నిజాయితీపరుడే.. కానీ ప్రధానిగా వద్దు!
న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్ సింగ్ దేశ రాజకీయ నేతల్లో అత్యంత నిజాయితీపరుడని, అయితే ఆయనకు శక్తిసామర్థ్యాలు లేవని, పనితీరు పేలవమని ఓ సర్వేలో తేలింది. మరో దఫా ఆయన ప్రధానిగా వద్దని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నట్లు ఇండియా టుడే-‘సీ’ ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ఫలితాల్లో వెల్లడైంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఒకవేళ యూపీఏ తిరిగి అధికారంలోకి వస్తే మన్మోహన్ ప్రధానిగా వద్దేవద్దని అత్యధిక మంది(60 శాతం) చెప్పారు. 30 శాతం మంది మాత్రమే ఆయన తిరిగి ప్రధాని కావాలన్నారు. నిజాయితీని పక్కనపెడితే ప్రధాని అభ్యర్థి విషయంలో మాత్రం గుజరాత్ సీఎం, బీజేపీ ఎన్నికల సారథి నరేంద్ర మోడీ.. మన్మోహన్‌నే కాకుండా మిగతా రాజకీయ నేతలందరినీ మించిపోయారు.
అవినీతి సర్కారుకు నేతృత్వం..
ఈ నెల 2-10 మధ్య జరిగిన ఈ సర్వేలో దేశంలోని 28 రాష్ట్రాల నుంచి 15,815 మంది పాల్గొన్నారు. మన్మోహన్ అత్యంత నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడని 17 శాతం మంది ఒప్పుకున్నారు. ఆయన ప్రజలకు తాను చెప్పాల్సిన విషయాన్ని సరిగ్గా చేరవేయలేరని 21 శాతం, అవినీతి సర్కారుకు నేతృత్వం వహిస్తున్నారని 20 శాతం, అధికారం లేదని 21 శాతం, ఈ లోపాలన్నీ ఉన్నాయని 21 శాతం మంది తేల్చిచెప్పారు. కాగా, నిజాయితీ విషయంలో 16 శాతం మంది మద్దతుతో మోడీ, మన్మోహన్ తర్వాతి స్థానంలో నిలిచారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు నిజాయితీపరులని 9 శాతం, అద్వానీ నిజాయితీపరుడని 6 శాతం మంది చెప్పారు. మన్మోహన్ పనితీరు పేలవంగా ఉందని 45 శాతం మంది అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ పనితీరూ ఇలాగే ఉందని 43 శాతం మంది చెప్పారు.
జనాదరణ తగ్గినా మోడీకే పట్టం..
మోడీ ప్రధాని కావాలని సర్వేలో పాల్గొన్న 45 శాతం మంది చెప్పారు. అయితే ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన ఇండియా టుడే-‘సీ’ ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేతో పోలిస్తే వీరి సంఖ్య తగ్గడం గమనార్హం. ఆ సర్వేలో మోడీ ప్రధాని కావాలని 57 శాతం మంది చెప్పారు. తాజా సర్వేలో మోడీకి జనాదరణ తగ్గినా బీజేపీవైపు మొగ్గుచూపినవారి శాతం మాత్రం పెరిగింది. గత సర్వేలో ఆ పార్టీ సుస్థిర ప్రభ్వుత్వం అందిస్తుందని 24 శాతం మంది చెప్పగా తాజా సర్వేలో అది 33 శాతానికి పెరిగింది. రాహుల్ ప్రధాని కావాలని 32 శాతం మంది కోరుకున్నారు. గత సర్వేలో వీరి సంఖ్య 41 శాతం. బీజేపీ నుంచి ప్రధాని పదవికి మోడీనే పోటీ పడాలని తాజా సర్వేలో 51 శాతం మంది, అద్వానీ పోటీ పడాలని 18 శాతం మంది కోరుకున్నారు. కాంగ్రెస్‌లో ప్రధాని పదవికి రాహులే తగినవాడని 44 శాతం మంది, మన్మోహన్ మళ్లీ ఆ పదవి చేపట్టాలని 15 శాతం మంది చెప్పారు. మోడీ సుపరిపాలన అందిస్తున్నారని 25 శాతం, అభివృద్ధి సాధిస్తున్నారని 25 శాతం మంది చెప్పారు. గుజరాత్ అల్లర్లకు ఆయన క్షమాపణ చెప్పాలని 51 శాతం, వద్దని 38 శాతం మంది అన్నారు.