
పర్ణశాల: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. కూంబింగ్ ముగించుకొని తిరిగి వస్తున్న డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డ్స్ బలగాలను లక్ష్యంగా చేసుకుని భారీ ఇంప్రూవైజ్‌డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్(ఐఈడీ)ని పేల్చారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, నలుగురు డీఆర్‌జీ జవానులు తీవ్రంగా గాయపడ్డారు.
జిల్లాలోని పూలబ్‌గరీ పోలీస్ స్టేషన్ పరిధిలో రెడ్డపరా అడవుల్లో డీఆర్‌జీ బలగాలు కూం బింగ్ నిర్వహించి శనివారం పోలీస్ స్టేషన్‌కు తిరిగి వస్తుండగా స్టేషన్‌కు సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలోని కేరళ గ్రామ శివారులో మావోయిస్టులు భారీ ఐఈడీని పేల్చారు. ఈ పేలుడు ధాటికి డీఆర్‌జీ జవానులు జ్ఞానేంద్ర‡ ప్రతాజీ, మడివి కమల్, పూల్‌చంద్ బాగలే, వీరేంద్ర నాగ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని సుక్మా ఆస్పత్రికి తరలించగా, జ్ఞానేంద్ర ప్రతాజీ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి
మరో ఘటనలో కబీర్ధా జిల్లాలో దందాబారా అడవిలో శనివారం భద్రతా దళాలకు, మావో యిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందింది. అనంతరం ఘటనా స్థలంలో ఆయుధాలు, నిత్యావస వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ లాల్ యాత్రం సింగ్ తెలిపారు.