శబరిమల ఆలయాన్ని దర్శించుకున్న బిందు, కనకదుర్గ
సాక్షి, న్యూఢిల్లీ : బిందు అమ్మినికి 42 ఏళ్లు. కనకదుర్గకు 41 ఏళ్లు. వీరిరువురు బుధవారం తెల్లవారు జామున శబరిమలలోని అయ్యప్ప ఆలయం గర్భగుడిలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించిన విషయం తెల్సిందే. ఇంతకు వీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? వీరి జీవిత నేపథ్యం ఏమిటీ? పదేళ్లకుపైగా యాభై ఏళ్లకు లోపు వయస్సున్న మహిళలు ఆలయంలోకి ప్రవేశించరాదంటూ ఆరెస్సెస్, హిందూత్వ సంఘాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వీరెందుకు ఈ సాహసానికి ఒడిగట్టారు?
బిందు, కనకదుర్గ డిసెంబర్ 24వ తేదీనే అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఆరెస్సెస్ కార్యకర్తల ఆందోళన వల్ల అది వారికి సాధ్యం కాలేదు. దాంతో వారు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ వారం రోజులు వారు కనీసం తమ కుటుంబ సభ్యులతో కూడా ఎలాంటి కాంటాక్టు పెట్టుకోలేదు. వారిలో కనకదుర్గ కుటుంబమైతే ఆమె తప్పిపోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయ్యప్ప ఆలయ సందర్శనానికని వెళ్లి అదృశ్యమైందని విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ చెప్పారు. వారు ఈ వారం రోజులపాటు పోలీసుల రక్షణలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
లింగ వివక్షను రూపుమాపాలంటూ కేరళలో 620 కిలోమీటర్ల పొడవున మహిళల మానవహారం ప్రదర్శన జరిపిన మరునాడే, అంటే మంగళవారం ఎర్నాకులం నుంచి బయల్దేరి అయ్యప్ప ప్రవేశ ద్వారమైన పంపాకు చేరుకున్నారు. వారు అక్కడి నుంచి పోలీసు ఎస్కార్ట్ సహాయంతో రాత్రి 2.30 గంటలకు కొండలపైకి బయల్దేరి వెళ్లారు. బుధవారం తెల్లవారు జామున 3.30 గంటలకు ఆలయంలోకి ప్రవేశించారు. 3.45 గంటలకు గర్భగుడిలోకి ప్రవేశించి ప్రార్థనలు జరిపారు.
తాము ఆలయంలోకి ప్రవేశించినప్పటి నుంచి చాలామంది భక్తులు తమను చూశారని, అయితే ఎవరు కూడా తమను అడ్డుకునేందుకు ప్రయత్నించలేదని బిందు అమ్మిని, కనకదుర్గలు వివరించారు. అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలంటూ సెప్టెంబర్ 28వ తేదీన సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కనీసం 17 మంది మహిళలు ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు.
బిందు అమ్మిని
కేరళ యూనివర్శిటీ నుంచి మాస్టర్ లా పట్టాను సాధించిన బిందు అమ్మిని ప్రస్తుతం కన్నూరు యూనివర్శిటీలో న్యాయశాస్త్ర అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. ఆమె విద్యార్థి రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు. వామపక్ష పార్టీకి అనుబంధంగా ఉన్న కేరళ విద్యార్థి సంఘటనలో పనిచేశారు. బిందు దళిత కార్యకర్త కూడా. ఆమె సామాజిక న్యాయం కోసం, లింగ వివక్షతపై పోరాడే కార్యకర్తగా ఆమె తన మిత్రులకు, విద్యార్థినీ విద్యార్థులకు సుపరిచితం. బిందు రాజకీయ కార్యకర్త హరిహరన్ పెళ్లి చేసుకున్నారు. పూక్కడ్‌లో నివసిస్తున్న వారికి 11 ఏళ్ల ఓల్గా అనే కూతురు కూడా ఉంది.
కనకదుర్గ
నాయర్ అనే అగ్రకులానికి చెందిన కనకదుర్గ ‘నవోతన కేరళం శబరిమలాయిలెక్కు’ అనే ఫేస్‌బుక్ పేజీ ద్వారా బిందుకు పరిచయం అయ్యారు. అయ్యప్ప ఆలయాన్ని ఎలాగైన సందర్శించాలన్న తాపత్రయంతోనే ఈ పేజీని ఏర్పాటు చేశారు. కేరళ పౌర సరఫరాల కార్పొరేషన్‌లో కనకదుర్గ మేనేజర్‌గా పని చేస్తున్నారు. కృష్ణనున్ని అనే ఇంజనీర్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. మలప్పురంలో నివసిస్తున్న ఆ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. కనకదుర్గ ఆద్యాత్మిక చింతన కలిగిన హిందువని, ఆమె అయ్యప్ప ఆలయం ఎందుకు వెళ్లాలనుకుందో తనకు అర్థం కావడం లేదని ఆమె అన్న భరత్ భూషణ్ మీడియాతో వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment