
సంకుచితత్వం పనికిరాదు: మన్మోహన్‌సింగ్
భారత్ వంటి ఆధునిక, లౌకిక, ప్రగతిశీల దేశంలో సంకుచిత భావజాలాలకు, విద్వేషపూరిత విధానాలకు తావులేదని ప్రధాని మన్మోహన్‌సింగ్ స్పష్టం చేశారు. అటువంటి ధోరణులు సమాజాన్ని విభజించి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తాయన్నారు.
మోడీపై మన్మోహన్ వాగ్బాణాలు
అది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది
స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో ప్రధాని
తీరు మారాలంటూ పాకిస్థాన్‌కు హెచ్చరికలు
రాజకీయ స్థిరత్వం, ఐకమత్యంతోనే ప్రగతి
తొమ్మిదేళ్ల పాలనలో మేమెంతో సాధించాం
ఏడాదిలో 10 లక్షల మందికి నైపుణ్య శిక్షణ
సింధురక్షక్ ప్రమాదం జాతిని కలచివేసింది
భారత్ వంటి ఆధునిక, లౌకిక, ప్రగతిశీల దేశంలో సంకుచిత భావజాలాలకు, విద్వేషపూరిత విధానాలకు తావులేదు. అటువంటి ధోరణులు సమాజాన్ని విభజించి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తాయి.
న్యూఢిల్లీ: భారత్ వంటి ఆధునిక, లౌకిక, ప్రగతిశీల దేశంలో సంకుచిత భావజాలాలకు, విద్వేషపూరిత విధానాలకు తావులేదని ప్రధాని మన్మోహన్‌సింగ్ స్పష్టం చేశారు. అటువంటి ధోరణులు సమాజాన్ని విభజించి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తాయన్నారు. చారిత్రక ఎర్రకోట నుంచి గురువారం చేసిన 67వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో బీజేపీ ‘ప్రధాని అభ్యర్థి’ నరేంద్ర మోడీపై ఆయన పరోక్షంగా వాగ్బాణాలు సంధించారు. భారత్‌తో స్నేహాన్ని కోరుకుంటే దేశ వ్యతిరేక కార్యకలాపాలను ఇకనైనా కట్టిపెట్టాలంటూ పాకిస్థాన్‌ను హెచ్చరించారు. ఆర్థిక మందగమనం మరెంతో కాలం ఉండబోదంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్ల పాలనలో యూపీఏ సంకీర్ణం సాధించిన విజయాలను అరగంటపాటు హిందీలో చేసిన ప్రసంగంలో ఏకరువు పెట్టారు. 81 కోట్ల మంది పేదలకు లబ్ధి చేకూర్చే ఆహార భద్రత పథకం త్వరలో పార్లమెంటు ఆమోదం పొందుతుందని ధీమా వెలిబుచ్చారు. వాయువేగంతో అభివృద్ధి సాధించనిదే పేదరిక నిర్మూలన, అందరికీ నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు, ఉపాధి వంటి లక్ష్యాలను సాధించలేమన్నారు. ప్రధానిగా వరుసగా పదోసారి చేసిన పంద్రాగస్టు ప్రసంగంలో పలు అంశాలపై మన్మోహన్ వెలువరించిన అభిప్రాయాలు...
సహనమే ఆభరణం: సంకుచిత భావజాలాలు, ఒంటెత్తు పోకడలు పెచ్చరిల్లకుండా తక్షణం అడ్డుకట్ట వేయాల్సిన అవసరముంది. సహనశీలతను, భిన్న ఆలోచనా ధోరణులను గౌరవించడాన్ని మన దేశ సంసృ్కతీ సంప్రదాయాలు మనకు బోధించాయి. వాటిని బలోపేతం చేయాలి. ఈ దిశగా పాటుపడాల్సిందిగా పార్టీలకు, సమాజంలోని అన్ని వర్గాలకు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. దేశం ప్రగతి పథంలో ముందుకు సాగి అజ్ఞానం, పేదరికం వంటి రుగ్మతలను రూపుమాపేందుకు రాజకీయ స్థిరత్వం, సామాజిక ఐకమత్యం తప్పనిసరి.
పాక్! పద్ధతి మార్చుకో...: పొరుగు దేశాలన్నింటితోనూ మేం స్నేహమే కోరుతున్నాం. అయితే పాకిస్థాన్ వైపు నుంచి పెరుగుతున్న భారత వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట పడాల్సిందే. అలాంటి కార్యకలాపాలను పాక్ అరికట్టినప్పుడే ఆ దేశంతో సంబంధాలు మెరుగుపడేందుకు ఆస్కారముంటుంది. నియంత్రణ రేఖ వద్ద ఇటీవల భారత జవాన్లను కాల్చి చంపిన వంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలూ తీసుకుంటాం.
