మంఝికి నేడు ఉద్వాసన!
- పార్టీ ఎల్పీ భేటీలో నితీశ్‌కు పగ్గాలు!
- 20న తాను ఎల్పీ భేటీని నిర్వహిస్తానని మంఝి వెల్లడి
- ఇద్దరు మంత్రులను బర్తరఫ్ చేయాలని గవర్నర్‌కు సిఫార్సు
పట్నా: జేడీయూ నాయకత్వాన్ని ధిక్కరిస్తున్న బిహార్ ముఖ్యమంత్రి జితన్ రాం మంఝికి ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధమైంది. శనివారం జరిగే పార్టీ శాసనసభాపక్ష(ఎల్పీ) భేటీలో సీఎం పగ్గాలను సీనియర్ నేత నితీశ్‌కు అప్పగించే అవకాశాలున్నాయి. నితీశ్, మంఝి వర్గాల మధ్య ఆధిపత్య పోరు శుక్రవారం తీవ్రమైంది. పార్టీ చీప్ శరద్ యాదవ్ శనివారం ఏర్పాటు చేసిన ఎల్పీ సమావేశం అనధికారికమని మంఝి ఆరోపించారు.
అసెంబ్లీలో పార్టీ నేత హోదాలో తాను ఈ నెల 20న తన నివాసంలో ఎల్పీ భేటీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ ఆదివారం నిర్వహించనున్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు మంఝి శనివారం ఢిల్లీ వెళ్లనుండడంతో ఆ రోజు జరిగే ఎల్పీ భేటీకి గైర్హాజరు కానున్నారు. కాగా, శనివారం జరిగే అత్యవసర ఎల్పీ సమావేశానికి రావాలని మంఝి, నితీశ్ సహా 111 మంది ఎమ్మెల్యేలు, 41 మంది ఎమ్మెల్సీలకు శుక్రవారం నోటీసులు అందాయి.
జేడీయూ రాజ్యాంగం ప్రకారం పార్టీ అధ్యక్షుడికి ఎల్పీ భేటీని ఏర్పాటు చేసే అధికారం ఉందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి అన్నారు. ‘సాయంత్రం 4 గంటల తర్వాత మంఝి జేడీయూ ఎల్పీ నేతగా ఉండర’ని అన్నారు. మంఝి వెళ్లనున్న ‘నీతి’ భేటీ గురించి విలేకర్లు ప్రస్తావించగా.. ఆయన సీఎం కానప్పుడు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. . పదేపదే వివాదాస్పద వ్యాఖ్యలు, కార్యకలాపాలకు పాల్పడుతున్న మంఝి, పార్టీ పెద్దలు మందలించినా మారలేదని, ఆయనను పదవి నుంచి తప్పించడం అవశ్యంగా మారిందని అన్నారు.
2010 ఎన్నికల్లో ప్రజలు నితీశ్‌కే పట్టం కట్టారని, మంఝి పదవి తాత్కాలికమేనని అన్నారు. ముంఝి ముంచేస్తున్న పార్టీ పడవను నితీశ్ కాపాడతారని పేర్కొన్నారు. నితీశ్‌కు తిరిగి సీఎం పదవి అప్పగించే యత్నానికి శరద్ యాదవ్‌తోపాటు ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ నేతలు లాలూ, ములాయంల మద్దతు ఉందన్నారు. కాగా, త్యాగి యమదూత అని, ఆయనకు పిచ్చిపట్టిందని మంఝి ఆరోపించారు.
నితీశ్ భీష్ముడి వంటి వారని, తను పేద ప్రజల సంక్షేమం గురించి మాట్లాడకుండా నితీశ్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కాగా, మంఝి శనివారం అనూహ్యంగా అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేయొచ్చని జేడీయూ భయపడుతోంది. అందుకే మంఝి ప్రభుత్వం మైనారిటీలో పడిందని, ఆయన చేసే సిఫారసులను పరిగణనలోకి తీసుకోవద్దని కోరుతూ శరద్ యాదవ్ గవర్నర్‌ను ఓ లేఖలో కోరినట్లు సమాచారం. కాగా నితీశ్‌కు సన్నిహితులైన మంత్రులు రాజీవ్‌రంజన్, పీకే సాహీలు ప్రభుత్వ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్నారని, వారిని కేబినెట్ తొలగించాలని మంఝి శుక్రవారం రాత్రి గవర్నర్‌కు సిఫారసు చేశారు.
పార్టీ కార్యాలయం వద్ద ఘర్షణలు
నితీశ్, మంఝి మద్దతుదారులు శుక్రవారం పట్నాలోని జేడీయూ కార్యాలయం వద్ద ఘర్షణలకు దిగారు. దళిత కార్యకర్తలు నితీశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని, నితీశ్ మద్దతుదారులపై దాడి చేశారని పార్టీ వర్గాలు చెప్పాయి. రాష్ట్ర మంత్రులు బ్రిషేన్, నితీశ్ మిశ్రా తదితరులు సీఎం ఇంటికెళ్లి మద్దతు ప్రకటించారు. నితీశ్ నివాసం కూడా జేడీయూ దళిత సంఘం భేటీతో సందడిగా కనిపించింది. ఒత్తిళ్లకు తలొగ్గి సీఎం పదవి నుంచి తప్పుకోవద్దని మంఝికి కేంద్రమంత్రి పాశ్వాన్ సూచించారు.