
సాక్షి, న్యూఢిల్లీ : హాస్టల్ ఫీజుల పెంపుదలను పూర్తిగా వెనక్కితీసుకోవాలని కోరుతూ జేఎన్‌యూ విద్యార్ధులు చేపట్టిన ఆందోళనలతో ఢిల్లీ హోరెత్తింది. జేఎన్‌యూ విద్యార్ధుల ఆందోళన నేపథ్యంలో పోలీసుల సూచనతో ఢిల్లీ మెట్రో ఉద్యోగ్ భవన్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్ల వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసివేసింది. మరోవైపు సెంట్రల్ ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్ స్టేషన్‌లో మెట్రో రైళ్లు ఆగవని ఢిల్లీ మెట్రో తెలిపింది. ఢిల్లీ పోలీసుల సూచనల మేరకు ఆయా మెట్రో స్టేషన్లలో మెట్రో ట్రైన్లు ఆగవని వాటి వద్ద ప్రవేశ, నిష్ర్కమణ ద్వారాలను తాత్కాలికంగా మూసివేశామని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తన ట్విటర్ ఖాతాలో పేర్కొంది. మరోవైపు ఆందోళన బాట పట్టిన విద్యార్ధులు, జేఎన్‌యూ అధికార యంత్రాంగం మధ్య సయోధ్య సాధించేందుకు మాజీ యూజీసీ చీఫ్ డాక్టర్ వీరేందర్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో ఓ కమిటీని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment