సాక్షి, న్యూఢిల్లీ: పదహారవ లోక్‌సభ కు ఢిల్లీ నుంచి ఎన్నికైన ఎంపీలు ప్రమాణస్వీకారం రోజున లోక్‌సభలో తమ వైవిధ్యాన్ని చాటుకున్నారు. ఏడుగురిలో నలుగురు ఎంపీలు - చాందినీచౌక్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న కేంద్ర ఆరోగ్యమంత్రి డాక్టర్ హర్షవర్ధన్, న్యూఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తోన్న మీనాక్షీ లేఖి, ఈస్ట్ ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తోన్న మహేష్ గిరీ, పశ్చిమఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తోన్న ప్రవేశ్ సాహిబ్ సింగ్ వర్మ సంస్కృతంలో ప్రమాణస్వీకారం చేశారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తోన్న భోజ్‌పురి నటుడు, గాయకుడు మనోజ్ తివారీ ఆకుపచ్చ ధోవతి, లేత నీలం రంగు కుర్తా , నల్లటి జాకెట్ ధరించి ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. ఆయన ప్రమాణస్వీకార పత్రం చూడకుండానే ప్రమాణం చేయడం తోటి ఎంపీల నుంచి ప్రశంసలు అందుకుంది. వారు హర్షధ్వానాలతో ఆయనను అభినందించారు. మనోజ్ తివారీ హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఏడుగురు బీజేపీ నేతలు తొలిసారి ఎంపీలే కావడం విశేషం. విక్టోరియా జూబ్లీ సీనియర్ సెకండరీ స్కూలు విద్యార్థిగా హర్షవర్ధన్ సంస్కృతం చదివారని అంటున్నారు. హర్షవర్ధన్‌తో పాటు మరో ఇద్దరు కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, ఉమాభారతీ, లోక్‌సభ స్పీకర్ అభ్యర్థి సుమిత్రా మహాజన్ కూడా సంస్కృతంలో ప్రమాణస్వీకారం చేశారు.
ఢిల్లీ ఎంపీలు సంస్కృతంలో ప్రమాణం
Published Fri, Jun 6 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 AM
Advertisement
Advertisement