జైపూర్: రాజస్థాన్‌ను భారీ ఇసుక తుఫాన్ ముంచెత్తుతోంది. రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం ఇసుక తుఫాన్ విరుచుకుపడింది. బికనీర్ జిల్లాలో ఇసుక తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. బీకనీర్ జిల్లా ఖజువాలా ప్రాంతంలో భారీ ఇసుకు తుఫాన్ చెలరేగుతుండటంతో అక్కడ పరిస్థితి భీతావహంగా ఉంది. ప్రకృతి బీభత్సంగా ఉండటం.. ఆకాశం అంత ఎత్తు నుంచి ఇసుక విరుచుకుపడుతుండటంతో స్థానికులు బెంబేలెత్తుతున్నారు. ఇసుక తుఫాన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు భయపెట్టేలా ఉన్నాయి.
ఇటీవల రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని అల్వార్, భరత్ పూర్ ప్రాంతాల్లో పెనువేగంతో వీచిన గాలులు, ఇసుక తుఫాన్.. పెనువిధ్వంసం మిగిల్చింది. యూపీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. మళ్లీ ఇసుక తుఫాన్ ముంచెత్తుతుండటంతో రాజస్థాన్‌లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.
ఉత్తరాది రాష్ట్రాలకు హెచ్చరిక
13 ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. పిడుగులు పడే అవకాశముందని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. రాజస్థాన్, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో పిడుగులు పడే అవకాశముందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment