మనుగడ కోసం రైతులు చేసిన పోరాటం మాత్రమేనని అన్నారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాల కారణంగా.. పరిస్థితులు ఆ పార్టీకి వ్యతిరేకంగా మారుతున్నాయని, అయితే, ఈ పోరాటంలో ఎన్నికల రాజకీయ కోణం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, బీజేపీని ఓడించాలనుకుంటున్న శక్తులకు ఇది తప్పకుండా బలం చేకూరుస్తుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment