మన్మోహన్‌కు సమన్లు ఇవ్వండి
సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థకు అమెరికా కోర్టు ఆదేశం
వాషింగ్టన్: భారత ప్రధానమంత్రి మన్మోహన్‌కు జూన్ 18లోగా సమన్లు అందివ్వాలని సిక్కుల మత సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే)ను అమెరికా కోర్టు ఆదేశించింది. జూన్ 18లోగా ఆయనకు సమన్లు అందించనట్లయితే మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపిస్తూ మన్మోహన్‌పై పెట్టిన కేసును కొట్టివేయాల్సి వస్తుందని స్పష్టం చేసింది. మన్మోహన్‌కు సమన్లు అందించినట్టుగా ఆధారాలను జూన్ 18లోగా తమకు సమర్పించాలని అమెరికా జిల్లా జడ్జి జేమ్స్ ఈ బోస్‌బెర్గ్ ఈ నెల 18న ఎస్‌ఎఫ్‌జేకు ఆదేశాలు జారీ చేశారు.
1990ల్లో పంజాబ్‌లో సిక్కులపై దాడులు, హత్యాకాండకు మన్మోహన్ సహకరించారంటూ ఎస్‌ఎఫ్‌జే వాషింగ్టన్ ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో మన్మోహన్ అమెరికా పర్యటన సందర్భంగా వాషింగ్టన్ ఫెడరల్ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ సమన్లను మన్మోహన్‌కు అందివ్వాల్సిందిగా కోర్టు ఆదేశించింది.