పాలనలో ఎంతో సాధించాం: వచ్చే 12 నెలల్లో 10 లక్షల మంది యువతీయువకులకు నైపుణ్య శిక్షణ ఇచ్చే కొత్త పథకాన్ని త్వరలో ప్రారంభిస్తాం. నూతన నైపుణ్యాలను అలవర్చుకున్న వారికి రూ.10 వేల గ్రాంట్ అందజేస్తాం. త్వరలో మరిన్ని రంగాల్లోకి ఎఫ్‌డీఐలను అనుమతిస్తాం. యూపీఏ పాలనలో దేశం ఎంతో ప్రగతి సాధించింది. వర్తక, వాణిజ్యాలకు అనువైన వాతావరణం కల్పించాం. పారదర్శకతకు పెద్దపీట వేసి, అవినీతిని అరికట్టేందుకు సమాచార హక్కు చట్టం తెచ్చాం.
ప్రగతి దిశగా పరుగులు: ఎనిమిది కొత్త విమానాశ్రయాలు, రెండు కొత్త నౌకాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్లతో సహా పలు మౌలికాభివృద్ధి ప్రాజెక్టులు అతి త్వరలో పట్టాలెక్కనున్నాయి. ఇవి దేశ ప్రగతికి తోడ్పడటమే గాక ఎంతోమందికి ఉపాధి కల్పించగలవు. అయితే దేశ విద్యా వ్యవస్థను సంస్కరించేందుకు మరెంతో చేయాల్సి ఉంది. అలాగే మన బాలలకు పరిశుభ్రమైన పౌష్టికాహారం అంది తీరాలి. మధ్యాహ్న భోజన పథకాన్ని ఈ దిశగా మెరుగుపరచాలి.
జలాంతర్గామి పేలుడు బాధాకరం: ఐఎన్‌ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిని నష్టపోవడం చాలా బాధాకరం. అందులోని 18 మంది వీర జవాన్లు దుర్మరణం పాలై ఉంటారన్న వార్త మనసును కలచివేస్తోంది. ఇటీవలి ఉత్తరాఖండ్ వరద విలయం జాతికి తీరని దుఃఖం మిగిల్చింది.
మందగమనం ఎక్కువ కాలం ఉండదు: దేశ ఆర్థిక రంగంలో నెలకొన్న మందగమనం ఎక్కువ కాలం ఉండదు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. గత తొమ్మిదేళ్లలో మనం సగటున 7.9 శాతం సాధించిన ఆర్థిక వృద్ధిరేటే మన సామర్థ్యం ఏమిటో తెలియజేస్తోంది. 2012-13లో నమోదైన ఈ దశాబ్దిలోకెల్లా కనిష్ట వృద్ధి రేటు 5 శాతాన్ని మెరుగుపరుచుకొని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6 శాతం వృద్ధి రేటు సాధించగలమని ఆశిస్తున్నాం.
ఆహార భద్రతతో 81 కోట్ల మందికి లబ్ధి: ఆహార భద్రత చట్టం కోసం ఇటీవల ఆర్డినెన్స్ జారీ చేశాం. ప్రస్తుతం ఆహార భద్రత బిల్లు పార్లమెంటు ముందు ఉంది. ఈ బిల్లు త్వరలోనే ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నా. ఆహార భద్రత చట్టం వల్ల 75 శాతం గ్రామీణ జనాభా, సుమారు 50 శాతం పట్టణ జనాభాకు లబ్ధి చేకూరుతుంది.
మన్మోహన్ నోట పీవీ
స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో దివంగత ప్రధాని, తెలుగు తేజం పీవీ నరసింహారావును మన్మోహన్ స్మరించుకున్నారు. దేశ ప్రగతిలో నెహ్రూ, ఇందిర, రాజీవ్, పీవీల పాత్ర మరువలేనిదంటూ ఆయన ప్రశంసించారు. ప్రతి దశాబ్దానికి ఒకసారి చొప్పున దేశం భారీ విధాన మార్పులను చవిచూస్తూ వచ్చిందన్నారు. అయితే మాజీ ప్రధానులు లాల్‌బహదూర్ శాస్త్రి, వాజ్‌పేయిలను మన్మోహన్ ప్రస్తావించకపోవడాన్ని బీజేపీ తప్పుబట్టింది. వారి సేవలను ఎలా విస్మరించగలిగారని విపక్ష నేత సుష్మా స్వరాజ్ ట్విట్టర్‌లో ప్రశ్నించారు.
నెహ్రూ, ఇందిర తర్వాత..
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకునిప్రధాని మన్మోహన్‌సింగ్ గురువారం ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన ఈ విధంగా పతాకావిష్కరణ చేయడం వరుసగా పదోసారి. తద్వారా నెహ్రూ, ఇందిరాగాంధీ కుటుంబానికి వెలుపల ఈ ఘనతను సొంతం చేసుకున్న తొలి ప్రధానిగా మన్మోహన్ నిలిచారు. నెహ్రూ, ఇందిరాగాంధీలు ఎర్రకోటపై పదిసార్లకు మించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నెహ్రూ వరుసగా 17 సార్లు పతాకావిష్కరణ చేయగా, ఇందిరకు ఈ గౌరవం 16 సార్లు దక్కింది.