'మోదీజీ.. మౌనం వీడి బదులివ్వండి'
న్యూఢిల్లీ: దళితులపై దేశ వ్యాప్తంగా దాడులు జరుగుతున్నా ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రశ్నించారు. ఆయన వెంటనే ఈ అంశంపై నోరు విప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై దాడులు పెరగుతున్నాయని, వీటిపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
గుజరాత్ లోని వూనాలో దళిత యువకులపై దాడులను ఆమె ప్రస్తావిస్తూ 'గోవుల సంరక్షణ పేరుతో దళిత యువకులను చిత్ర హింసలు పెడుతున్నారు' అని ఆమె అన్నారు. మహారాష్ట్రలో బైక్ పై వెళుతున్న ఇద్దరు దళిత యువకులను తమ వెహికల్ ను ఓవర్ టేక్ చేశారని దారుణంగా ఆపేసి కొట్టారని, బైక్ పై అంబేద్కర్ బొమ్మను చూశాక మరింతగా కొట్టారని గుర్తు చేశారు. ఇక ఉత్తరప్రదేశ్ లో దళితుల పరిస్థితి మరింత భయానకంగా మారిందని అన్నారు. ప్రధాని మోదీ కచ్చితంగా గుజరాత్ సంఘటనల విషయంలో ఏదో ఒక ప్రకటన చేయాల్సిందేనని, ఆయన మౌనం వీడాల్సిందేనని డిమాండ్ చేశారు.