
దూసుకుపోతున్న ముఖ్యమంత్రి
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అనంతనాగ్ ఉప ఎన్నికలలో దూసుకుపోతున్నారు. దివంగత ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక్కడ పీడీపీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం ప్రారంభమైంది. ముందునుంచి ఆధిక్యంలోనే కొనసాగుతున్న ముఖ్యమంత్రి.. ఐదోరౌండు ముగిసేసరికి 6వేల ఓట్ల ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. ఇంతకుముందు ఇక్కడ పోటీ చేసిన దివంగత సీఎం ముఫ్తీమహ్మద్ సయీద్కు 6వేల ఓట్ల మెజారిటీ వచ్చింది.
అయితే, ఈసారి వేర్పాటువాదులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడం, ఇటీవలి కాలంలో పదే పదే పాకిస్థాన్, ఐఎస్ఐఎస్ జెండాలు ఎగరడం లాంటి ఘటనలతో ఒకింత ఆందోళన నెలకొంది. అలాగే ఓట్ల లెక్కింపు సమయంలో కూడా కొంతమేర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కొన్ని ఈవీఎంలకు సీల్ లేదని కాంగ్రెస్ అభ్యర్థి ఆందోళన చేయడం, లోయలోని కొన్ని ప్రాంతాల్లో వేర్పాటువాదులు ఐఎస్ఐఎస్ జెండాలు ఎగరేయడం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.