garment
-
గార్మెంట్స్ ఎగుమతులు జూమ్
ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ 2024–25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–నవంబర్ కాలంలో భారత్ నుంచి రెడీమేడ్ గార్మెంట్స్ ఎగుమతులు 11.4 శాతం పెరిగి 9.85 బిలియన్ డాలర్లకు(రూ.81,516 కోట్లు) చేరుకున్నాయి. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు ప్రపంచ డిమాండ్‌ను ఈ వృద్ధి తెలియజేస్తోందని అపారెల్ ఎక్స్‌పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ (ఏఈపీసీ) తెలిపింది. మారుతున్న భౌగోళిక రాజకీయ సమీకరణలతో సమీప భవిష్యత్తులో అధిక వ్యాపార అవకాశాలున్న భారత్ వైపునకు మళ్లనున్నాయని కౌన్సిల్ వివరించింది.దేశ స్వాభావిక బలాలు, కేంద్ర, రాష్ట్రాల పటిష్ట సహాయక విధానాలతో ప్రయోజనాలను పొందేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఏఈపీసీ ఛైర్మన్ సుదీర్ సెఖ్రి అన్నారు. ఎండ్–టు–ఎండ్ వాల్యూ చైన్ సామర్థ్యం, బలమైన ముడిసరుకు, స్థిర, బాధ్యతాయుత వ్యాపార పద్ధతులపై దృష్టి సారించే కర్మాగారాలతో భారత్ రాబోయే కాలంలో గణనీయ వృద్ధిని సాధిస్తుందని అన్నారు.ఇదీ చదవండి: స్వయంకృషితో ఎదిగిన తెలుగు వ్యాపారవేత్తలునమ్మకం పెరుగుతోంది..మేడ్–ఇన్–ఇండియా ఉత్పత్తులపై గ్లోబల్ బ్రాండ్లకు పెరుగుతున్న నమ్మకాన్ని కూడా ఈ వృద్ధి ప్రతిబింబిస్తోందని సుదీర్ తెలిపారు. ప్రత్యేకించి పండుగ సీజన్లో డిమాండ్ దూసుకెళ్లడం ఇందుకు ఉదాహరణ అని వివరించారు. అంతర్జాతీయ కొనుగోలుదారులు భారత్ టెక్స్ ఎక్స్పో–2025లో పాల్గొనాల్సిందిగా చైర్మన్ విజ్ఞప్తి చేశారు. భారత మొత్తం వస్త్ర వ్యవస్థను ఒకే గొడుకు కింద చూపే పెద్ద వేదిక అని వ్యాఖ్యానించారు. ‘భారత్ టెక్స్ రోడ్‌షో సందర్భంగా వివిధ దేశాలకు వెళ్లాం. అంతర్జాతీయ కొనుగోలుదారులు, రిటైల్ చైన్ల నుంచి అద్భుత ప్రతిస్పందనలను అందుకున్నాం. భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ప్రోత్సహిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ ప్లాట్‌ఫామ్ గొప్ప సహకారాన్ని, సోర్సింగ్ నెట్‌వర్క్‌లను విస్తరిస్తుందని భావిస్తున్నాం’ అని వివరించారు. -
ఫొటోషూట్ లేకుండానే మోడల్స్ చిత్రాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దుస్తుల దుకాణానికి వెళ్లినప్పుడు ప్రత్యక్షంగా పరిశీలించి, ఒకసారి వేసుకుని మరీ చూస్తాం. నచ్చితేనే కొంటాం. ఆన్లైన్లో అయితే కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈకామర్స్ సంస్థల ద్వారా విక్రయించే కంపెనీలు, పెద్ద బ్రాండ్లు మోడల్స్‌తో ఫొటోషూట్ చేసి మరీ దుస్తులను ప్రదర్శిస్తాయి. ఇంత వరకు బాగానే ఉంది. మరి చిన్న చిన్న విక్రేతలు ఆన్లైన్లో ఎలా పోటీపడాలి? ఖరీదైన ఫొటోషూట్స్‌తో పనిలేకుండా ఫోన్లో తీసిన సాధారణ చిత్రాలు 3డీ రూపంలో మారితే? అలాంటి సాఫ్ట్‌వేర్‌ను ఐఐటీ విద్యార్థులైన తెలుగు కుర్రాళ్లు నితీశ్ రెడ్డి పర్వతం, కృష్ణ సుమంత్ అల్వాల అభివృద్ధి చేశారు. నాస్కాం, ఐఐటీ మద్రాస్ ప్రోత్సాహంతో ఏర్పాటైన ఈ కంపెనీ పేరు ట్రై3డీ. ఎలా పనిచేస్తుందంటే.. విక్రేతలు ట్రై3డీ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసి తమ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎంపిక చేసిన దుస్తులను రెండు మూడు ఫొటోలు