
సాక్షి,ముంబై : ప్రముఖ బ్యాంకర్, ఆప్ నేత మీరా సన్యాల్ (57) కన్నుమూశారు. గతకొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. మీరా సన్యాల్ అకాల మృతిపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సంతాపం వ్యక్తం చేశారు. ఇంకా మనీష్ సిసోడియా తదితర పార్టీనేతలతో పాటు, మాజీ ఆప్ నేత, న్యాయవాది ప్రశాంత్ భూషణ్, ఇంకా పలువురు ప్రముఖులు మీరా మరణంపై విచారం వ్యక్తం చేశారు.
కాగా దేశంలో రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్‌లాండ్‌కు సీఎండీగా మీరా పనిచేశారు. దాదాపు 30 సంవత్సరాల బ్యాంకునకు సేవలందించిన అనంతరం ప్రత్యామ్నాయ రాజకీయాలవైపు ఆమె ఆసక్తి చూపారు. ఈ నేపథ్యంలో సన్యాల్ పదవికి రాజీనామా చేసి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. పార్టీ తరపున 2014 లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. అంతకుముందు 2009లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అప్లి ముంబై అనే సంస్థతో సామాజిక కార్యకర్తగా పేరొందిన మీరా.. దేశంలోని అమూల‍్యమైన సహజ సంపదను కేవలం వందలకోట్లకు కట్టబెడుతూ, వందల కోట్ల విలువైన ప్రాజెక్టులకోసం వేలకోట్ల రూపాయలకు కాంట్రాక్టర్లకు ముట్టచెబుతున్నారనీ, బ్యాంకింగ్ వ్యవస్థ స్కాంల మయంగా మారి పోయిందని ఆమె ఆందోళన వ్యక్తం చేసేవారు. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు ఒక పెద్ద స్కాం అని విమర్శించేవారు. ఈ నేపథ్యంలోనే పెద్ద నోట్ల రద్దుపై ‘‘ది బిగ్ రివర్స్: హౌ డిమానిటైజేషన్ నాక్డ్ ఇండియా ఔట్’’ అనే పుస్తకాన్ని కూడా రాశారు.
ప్రముఖ మాజీ నావీ అధికారి వైస్ అడ్మిరల్ గులాబ్ మోహన్‌లాల్ హీరా నందాని కుమార్తె మీరాకు భర్త ఆశిష్ సన్యాల్, ఇద్దరు సంతానం(ప్రియదర్శిని సన్యాల్, జై సన్యాల్) ఉన్నారు.
గత ఏడాది పీఎన్‌బీ స్కాంపై మీరా సన్యాల్ ఫేస్‌బుక్ లైవ్‌ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించారు.
Extremely sad to hear this. No words to express... https://t.co/YslA8TddvU
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 11, 2019