మైన్స్ బిల్లుపై లోక్‌సభలో చర్చలో మేకపాటి
సాక్షి, న్యూఢిల్లీ: మైనింగ్ లీజు హోల్డర్లు తమ లీజును బదిలీ చేసేందుకు నోటీసులు ఇచ్చిన 90 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకుంటే.. అనుమతి ఇచ్చినట్టే భావించేలా బిల్లులో నిబంధనలు చేర్చాలని వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. మంగళవారం మైన్స్ అండ్ మినరల్స్ అమెండ్‌మెంట్ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘ప్రపంచవ్యాప్తంగా గిరిజన ప్రజలు వారి ప్రాంతాల్లో ఉండే ఖనిజ సంపదపై హక్కులు ఇవ్వాలని అడుగుతున్నారు. అయితే మైనింగ్ క్షేత్రాలను ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతున్నాం. అందువల్ల గిరిజనులకు లాభాల్లో తగిన వాటా, నష్టపరిహారం, ఉద్యోగాలు ఇస్తే వారి అభివృద్ధి కార్యక్రమాలకు విఘాతం కలగదు. మైనింగ్ లెసైన్స్‌దారు తన లీజును బదిలీ చేసుకునేందుకు ఈ బిల్లు అనుమతి ఇస్తోంది. అయితే సంబంధిత రాష్ట్రాలు దీనికి అనుమతి ఇవ్వాలి. రాష్ట్రాలు 90 రోజుల్లో అనుమతి ఇవ్వనిపక్షంలో అనుమతి ఇచ్చినట్టుగా భావించాలనే నిబంధనను కూడా ఈ బిల్లులో చేర్చాలి. లీజులు ఇచ్చే సందర్భంలో పూర్తి పారదర్శకతతో వ్యవహరించి జాతీయ ప్రయోజనాలను కాపాడాలి’ అని పేర్కొన్నారు.
మైనింగ్ కార్మికుల రక్షణకు చర్యలు తీసుకోండి: బుట్టా రేణుక
మైనింగ్ కార్మికుల రక్షణ, సామాజిక భద్రతకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని, ఆ మేరకు మైన్స్ బిల్లులో నిబంధనలు పొందుపరచాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ బుట్టా రేణుక కేంద్రాన్ని కోరారు. ఈ బిల్లుపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు.