రోల్ మోడల్ గా 'ట్వంటీ 20'..! | Members of garment firm's enter politics, raise hopes of change | Sakshi
Sakshi News home page

రోల్ మోడల్ గా 'ట్వంటీ 20'..!

Published Tue, Dec 22 2015 6:44 PM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

రోల్ మోడల్ గా 'ట్వంటీ 20'..! - Sakshi

రోల్ మోడల్ గా 'ట్వంటీ 20'..!

క్రికెట్ లో ఎంతో గుర్తింపు పొందిన ట్వంటీ 20 పేరు... ఇప్పుడు కేరళ పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రత్యేక స్థానం సంపాదించింది. గ్రామంలో సమూల మార్పుల కోసం కృషి చేసేందుకు స్థానిక వస్త్ర పరిశ్రమ సభ్యులు.. ట్వంటీ20 పేరున ఎన్నికల్లో నిలిచి.. అత్యధిక మెజార్జీతో గెలిచి.. నూతన అంకానికి తెరతీశారు. ఉత్పాదక రంగంనుంచీ రాజకీయ రంగంలో ప్రవేశించారు. గతంలోని సాంప్రదాయ వస్త్రధారణను సైతం తోసిరాజని హైటెక్ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. స్థానిక రాజకీయాలు తమ సంస్థ అభివృద్ధికి అడ్డుపడుతుండటంతో.. రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని ఉద్యోగులే సంచలన నిర్ణయం తీసుకొని ఏళ్ళ చరిత్రను తిరగరాశారు.  

కేరళ ఎర్నాకుళం జిల్లాలోని కిజక్కంబాలమ్ పంచాయితీ ఎన్నికల్లో కోచీ ఆధారిత వస్త్ర తయారీదారీ సంస్థ కైటెక్స్ గ్రూప్ విజయపతాకం ఎగురవేసింది. గ్రామాభివృద్ధే ధ్యేయంగా  శాశ్వత ఉద్యోగులు రాజకీయాల్లో అడుగుపెట్టారు. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలో ఉన్నపుడు... పంచాయితీ అభివృద్ధికోసం కైటెక్స్ చేపట్టిన ప్రతి ప్రాజెక్ట్ ను అడ్డుకుంది. సెక్షన్ 144 కింద నేషేధాజ్ఞలు విధించి ట్రేడ్ ఫెయిర్ ను బలవంతంగా మూసివేయించింది. ఇటువంటి అనేక కారణాలతోనే ఎన్నికల్లో పోటీకి సిద్ధపడాల్సి వచ్చిందని మాజీ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, కైటెక్స్ మేనేజింగ్ డైరెక్టర్ జాకబ్ చెప్తున్నారు. లేదంటే తమకు రాజకీయాల్లో ప్రవేశించే ఉద్దేశ్యమే లేదని, సామాజిక బాధ్యతగానే గ్రామాభివృద్ధిని కాంక్షిస్తున్నామని సాబు జాకబ్ అంటున్నారు. ట్వంటీ20 అభివృద్ధి మంత్రం ఓటర్లపై భారీ ప్రభావం చూపడంతో  మొత్తం పంచాయితీలోని 19  వార్డుల్లో 17 వార్డుల్లో విజయ పథంలో దూసుకుపోయారు.  ఈసారి ఓనమ్ పండుగకు ప్రత్యేక ట్రేడ్ ఫెయిర్ నిర్వహిస్తామని, ప్రజలకు వస్తువులను సగం ధరకే అందిస్తామని చెప్తున్నారు. 1968 నుంచి కైటెక్స్ పరిశ్రమ ఎటువంటి ఫిర్యాదులు లేకుండా పనిచేస్తుండగా... ఎల్డీఎఫ్ అధికారంలోని చేదు అనుభవాలే తమను పోటీకి నిలబడేలా చేశాయని జాకబ్ చెప్తున్నారు.

యూడీఎఫ్, ఎల్డీఎఫ్ ఆధ్వర్యంలో స్థానికంగా ఎటువంటి అభివృద్ధీ జరగకపోవడంతోనే  స్థానికులు తమను గెలిపించారని, ట్వంటీ20 సభ్యుడు, కంపెనీ చిత్రకారుడు శిబు కుమరన్ చెప్తున్నారు. ట్వంటీ20 అధికారంలోకి రాకముందే.. సామాజిక సేవలో భాగంగా సగం ధరకు నిత్యావసర వస్తువులు అదించిందని, నాలుగు వందల ఇళ్ళు, ఐదు వందల టాయిలెట్లు కూడ నిర్మించి ఇచ్చిందని చెప్తున్నారు. దీనికి తోడు రోడ్లు రిపేర్లు చేయించడం, పేదలకు వైద్యం అందించడం వంటి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడంతోనే తమకు స్థానికులు పట్టం కట్టారని చెప్తున్నారు. ముఖ్యంగా గ్రామాన్ని వ్యవసాయంతోపాటు అన్నిరంగాల్లో అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తామని, ఇప్పటికే ట్వంటీ20 అభివృద్ధి పనులకోసం 36 కోట్ల రూపాయలను వెచ్చించడంతోపాటు... వచ్చే ఐదేళ్ళలో మొత్తం 350 కోట్ల రూపాయలను వెచ్చించేందుకు ప్లాన్ చేస్తోందన్నారు. కైటెక్స్ గ్రూప్, ఇతర కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతగా నిధులు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నాయని, అలాగే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే నిధులను వినియోగిస్తామని జాకబ్ చెప్తున్నారు. నిధులను సక్రమంగా వినియోగించడానికి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్నవారిని ప్రత్యేకంగా టీమ్ లో ఉంచామని చెప్తున్నారు. ఎన్నికైన పంచాయితీ అధికారులకు నెలసరి వేతనం 3,500 రూపాయలు మాత్రమే ఉందని, గ్రామీణ ఉపాధిహామీ పథకంలో కార్మికులకు చెల్లించే వేతనాల కంటే అధికారులకు అన్యాయంగా ఉండటంతో వారి వేతనం 15 వేలకు పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు.  ఇది అధికారులు అవినీతికి పాల్పడకుండా ఉండేందుకు తోడ్పడుతుందని ఆశిస్తున్నారు.

పంచాయితీ అధికారులు ఫంక్షన్లకు, ప్రారంభోత్సవాలకు అనవసరంగా సమయం వృధా చేయకుండా..పంచాయితీ కార్యాలయంలో కొంత సమయాన్ని కేటాయించి... అభివృద్ధికోసం పాటుపడాలని ట్వంటీ20 సభ్యులకు నిబంధనలను విధించారు.  వారికి సహకరించేందుకు సామాజిక కార్యకర్తలను కూడ ఏర్పాటు చేశారు. కిజక్కంబాలమ్ పంచాయితీ చేపట్టిన ప్రత్యేకాభివృద్ధి పై రాష్ట్రంలోని పంచాయితీలన్నీ దృష్టి సారిస్తున్నాయి. ఈ గ్రామాన్ని రోల్ మోడల్ గా తీసుకొనేందుకు ఆసక్తి చూపుతున్నాయి. అంతేకాక యూఎస్ ఆధారిత వ్యాపార సంస్థలు సైతం... కేరళలోని పది పంచాయితీలను దత్తత తీసుకొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. అయితే డబ్బు, ప్రతిభ ఉన్నంత మాత్రాన అభివృద్ధి సాధ్యం కాదని, ప్రజల అంకిత భావంకూడ ఎంతో అవసరమని జాకబ్ చెప్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement