సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విస్తరించకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల లాక్‌డౌన్‌ను ప్రకటించారు. అయితే క్వారంటైన్‌లో ఉన్న వారికి కల్పిస్తున్న ఆరోగ్యభద్రత, వారికి అందిస్తున్న చికిత్స, అలాగే సామాజిక దూరం పాటిస్తున్న విధానం, కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు, మాస్క్‌లు, శానిటైజర్ల కొరత తదితర అంశాలపై మానిటర్ చేయడానికి ప్రతి రాష్ట్రానికి ఒక్కరిద్దరు మంత్రులను కేంద్రప్రభుత్వం ఇన్‌చార్జ్‌లుగా నియమించింది. ఈ వారంలో జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా చిన్న రాష్ట్రాలకు ఒక మంత్రిని ఇన్‌చార్జ్‌గా నియమించగా, కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు, పెద్ద రాష్ట్రాలకు ఇద్దరు మంత్రులను ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తున్నట్టు మోదీ తెలిపారు. వీరు ప్రతిరోజు నమోదవుతున్న కరోనా కేసులు, కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, సామాజిక దూరం, కార్వంటైన్‌లో ఉన్న వారికి కల్పిస్తున్న సదుపాయాలు, అవసరం ఉన్న వారికి అందుబాటులో ఉన్న కమ్యూనిటీ కిచెన్‌లు, ఇతర పరిస్థితులు అన్నింటికి సంబంధించిన సమాచారాన్ని ప్రతిరోజు ప్రధానమంత్రి కార్యాలయానికి అందించాలని ఆదేశించారు. జిల్లా మేజిస్ట్రేట్‌లు, జిల్లా కలెక్టర్లను అడిగి ప్రాథమిక స్థాయిలో సమాచారాన్ని తీసుకొని రిపోర్టును అందించాలని మంత్రులకు సూచించారు.
ఈ మేరకు కేంద్ర న్యాయ, సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తమ సొంత రాష్ట్రమైన బీహార్‌కి సంబంధించిన పరిస్థితిని ప్రతిరోజు తెలుసుకుంటూ రిపోర్టును అందిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... ‘మంత్రులందరూ జిల్లా మేజిస్ట్రేట్‌లు, జిల్లా కలెక్టర్లను అడిగి కిందిస్థాయి పరిస్థితులను తెలుసుకోవాలి. ఈ మహమ్మారికి వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కట్టుగా పనిచేయాలి’ అని మంత్రులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment