
శ్రీనగర్ : రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఓమర్ అబ్దుల్లా మధ్య ట్విటర్‌లో విమర్శల యుద్ధం కొనసాగుతోంది. కేంద్రం వైఖరిని ముఫ్తీ తప్పుబట్టారు. ఆగమేఘాల మీద ట్రిపుల్ తలాక్ బిల్లును తేవాల్సిన అవసరం ఏమొచ్చిందని అన్నారు. సుప్రీం కోర్టు సైతం ఈ బిల్లును చట్ట విరుద్దమైనదిగా ప్రకటించిందని గుర్తు చేశారు. కేవలం ముస్లింలపై కక్ష సాధించడానికే ట్రిపుల్ తలాక్ తీసుకువచ్చారని మండిపడ్డారు. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ బిల్లుకు ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం ఏముందని ట్విటర్‌లో పేర్కొన్నారు.
కాగా, ముఫ్తీ వ్యాఖ్యలపై ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మెహబూబా ముఫ్తీ జీ.. రాజ్యసభలో బిల్లుపై ఓటింగ్ జరుగుతున్నప్పుడు మీ ఎంపీలు ఎక్కడున్నారు. ఉద్దేశపూర్వకంగానే సభ నుంచి మీ పార్టీ ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ తగ్గిపోవడానికి, బిల్లు గట్టెక్కడానికి ప్రభుత్వానికి పరోక్షంగా సహకరించారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. మీ ఆంతర్యం ఏమిటీ అని’ ప్రశ్నించారు.
ముఫ్తీ స్పందిస్తూ.. ‘ఓటింగ్ సమయంలో ప్రభుత్వ తీసుకొచ్చే బిల్లులకు నిరసనగా సంయమనం పాటించడం కూడా వ్యతిరేకించినట్టే. ఈ విషయం మీరు తెలుసుకుంటే మంచింది. 1999లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసిన మీ పార్టీ సభ్యుడు సోజ్ సాహెబ్‌ను బహిష్కరించారు. అక్కడే మీ నైతికత ఏంటో తెలిసిపోతోంది’ అన్నారు. దీనిపై ‘మీ పార్టీ వంచనను కప్పిపచ్చుకోడానికి ఇరవై ఏళ్ల సంఘటనను గుర్తుచేశారు. మీ ఎంపీలను రాజ్య సభకు గైర్హాజరు కావాలని ఆదేశించినట్టు అంగీకరిస్తున్నారు. సంయమనం పాటించటం ఓటు కాదు. బీజేపీకి సాయం చేసినట్టు అవుతుంది’ అని ఒమర్ విమర్శించారు. కాగా, ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలో మంగళవారం ఆమోదం పొందిన విషయం తెలిసిందే. అనుకూలంగా 99, వ్యతిరేకంగా 84 ఓట్లు రావడంతో ఎట్టకేలకు మూడో ప్రయత్నంలో ట్రిపుల్ తలాక్ రాజ్యసభలో గట్టెక్కింది.
Comments
Please login to add a commentAdd a comment