లక్నో : దేశ వ్యాప్తంగా వివిధ రాష్టాల్లో ఉంటున్న వలస కూలీలకు కరోనా పాజిటివ్‌గా తేలడం కలకలం రేపుతోంది. లాక్‌డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కూలీల తరలింపునకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న మహారాష్ట్ర కూలీలను వారి స్వస్థలాలకు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. అయితే వారిని రైల్వే స్టేషన్‌కు పంపే ముందు అధికారులు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏడుగురు మహారాష్ట్ర వలస కూలీలకు కరోనా పాజిటివ్‌గా తేలడం తీవ్ర కలకలం రేపింది. దీంతో వారందరినీ అక్కడే క్వారెంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు స్వస్థలాలకు వెళ్లేందుకు కూలీలు పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్లకు తరలివస్తున్నారు. (17దాకా లాక్‌డౌన్.. సడలింపులివే..!)
ఇక ముంబై నుంచి ఇటీవల చత్తీస్‌గడ్‌కు చేరుకున్న ఓ వలస కార్మికుడికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో స్థానిక ప్రభుత్వం అప్రమత్తమైంది. కాగా లాక్‌డౌన్ కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులను స్వస్థలాలకు చేర్చే శ్రామిక్ రైళ్ల ప్రయాణం మేడే రోజు ప్రారంభమైన విషయం తెలిసిందే. రైలులోనూ భౌతిక దూరం పాటించేందుకు వీలుగా ప్రతీ కోచ్‌లో 54 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. స్థానిక అధికారులు నిబంధనల ప్రకారం వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం స్వస్థలాలకు చేరుస్తారు. ఇళ్లల్లో కాని, ప్రత్యేక కేంద్రాల్లో కానీ వారిని క్వారంటైన్ చేస్తారు. (లాక్‌డౌన్ ఎత్తివేతపై హెచ్చరికలు)
Comments
Please login to add a commentAdd a comment