తీసి సాఫ్ట్‌వేర్‌లో ఉన్న టెంప్లేట్‌కు జత చేయాలి. వెంటనే 3డీ రూపంలో ఫొటో రెడీ అవుతుంది. రెండు మూడు నిముషాల్లో ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. ఫొటోషూట్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాలు సహజంగా కనిపిస్తాయి. ఈ 3డీ చిత్రాలను ఈ-కామర్స్ పోర్టల్స్‌లో, సొంత వెబ్‌సైట్స్‌లో ప్రదర్శించవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఈ ఫోటోలను పోస్ట్ చేసి వ్యాపారం చేస్తున్నవారు ఎందరో ఉన్నారు. మోడల్స్‌తో ఫొటోషూట్ చేసి ఈ టెంప్లేట్స్‌ను కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ఇలా ఇప్పటి వరకు పలువురు మోడళ్లతో వివిధ భంగిమల్లో 250 రకాల టెంప్లేట్స్‌ను సిద్ధం చేశారు. సులభంగా ఆన్లైన్లో.. ఆఫ్‌లైన్‌కు పరిమితమైన విక్రేతలు ఈ సాఫ్ట్‌వేర్‌తో ఆన్లైన్కూ విస్తరించేందుకు మార్గం సుగమం అయిందని ట్రై3డీ కో-ఫౌండర్ నితీశ్ రెడ్డి పర్వతం సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘చీరలు, డ్రెస్ మెటీరియల్, హోం డెకోర్ ఉత్పత్తులను 3డీ రూపంలో మార్చవచ్చు. ఫొటోషూట్స్ ఖర్చులు ఉండవు. భారత్‌తోపాటు శ్రీలంక, బంగ్లాదేశ్, దుబాయికి చెందిన 260 మంది కస్టమర్లు విజయవంతంగా వ్యాపారాన్ని విస్తరించారు. భారత్‌లో ప్రముఖ ఫ్యాషన్ ఈ-కామర్స్ కంపెనీ ఈ జాబితాలో ఉంది. ఏడాది కాలంలో మా క్లయింట్లు 80 వేలకుపైగా 3డీ చిత్రాలతో అమ్మకాలను సాగించారు. కోవిడ్-19 కారణంగా వినియోగదార్లు ఆన్‌లైన్‌కు మళ్లుతుండడంతో మా క్లయింట్ల సంఖ్య పెరుగుతోంది. 100 క్రెడిట్స్‌కు రూ.5,000 చార్జీ చేస్తున్నాం. రూ.3 లక్షల వార్షిక ఫీజుతో అపరిమిత క్రెడిట్స్ వాడుకోవచ్చు’ అని వివరించారు. -
రోల్ మోడల్ గా 'ట్వంటీ 20'..!
క్రికెట్ లో ఎంతో గుర్తింపు పొందిన ట్వంటీ 20 పేరు... ఇప్పుడు కేరళ పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రత్యేక స్థానం సంపాదించింది. గ్రామంలో సమూల మార్పుల కోసం కృషి చేసేందుకు స్థానిక వస్త్ర పరిశ్రమ సభ్యులు.. ట్వంటీ20 పేరున ఎన్నికల్లో నిలిచి.. అత్యధిక మెజార్జీతో గెలిచి.. నూతన అంకానికి తెరతీశారు. ఉత్పాదక రంగంనుంచీ రాజకీయ రంగంలో ప్రవేశించారు. గతంలోని సాంప్రదాయ వస్త్రధారణను సైతం తోసిరాజని హైటెక్ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. స్థానిక రాజకీయాలు తమ సంస్థ అభివృద్ధికి అడ్డుపడుతుండటంతో.. రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని ఉద్యోగులే సంచలన నిర్ణయం తీసుకొని ఏళ్ళ చరిత్రను తిరగరాశారు. కేరళ ఎర్నాకుళం జిల్లాలోని కిజక్కంబాలమ్ పంచాయితీ ఎన్నికల్లో కోచీ ఆధారిత వస్త్ర తయారీదారీ సంస్థ కైటెక్స్ గ్రూప్ విజయపతాకం ఎగురవేసింది. గ్రామాభివృద్ధే ధ్యేయంగా శాశ్వత ఉద్యోగులు రాజకీయాల్లో అడుగుపెట్టారు. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలో ఉన్నపుడు... పంచాయితీ అభివృద్ధికోసం కైటెక్స్ చేపట్టిన ప్రతి ప్రాజెక్ట్ ను అడ్డుకుంది. సెక్షన్ 144 కింద నేషేధాజ్ఞలు విధించి ట్రేడ్ ఫెయిర్ ను బలవంతంగా మూసివేయించింది. ఇటువంటి అనేక కారణాలతోనే ఎన్నికల్లో పోటీకి సిద్ధపడాల్సి వచ్చిందని మాజీ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, కైటెక్స్ మేనేజింగ్ డైరెక్టర్ జాకబ్ చెప్తున్నారు. లేదంటే తమకు రాజకీయాల్లో ప్రవేశించే ఉద్దేశ్యమే లేదని, సామాజిక బాధ్యతగానే గ్రామాభివృద్ధిని కాంక్షిస్తున్నామని సాబు జాకబ్ అంటున్నారు. ట్వంటీ20 అభివృద్ధి మంత్రం ఓటర్లపై భారీ ప్రభావం చూపడంతో మొత్తం పంచాయితీలోని 19 వార్డుల్లో 17 వార్డుల్లో విజయ పథంలో దూసుకుపోయారు. ఈసారి ఓనమ్ పండుగకు ప్రత్యేక ట్రేడ్ ఫెయిర్ నిర్వహిస్తామని, ప్రజలకు వస్తువులను సగం ధరకే అందిస్తామని చెప్తున్నారు. 