పైలట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన మిగ్-21 విమానం
జైపూర్ : ఆకాశం నుంచి జెట్ విమాన ఇంధన ట్యాంకులు పడటంతో జైపూర్ నగరానికి సమీపంలోని ఓ గ్రామ ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఇంధన ట్యాంకులను భారతీయ వాయుసేనకు అందజేశారు.
దీనిపై మాట్లాడిన పోలీసులు.. జెట్‌ను పరీక్షిస్తుండగా సాంకేతిక లోపం తలెత్తడంతో ముందుజాగ్రత్తగా పైలట్లు ఇంధన ట్యాంకులను జార విడిచారని చెప్పారు. అనంతరం జెట్‌ను సన్‌గనేర్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు వివరించారు. గ్రామ సరిహద్దులోని కొండ ప్రాంతంలో ఇంధన ట్యాంకులు పడ్డాయని వివరించారు.
కాగా, ఇంధన ట్యాంకులు కింద పడిన సమయంలో పేలుడు సంభవించడంతో.. ఏదో జరిగిపోతోందని భయాందోళనలకు గురైన ప్రజలు పరుగులు తీసినట్లు వెల్లడించారు. కాగా, ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన మిగ్ -21కు మరమ్మత్తులు చేస్తున్నట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment