మారుతి సుజుకి కార్ల ధరలు పెరిగాయ్!
న్యూ ఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా(ఎమ్ఎస్ఐ) గురువారం కార్ల ధరలను స్వల్పంగా పెంచింది. 2016-17 కేంద్ర బడ్జెట్లో కొత్తగా ప్రవేశపెట్టిన మౌళిక సదుపాయాల సెస్ కారణంగా కార్ల ధరలు పెంచుతున్నట్లు ఎమ్ఎస్ఐ ఓ ప్రకటనలో తెలిపింది. పెరిగిన కార్ల ధరలు వివిధ మోడళ్లను అనుసరించి ధరలు రూ. 1,441 నుంచి గరిష్టంగా 34,494 రూపాయల వరకు పెరిగాయని మారుతి సుజుకి వెల్లడించింది. సియజ్ ఎస్హెచ్వీఎస్, ఎర్టిగా ఎస్హెచ్వీఎస్ మోడళ్లు మౌళిక సదుపాయాల సెస్ పరిధిలోకి రానందున వాటి ధరల్లో ఎలాంటి పెరుగుదల లేదని సంస్థ వెల్లడించింది.
పొడవు నాలుగు మీటర్లకు మించనటువంటి, ఇంజిన్ సామర్థ్యం 1500 సీసీ కంటే తక్కువగా ఉన్నటువంటి డీజిల్ కార్లపై 2.5 శాతం సెస్ విధించిన కేంద్రం.. ఎక్కువ ఇంజన్ సామర్ధ్యం గల కార్లపై 4 శాతం సెస్ విధించింది. దీంతో ఇప్పటికే టాటా మోటార్స్ వాహనాల ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఇక హుందాయ్ మోటార్ ఇండియా, హోండా కార్స్ ఇండియా సంస్థలూ ఇదే దారిలో ధరలు పెంచనున్నట్లు ప్రకటించాయి.