1968 నుంచి కైటెక్స్ పరిశ్రమ ఎటువంటి ఫిర్యాదులు లేకుండా పనిచేస్తుండగా... ఎల్డీఎఫ్ అధికారంలోని చేదు అనుభవాలే తమను పోటీకి నిలబడేలా చేశాయని జాకబ్ చెప్తున్నారు. యూడీఎఫ్, ఎల్డీఎఫ్ ఆధ్వర్యంలో స్థానికంగా ఎటువంటి అభివృద్ధీ జరగకపోవడంతోనే స్థానికులు తమను గెలిపించారని, ట్వంటీ20 సభ్యుడు, కంపెనీ చిత్రకారుడు శిబు కుమరన్ చెప్తున్నారు. ట్వంటీ20 అధికారంలోకి రాకముందే.. సామాజిక సేవలో భాగంగా సగం ధరకు నిత్యావసర వస్తువులు అదించిందని, నాలుగు వందల ఇళ్ళు, ఐదు వందల టాయిలెట్లు కూడ నిర్మించి ఇచ్చిందని చెప్తున్నారు. దీనికి తోడు రోడ్లు రిపేర్లు చేయించడం, పేదలకు వైద్యం అందించడం వంటి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడంతోనే తమకు స్థానికులు పట్టం కట్టారని చెప్తున్నారు. ముఖ్యంగా గ్రామాన్ని వ్యవసాయంతోపాటు అన్నిరంగాల్లో అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తామని, ఇప్పటికే ట్వంటీ20 అభివృద్ధి పనులకోసం 36 కోట్ల రూపాయలను వెచ్చించడంతోపాటు... వచ్చే ఐదేళ్ళలో మొత్తం 350 కోట్ల రూపాయలను వెచ్చించేందుకు ప్లాన్ చేస్తోందన్నారు. కైటెక్స్ గ్రూప్, ఇతర కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతగా నిధులు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నాయని, అలాగే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే నిధులను వినియోగిస్తామని జాకబ్ చెప్తున్నారు. నిధులను సక్రమంగా వినియోగించడానికి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్నవారిని ప్రత్యేకంగా టీమ్ లో ఉంచామని చెప్తున్నారు. ఎన్నికైన పంచాయితీ అధికారులకు నెలసరి వేతనం 3,500 రూపాయలు మాత్రమే ఉందని, గ్రామీణ ఉపాధిహామీ పథకంలో కార్మికులకు చెల్లించే వేతనాల కంటే అధికారులకు అన్యాయంగా ఉండటంతో వారి వేతనం 15 వేలకు పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఇది అధికారులు అవినీతికి పాల్పడకుండా ఉండేందుకు తోడ్పడుతుందని ఆశిస్తున్నారు. పంచాయితీ అధికారులు ఫంక్షన్లకు, ప్రారంభోత్సవాలకు అనవసరంగా సమయం వృధా చేయకుండా..పంచాయితీ కార్యాలయంలో కొంత సమయాన్ని కేటాయించి... అభివృద్ధికోసం పాటుపడాలని ట్వంటీ20 సభ్యులకు నిబంధనలను విధించారు. వారికి సహకరించేందుకు సామాజిక కార్యకర్తలను కూడ ఏర్పాటు చేశారు. కిజక్కంబాలమ్ పంచాయితీ చేపట్టిన ప్రత్యేకాభివృద్ధి పై రాష్ట్రంలోని పంచాయితీలన్నీ దృష్టి సారిస్తున్నాయి. ఈ గ్రామాన్ని రోల్ మోడల్ గా తీసుకొనేందుకు ఆసక్తి చూపుతున్నాయి. అంతేకాక యూఎస్ ఆధారిత వ్యాపార సంస్థలు సైతం... కేరళలోని పది పంచాయితీలను దత్తత తీసుకొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. అయితే డబ్బు, ప్రతిభ ఉన్నంత మాత్రాన అభివృద్ధి సాధ్యం కాదని, ప్రజల అంకిత భావంకూడ ఎంతో అవసరమని జాకబ్ చెప్తున్నారు.