
సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌లో రాజకీయ సంక్షోభం న్యాయపోరాటం దిశగా సాగుతోంది. జమ్ము కశ్మీర్ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని సీనియర్ కాంగ్రెస్ నేత మనీష్ తివారీ ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కోరినందునే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. గవర్నర్ నిర్ణయాన్ని న్యాయస్ధానంలో సవాల్ చేస్తామన్నారు.
జమ్ము కశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చే భిన్న సిద్ధాంతాలతో కూడిన పార్టీల ఆధ్వర్యంలో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యమని అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అధికారాన్ని దక్కించుకునేందుకే ఆయా పార్టీలు కలుస్తున్నాయని, బాధ్యతాయుత ప్రభుత్వాన్ని అందించేందుకు కాదన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు ఊపందుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే గవర్నర్ నిర్ణయాన్ని పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment